Share News

నీకు ఎవరూ లేరు, ఇక భయం లేదు!

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:10 AM

విరామ చిహ్నాలను తన్నిపారేసి, అవునూ కాదని నానుస్తూ, దీర్ఘంగా అర్థరాహిత్యాన్ని మోస్తూ పాకుతున్న వెయ్యి కాళ్ళ కీటకాల్లా కనపడతాయి కాఫ్కా వాక్యాలు (కానీ ఏ ఒక్క అక్షరమూ...

నీకు ఎవరూ లేరు, ఇక భయం లేదు!

విరామ చిహ్నాలను తన్నిపారేసి, అవునూ కాదని నానుస్తూ, దీర్ఘంగా అర్థరాహిత్యాన్ని మోస్తూ పాకుతున్న వెయ్యి కాళ్ళ కీటకాల్లా కనపడతాయి కాఫ్కా వాక్యాలు (కానీ ఏ ఒక్క అక్షరమూ నిరర్థకం కాదు). పదం పక్కన పదాన్ని దీక్షగా కూర్చోపెట్టి, పాఠకుడి చుట్టూతానే వాడి ఆజన్మాంత కారాగారవాసాన్ని కడుతూ, వాణ్ణి ముట్టడించేందుకు పటిష్టంగా నిర్మాణమవుతున్న కోటలు అనిపిస్తాయి కాఫ్కా కథలు.

తన అస్తిత్వం బందీ కాబడిందని గ్రహించటం మానేసిన మనిషి ఇష్టంగా ఇరుక్కుపోయి, సంతోషంగా ఇబ్బందిని అనుభవిస్తూ వస్తున్న శిక్షాగృహాల నమూనాలు కూడా ఆ కథలు. ఆ శిక్షాగృహాల గోడలను పగులగొట్టుకోవటానికి ఉపయోగపడే పదునైన గొడ్డళ్ళు కూడా ఆ కథలే.

కాఫ్కా రచనలు పాఠకులను ఈ భూమ్మీంచి కాస్త ఎత్తులో ఉపరిభ్రమణం చేయిస్తూ మానవ జీవిత అస్తిత్వాన్ని, దాని నుండి విడివడి, కొంచెం పైనుండి గమనించేట్టు చేస్తాయి. ‘‘అదిగో! అది నీ బందీఖానా. నీవు అక్కడ బ్రతకవలసిందే, పై అప్పీలు చేసుకునే వీలు కూడా నీకు లేదనే తీర్పు ఇచ్చేశారు’’ అనే హెచ్చరికా చేస్తాయి. అయితే ఆ శిక్షను మోసుకుని ఇక్కడకు వచ్చిపడ్డ మనిషి ఏం చెయ్యాలి? మామూలుగా ఏం చేస్తుంటాడుట? తనకు విధించిన తీర్పును ఎదిరించే ప్రయత్నంలో రకరకాల వాదనలు చేస్తూ (ఏ ‘‘వాదమై’’నా వీగిపోయేదే), తన వాదమే తన అస్తిత్వం అని చెప్పుకుంటుంటాడు.

‘మెటమార్ఫసిస్‌’ కథలో గ్రెగర్‌ సంసా యాంత్రిక జీవితంతో విసిగి, మానవుడిగా తన ఉనికి అర్థరహితం కాకూడదనుకున్న మెలకువ తెచ్చుకున్న కీటకంగా మేలుకుంటాడు. ‘ద జడ్జిమెంట్‌’ అనే కథలో జార్జ్‌ తన ‘alienation వేదన’కు మందుగా పని చేసేది వివాహమా, రచనా వ్యాసంగమా అనే సందిగ్ధతలో తలమునకలవుతుంటే, తండ్రి ‘‘ఏట్లో దూకిచావు’’ అనే తీర్పు ఇస్తాడు. ‘ద ట్రయల్‌’ నవలలో జోసెఫ్‌ కె. సాదాసీదా బ్యాంకు ఉద్యోగిగా గానుగ ఎద్దులా తలవంచి బతికేస్తుంటే చెయ్యని పాపానికి ఒకరోజు పొద్దున్నే కోర్టు మనుషులొచ్చి ‘‘నిన్ను అరెస్ట్ చేస్తున్నాం’’ అంటారు. ‘ద కాసల్‌’ నవలలో K. మానవసంచారం, ఎటువంటి ఆఫీస్, ఏ పై అధికారీ లేని ఊరుకు లాండ్‌ సర్వేయరుగా బదిలీ చేయబడతాడు. ఇలా కాఫ్కా పాత్రలకు శిక్షలు పడుతుంటాయి, కానీ వారి నేరం ఏమిటన్నది వారికి ఎవరూ చెప్పరు. న్యాయం కోరుతూ ఎటు పోవాలో ఎవర్ని కలవాలో తెలియదు. అసలు న్యాయస్థానం ఎక్కడుందో దానికి ప్రవేశం ఎలానో తెలీక గిజగిజలాడతారు.


