మహిళా రిజర్వేషన్ల అమలులో అసలు మతలబు
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:11 AM
‘చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 33శాతానికి పెంచేందుకు నారీశక్తి వందన్ అధినియం బిల్లును తీసుకురావడం శుభపరిణామం’ అని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్...
‘చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 33శాతానికి పెంచేందుకు నారీశక్తి వందన్ అధినియం బిల్లును తీసుకురావడం శుభపరిణామం’ అని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్.వై.ఖురేషీ అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితం పార్లమెంటులో మహిళా బిల్లు పాసైన సందర్భంలో ఆయన ఇలా స్పందించారు. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయన్న అంశాన్ని నిరసిస్తూ, ఏళ్ల తరబడి కొనసాగే ఆ ప్రక్రియలతో మహిళా బిల్లుకు లంకె పెట్టి, ఇలా సాగదీస్తూ వెళ్లడం సరికాదన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే స్ర్తీలు మహిళా రిజర్వేషన్ల ఫలాలను అందుకోవడానికి 2030వ దశకం వరకు వేచిచూడాల్సిందేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి!
రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్లు స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ఉన్నాయి. అయితే, రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ మాత్రం 1980వ దశకంలో వేగం పుంజుకున్నది. ఈ రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి 1987–88లో రాజీవ్‌గాంధీ హయాంలో కేంద్రమంత్రి మార్గరెట్ అల్వా నేతృత్వంలో 14 మంది సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటైంది. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు నిర్దిష్ట సంఖ్యలో సీట్లు కేటాయించాలని మొదటిసారిగా ఈ కమిటీ ప్రతిపాదించింది.
చట్టసభల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని 1996లో దేవెగౌడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 81వ రాజ్యాంగ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ‘జుట్టు కత్తిరించుకున్న మహిళలు మన గురించి ఏం నిర్ణయిస్తారు?’ అంటూ శరద్‌యాదవ్ వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదానికి దారితీశాయి. రిజర్వేషన్ల బిల్లుపై పునఃసమీక్ష కోసం నాటి ఎంపీ గీతాముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. స్ర్తీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ మహిళలకు అప్పటికే అమలవుతున్న రిజర్వేషన్లలో అంతర్గత కోటా కల్పించాలని, తగిన సమయంలో ఓబీసీ మహిళలకు కూడా రాజకీయంగా సబ్–రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని, రాజ్యసభ, శాసనమండళ్లలోనూ రిజర్వేషన్లు ఉండాలని... ఈ కమిటీ పలు సిఫారసులు చేసింది.
గతంలో అనేక ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ, రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల అది చట్టంగా మారలేదు. ఎట్టకేలకు 2023లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఉభయ సభల ఆమోదం, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో మహిళా రిజర్వేషన్లకు మార్గం ఏర్పడింది. ఈ చట్టం ప్రకారం.. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా 33శాతం మహిళలకు కేటాయిస్తారు. ఈ రిజర్వేషన్లు ప్రారంభంలో పదిహేనేళ్లపాటు అమలులో ఉంటాయి. అయితే, ఇందులో గీతాముఖర్జీ కమిటీ సూచించినట్లుగా రాజ్యసభ, శాసన మండళ్లు, ఓబీసీ మహిళల రిజర్వేషన్ తదితర అంశాల ప్రస్తావన లేదు! నారీశక్తి వందన్ అధినియం చట్టంగా మారినప్పటికీ అది వెంటనే అమల్లోకి రాదు. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించిన తర్వాతే ఈ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. చట్టంలోనూ ఇదే పేర్కొన్నారు.
ఎంత వేగంతో పనిచేసినా నియోజకవర్గాల పునర్విభజన 2032 లేదా 2033 కంటే ముందు ముగియదు. అంటే 2029లో మహిళా రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితులున్నప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇప్పుడు చేసి, అమలును మాత్రం డీలిమిటేషన్ తర్వాతే అని ఎందుకు మెలికపెట్టింది?! వాస్తవానికి బీజేపీ అసలు ఉద్దేశ్యం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు. రిజర్వేషన్లు తామే కల్పించామని ప్రజల్లోకి వెళ్లడం. చిత్తశుద్ధితో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా తక్షణమే చేయవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్–15 అందుకు అవకాశం కల్పిస్తున్నది. అలాచేస్తే ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలో 181 నియోజకవర్గాలు మహిళలకు కేటాయించబడతాయి, ఫలితంగా ఆ స్థాయిలో పురుష అభ్యర్థులు రాత్రికి రాత్రే తమ స్థానాలను కోల్పోతారు. ప్రస్తుత పురుషాధిక్య రాజకీయాలు అందుకు సిద్ధంగా లేవు.
మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో బీజేపీ ముడిపెట్టింది. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమోనని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి భయాల కారణంగానే 1976 నుంచి డీలిమిటేషన్‌ను నిలిపేశారు. ఇప్పుడు మళ్లీ అదే సమస్య. మరి ఈ పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలా అమల్లోకి తీసుకురాగలుగుతుంది. దీనికి కేంద్రం స్పష్టమైన సమాధానం చెప్పాలి.
ఎర్రబెల్లి స్వర్ణ
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఇవి కూడా చదవండి..
5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్