మాట తప్పి, మడమ తిప్పి...
ABN , Publish Date - Apr 08 , 2026 | 02:12 AM
ఏ మనిషికయినా స్థిరమైన అభిప్రాయం, నిబద్ధతతో కూడిన జీవనం ఎంతో ముఖ్యం. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులకు మరింత అవసరం. ఎందుకంటే, రాజకీయాల్లోని వ్యక్తులు కోట్లాది మంది జీవితాలను ప్రభావితం...
ఏ మనిషికయినా స్థిరమైన అభిప్రాయం, నిబద్ధతతో కూడిన జీవనం ఎంతో ముఖ్యం. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులకు మరింత అవసరం. ఎందుకంటే, రాజకీయాల్లోని వ్యక్తులు కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తారు. నిజమైన నాయకులు ఒక మాట మాట్లాడే ముందు సమాజానికి, తమను నమ్ముకున్న ప్రజలకు జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకుంటారు. సొంత ఎజెండా కంటే ప్రజల అభిమతానికే ప్రాధాన్యమిస్తుంటారు. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు ఇందుకు పూర్తి భిన్నం!
అవసరాలకు అనుగుణంగా జగన్ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు విశ్వసనీయత లేకుండా పోయింది. గతంలో తాను మాట్లాడిన మాటలు ప్రజలు మరిచిపోయి ఉంటారనే భ్రమలో ఒకే విషయంపై ఒక్కో సమయంలో ఒక్కో నిర్ణయం ప్రకటిస్తూ చంచల స్వభావాన్ని బయటపెడుతున్నారు. జగన్ నైజాన్ని చూసి రాష్ట్ర ప్రజలే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత నవ్యాంధ్ర ప్రదేశ్‌కు కొత్త రాజధాని ఉండాలని, సీమాంధ్రుల కలలు నెరవేర్చేలా, మన ఆత్మగౌరవం చాటేలా ఉండాలని సీఎం చంద్రబాబు భావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమదూరం పాటిస్తూ కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. ఆ సమయంలో జగన్ కూడా అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జై కొట్టారు. 30వేల ఎకరాల్లో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించాలని ఓ సలహా కూడా ఇచ్చేశారు.
అసలు సిసలు జగన్నాటకం 2019 ఎన్నికల ముందు నుంచి ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా అమరావతి రాజధానిపై తనకున్న చిత్తశుద్ధిని జగన్ చాటి చెప్పేలా తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ కట్టుకుని, సతీసమేతంగా గృహ ప్రవేశం చేశారు. రాజధాని ప్రాంతంలో ఇదిగో నా ఇల్లు... నీ ఇల్లు ఎక్కడ చంద్రబాబూ? అని గట్టిగా నిలదీశారు. ఈ జగన్ గర్జన చూసి, ఆయనకు అమరావతిపై ఎంత ప్రేమో! అనుకున్నారు ప్రజలంతా. ఆ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఊరూ వాడా తిరుగుతూ, తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అమరావతిని వాషింగ్టన్ డీసీగా అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. చెప్పడమే కాదు వైసీపీ భజన మండలి చేత కూడా చెప్పించారు. తర్వాత అధికారం మారి జగన్ జమానా ప్రారంభం కాగానే ఆయన నిజస్వరూపం బయటపడింది. అమరావతికి ఒక రాజధాని అయితే బాగుండదు, మూడు రాజధానులుండాలని అదే అసెంబ్లీ సాక్షిగా భారీ ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో తొలిసారి జగన్ చంచల స్వభావం ప్రజలకు అర్థమైంది.
ఆనాడు జగన్ బుర్ర నుంచి పురుడుపోసుకున్న మూడు రాజధానుల కాన్సెప్ట్‌తో నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండాపోయింది. మీ రాజధాని ఏదీ? అంటే సమాధానం చెప్పుకోలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుమిలిపోయారు. సమయం రానే వచ్చింది. 151 సీట్లు ఇచ్చిన అదే ప్రజలు 11 సీట్లకు వైసీపీని పరిమితం చేశారు. చివరకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టారు. మరో నాయకుడైతే ఎందుకీ పరాభవం అని బేరీజు వేసుకుని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకునేవాడు. కానీ, ఇక్కడ ఉన్నది జగన్!
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు భవిష్యత్తులోనూ అమరావతికి ఎవరి నుంచీ ముఖ్యంగా, జగన్ నుంచి ముప్పు లేకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వ సాయంతో చట్టబద్ధత కల్పించారు. ప్రధాని మోదీ సాయంతో పార్లమెంట్ రెండు సభల్లోనూ అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించేలా చూశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండడం చూసి ఓర్వలేని జగన్ మరో కొత్త రాజధాని బాంబు పేల్చారు. ‘మావిగన్’ పేరుతో రాజధానిని నిర్మించాలని సూచించారు. సూచించడమే కాదు, తన మీడియాలో పేజీలకు పేజీలు కథనాలు రాయిస్తున్నారు. జగన్ పైశాచికత్వం చూసి ప్రజలు మరోసారి షాకయ్యారు. చివరికి వైసీపీ నాయకులు సైతం ‘మాకు ఇదేం ఖర్మరా నాయనా?’ అనుకుంటూ
తమ నాయకుడికి సరైన వైద్యమందించాలని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్ మాట మార్చినట్లు మరెవరూ మార్చి ఉండరు. ఒకసారి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కదా, అక్కడి నుంచి పాలన చేస్తే సరిపోతుంది అన్నారు. మరోసారి గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి పాలించొచ్చు కదా అన్నారు. ఇంకోసారి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అన్నారు. దేశానికి రాజధాని ఉంటే రాష్ట్రానికి అవసరమా? అని రాజ్యాంగ నిపుణులు సైతం నోరెళ్లబెట్టే స్టేట్‌మెంట్ ఇచ్చారు. మాట మార్చిన ప్రతిసారీ ఓ కొత్త రాజధానిని కనిపెడుతుంటారు.
జగన్ ఒక్క రాజధాని విషయంలోనే కాదు, ఎన్నో విషయాల్లో మాట తప్పి, మడమ తిప్పేశారు. సంపూర్ణ మద్య నిషేధమని, ఏటా ఉద్యోగాల భర్తీ అని, సీపీఎస్ రద్దు అని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని... ఇలా ఆయా వర్గాల ప్రజలను నిలువునా మోసం చేశారు. జగన్ మాట తప్పిన సందర్భాలు చెప్పుకుంటూ పోతే రోజులు చాలవు. ఇటువంటి చంచల స్వభావం కలిగిన, అవకాశవాదంతో వ్యవహరించే వారిని ఎంత దూరం పెడితే ఆ సమాజానికి, ఆ రాష్ట్రానికి అంత మేలు! ఇది రాష్ట్రంలోని అయిదు కోట్ల ప్రజలందరి మాట!
ఎస్. సవిత
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్