కాఫ్కా సున్నితమైన మనసు మీద ప్రతి ప్రభావమూ అత్యంత గాఢంగా పడేది. తీవ్ర మనస్తత్త్వ చింతన చేసేవాడు కాబట్టి తనను తాను ఏ పక్షపాతం లేకుండా విశ్లేషణ చేసుకునేవాడు. ఈ కారణంతోనే నిజజీవితంలోని సంఘటనలను, వ్యక్తులను కాఫ్కా ఉన్నదానికంటే చాలా తీక్షణంగా కథల్లో చిత్రించాడు.

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని కాఫ్కా చెప్పినపుడు, ‘‘ఆ పిల్ల కుచ్చుల జాకెట్ ఏదో వేసు కొని ఉంటుంది, ఆ యూదు ఆడవాళ్ళ వేషాలివన్నీ. నీవు వెంటనే పడిపోయి ఆ పిల్లతో పెళ్లి అనేస్తున్నావు’’ అన్న తండ్రి మాట, ‘ద జడ్జిమెంట్‌’ కథలో ‘‘ఏట్లో మునిగి చావు’’ అయింది. కఠినుడైన కథలోని తండ్రి నిజానికి కాఫ్కా స్వంత అంతరంగమే. వాస్తవ జీవితంలోని ప్రేరకాలను ‘‘ఇవి అసంబద్ధం’’ అనిపించే తీవ్రతతో రచనలోకి తేవడమే కాఫ్కా క్రాఫ్ట్. ఆ ప్రేరకాల ప్రభావాన్ని పెను బూతద్దంలో చూపిస్తూ భయోపేతంగా నిలబెడుతూనే, మరోవైపు ఇది కేవలం పీడకల అని రద్దు చేయడం కాఫ్కా కళ. అతని కథల్లోని వివిధ పాత్రలన్నీ తన అంతఃచేతనలోంచి వచ్చినవే. నేరభావన, తిరగబడాలనే తత్త్వం – మనిషి అంతఃకరణ అనే నాణానికి ఇరుముఖాలుగా చూపిస్తాడు. ‘‘నేను ఏ పాపం ఎరుగను అని ఎప్పుడూ అనుకోకు’’, ‘‘దేవుడి చికాకుకు రూపాలం మనం, మనకు నిష్కృతి లేదు’’, ఈ రెండూ కాఫ్కా వాక్యాలే.

సగటు మనిషికి న్యాయం ఎంత అలభ్యమో ‘బిఫోర్‌ ద లా’ అనే కాఫ్కా స్కెచ్‌లో ఉంది. న్యాయగృహం ఎదుట ఒక కాపలావాడు నిల్చునుంటాడు. ఒక మనిషి అక్కడకు వచ్చి నన్ను లోపలికి వెళ్ళనివ్వు అంటాడు. ద్వారపాలకుడు ‘‘ఇప్పుడు కాదు’’ అంటాడు.

‘‘తర్వాత పోవచ్చా నేను?’’

‘‘బహుశా!’’

అలా ఏళ్ళతరబడి పదే పదే ద్వారపాలకుడిని ‘‘నేను లోపలకు పోవచ్చా? పోవచ్చా?’’ అని అడుగుతునే ఆ పాత్రకు వార్థక్యం, అంతిమ ఘడియలు వచ్చేస్తాయి. చివరకు చుట్టూ చీకటి పడిపోయింది అని మూసి ఉన్న ఆ ద్వారపు సందులోంచి ఇవతలకి కనపడుతున్న వెలుగు వల్ల తెలుస్తుంది. వంగిపోయి క్షీణించిన ఆ మనిషి కాపలావాడిని అడుగుతాడు, ‘‘ఇక్కడ లోపలికి అనుమతి అడుగుతూ నేను తప్ప ఇంకెవరూ ఎందుకు రాలేదు?’’ అని. ఈ ముసలోడు మరో అరక్షణంలో ఎలాగూ చనిపోతాడని దయతలచి ఆ కాపలావాడు, ‘‘ఈ ద్వారం ఉన్నది కేవలం నీకోసం మాత్రమే, మరెవరూ ఇక్కడకు వచ్చే అవకాశం లేదు, కానీ నీవు ఈ తలుపులు దాటే వీలు లేదు, నిన్ను అనుమతించే అధికారం నాకూ లేదు,’’ అని ఆ ముసలి చెవిటి చెవిలో గట్టిగా అరిచి చెప్తాడు.

00-Vividha-edit.jpg

ఆ కనపడే ద్వారం దాటగలిగితే తమకు న్యాయమూ, పరమ స్వేచ్ఛారూపమైన అస్తిత్వమూ దొరుకుతాయని కాఫ్కా పాత్రల నమ్మకం. కానీ లోపలకు పోయే అనుమతి వాళ్ళకు ఎప్పటికీ దొరకదనీ తెలిసిన నిస్సహాయులు వారు.


షోపెన్‌హోవర్ ద్వారా కాఫ్కా పైన ఉపనిషత్తుల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. అతని డైరీలు ఉత్తరాల్లో అందుకు ఆధారముంది. జిజ్ఞాసువుగా ఎంత దూరం వెళ్ళగలడో వెళ్ళాడు. క్రిస్టియానిటీ అయినా జుడెయిసమ్ అయినా ఉపనిషత్తులైనా ఏం చెబుతున్నాయో విన్నాడు, అంతవరకే. అవి ఉన్నది అని చెప్పిన ఆ పరమసత్యాన్ని చూచానని ఎక్కడా అబద్ధం చెప్పలేదు. ‘ఈ జీవితం ఏమిటి?’ అనే సత్యాన్వేషణ చేయవలసిందే మనిషి, కానీ కడపటికి ఒక ఆవలి ఒడ్డో, ఒక సత్యమో, ఒక వెలుగో మనిషిని తన ఒడిలోకి ప్రేమగా తీసుకుంటుంది అని రూఢీగా చెప్పలేరెవరూ, ఇంతవరకూ చెప్పలేదు ఎవరూ, నాకూ తెలియలేదు చివరివరకూ అని ఒప్పుకున్న నిజాయితీ ఉన్న తాత్త్వికుడు కాఫ్కా. ‘‘అవతలకు మార్గం ఉంది, కానీ అక్కడ గమ్యం లేదు’’ కాఫ్కా వాక్యం.

పోనీ, ఇక్కడ చుట్టూ చూస్తే కనపడినమేరా ఒక నిరంకుశ, వివేకరహిత, హాస్యాస్పద, నిరర్థక వ్యవస్థ నడుస్తుంటుంది అన్ని రంగాలలో (రాజకీయ, న్యాయ, సాంఘిక, కౌటుంబిక, మత, ఆధ్యాత్మిక). అన్ని తలాలలో ఒక నిరంకుశ ప్రభువు పాలన జరుగుతుంటుంది. ఆ ప్రభువు నాన్న కావచ్చు, పై అధికారి కావచ్చు, సహోద్యోగి, ఇరుగు పొరుగు, ఇంటి ఓనరు, సంపాదనలేని ఆర్టిస్ట్, కింది కోర్టులో తపాలా బంట్రోతు, అంతిమంగా పరలోకపు తండ్రి... ఎవరైనా కావచ్చు.

ఇదంతా అన్యాయం అని అరవాలని ఉంటుంది. నా నేరం ఏదో ఉండే ఉంటుందనీ అనిపిస్తుంటుంది. పైకి మాత్రం నేను ఏ తప్పూ చేయలేదనే వాదనలు చేస్తూనే తనకు పడవలసిన శిక్షను వెతుక్కుంటూ తిరుగుతుంటాడు మనిషి. చివరకు, జీవితాన్ని తన మీద జరుగుతున్న ఒక నేర విచారణ లాగ చూడటానికి అలవాటు పడతాడు. అందుకే ఉన్నట్లుండి తను కీటకంగా మారినా, మరో కథలో పొద్దున్నే కాఫీ బదులు వాకిట్లోకి అరెస్ట్ వారెంట్ వచ్చినా పెద్దగా ఆశ్చర్యపడడు. మానవ జీవితాన్ని తను చూసే ఈ విధానం, తన కళకు ఎంచుకున్న కాన్వాస్ ఒకటే మెటీరియల్ కాఫ్కాకు.


పూర్తి మెలకువలోను, గాఢ నిద్రలోను ఉండే చైతన్యాలకు లేని ఒక అతీంద్రియ శక్తి, నిద్రామెలకువ కాని స్థితిలో పనిచేసే చైతన్యానికి ఉంటుంది. కనిపించే లోకానికి, దానికి అవతలున్న లోకానికి మధ్య ఉండే త్రాటి మీద నడుస్తూ ప్రస్తుత భౌతికలోకాన్ని కొంచెం ఎత్తు నుండి చూసే సామర్థ్యం ఉంది దానికి. కాఫ్కా కథలు ఆ కొంచెం ఎత్తును అనువుగా ఉపయోగించుకుని సమస్తాన్ని చూస్తుంటాయి. ఆ ప్రత్యేకావస్థలో లభ్యమయ్యే చైతన్యపు యవనిక మీద అతని రచనలు ప్రొజెక్ట్ అవుతాయి. కాఫ్కా పాత్రలు అటు మరీ అమూర్త, అస్పష్ట రూపాలూ కాదు; ఇటు నూరు శాతం నేల మీదే నడిచే వాస్తవ రూపాలూ కాదు. ఎంత నిజమో అంత భ్రమ కాఫ్కాకు ఈ జీవితమూ, ప్రపంచమూ. జీవితం అంతా ఆ స్పష్టవిభ్రమ తాలూకు క్లారిటీతో జీవించాడు.

ఒకసారి తన ఇరవై ఏళ్ల వయసులో, ప్రాగ్ నగర సమీపాన పర్వతసానువుల్లో పడుకుని మెలాంకలిక్ క్షణాలలో తేలిపోతున్న తనను ఒక సత్యస్ఫురణ తాకిందనీ, ఆ క్షణంలో ఈ జన్మకు తను కోరుకోదగిన కోరిక ఒక్కటేనని తెలుసుకున్నాను అనీ అంటాడు: ‘‘జీవితం తన సహజమైన కఠినమైన ఒడిదుడుకులతో ఉంటూనే, అదంతా ఏమీ కాని ఒక విషయం లాగ, ఒక కల లాగ, నేలపైన కాలు ఆన్చకుండా తేలిపోతున్నదానిలాగా నాకు ప్రతిక్షణం స్పష్టంగా తెలియవస్తుండాలి. అలా చూడగలిగిన దృక్పథం నాకు పట్టుబడాలి, అదే నా బలమైన కోరిక’’ అని అని అతని ‘Contemplations’లో అంటాడు.


ఉనికికీ శూన్యానికీ మధ్య మనిషి అస్తిత్వాన్నే వేలాడదీసిన తరువాత మనిషి చేసే ఏ పనికైనా ఇక ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వాలి, అసలు ఏ పనైనా చేసే అవసరం, ఆ పనిలో అర్థం ఉన్నాయా? దానికి జవాబు, తనకు ఇరవైఏళ్ళ వయసులో దొరికిన సాక్షాత్కారంలోనే ఉందంటాడు: ‘‘ఒక మేజాబల్లను చేసేవాడు ఎట్లా దాన్ని జాగ్రత్తగా కోసి, చెక్కి, చక్కగా చిత్రిక పట్టి ఆ పనే తనకు ప్రాణం అంత ప్రాముఖ్యం అనిపించేలాగ చేస్తున్నట్లు కనిపించాలో, వాడికి అసలు ఆ కార్పెంటరీ పని పెద్ద ప్రాముఖ్యం అయిన పనేకాదు అని అనిపించేట్టూ కనపడాలి.’’ ఈ పరస్పరవిరుద్ధమైన లక్షణాలు, పనిలో అద్భుతమైన కళ చూపించే కార్పెంటర్ కాఫ్కా ఊహలో మనిషి. అతనే కాఫ్కాకు మార్గదర్శి. కాబట్టే, జీవితంలో తిండి, ఆరోగ్యం, వివాహం, తత్త్వవిచారం, ఆఖరుకి ప్రియమైన సంగీతం అన్నీ త్యాగం చేసి, (‘‘ఆ విషయాలలో నా శక్తులు, ఆసక్తులు నిశ్శేషంగా క్షీణించాయి’’) రాతను తపస్సు చేసుకుని సాహిత్యాన్ని సృష్టించాడు కాఫ్కా. తీవ్రమైన అస్తిత్వవేదన, దానిని చూడగల ఒక ఆధునిక దార్శనికత విడదీయలేని విధంగా పెనవేసుకుపోయిన వ్యక్తిత్వమూ, సాహిత్యసృష్టి కాఫ్కా మార్క్. తన రచనలకు విషయమూ శైలి కూడా ఆధునిక మానవుడి అర్థరాహిత్య అస్తిత్వం తనలో రేపిన గాయం నుండే తోడుకున్నాడు.

కాఫ్కాకు సాహిత్య రచన ఒక సాధనం. ప్రహేళిక వంటి తన నిగూఢ తత్త్వాన్ని తనకే విశద పరచే సాధనం.

అతని వాక్యం ఒకే విషయాన్ని అవునూ కాదూ రెండూ అంటుంటుంది. కాఫ్కా రచనలకు వస్తువూ, శైలి రెండూ ఈ అవును కాదుల సహజీవనమే.

పద్మజ సూరపరాజు

99403 44406

ఇవీ చదవండి:

బడ్జెట్ 2026.. ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టుకు నిధులు కేటాయించని కేంద్రం

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

Updated Date - Feb 02 , 2026 | 01:10 AM