Share News

వన్య మృగాలతో వ్యవసాయ నష్టాలు!

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:28 AM

వన్య మృగాలు పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులకు ఆర్థిక నష్టాలను మరింతగా పెంచుతున్నాయి. అడవి జంతువుల కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వ్యవసాయం...

వన్య మృగాలతో వ్యవసాయ నష్టాలు!

వన్య మృగాలు పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులకు ఆర్థిక నష్టాలను మరింతగా పెంచుతున్నాయి. అడవి జంతువుల కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వ్యవసాయం లాభదాయకం కావడం లేదు. పెద్ద పులులు, ఏనుగులు, చిరుత పులులతో పాటు అడవి పందులు, మగ జింకలు తదితర గిట్టలు లేదా డెక్కలు గల జంతువులు, మరీ ముఖ్యంగా భారీ నష్టం కలిగించే కోతులను నియంత్రించేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్య ప్రాణులతో మన పంటలకు చెప్పలేని నష్టం వాటిల్లుతోంది. ఇది వాస్తవం. అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవడం అటుంచితే, అసలు దానిపై చర్చించేందుకు సైతం మనం సమ్మతించడం లేదు. ఈ సమస్యపై చర్చను సాధ్యమైనంతవరకు నివారించేందుకే వన్య ప్రాణుల సంరక్షణ నిపుణులు, కార్యకర్తలు పలు విధాలా ప్రయత్నిస్తున్నారు. వారి ఈ వైఖరి, బహుశా, సహేతుకమే కావచ్చు. ఎందుకంటే వన్యప్రాణులు, మానవుల మధ్య సంఘర్షణలు సంభవిస్తే అందుకు బాధ్యత పూర్తిగా మానవులదే అవుతుంది, సందేహం లేదు.

వన్యప్రాణుల సహజ ఆవాసాలను మనుషులు ధ్వంసం చేస్తున్నారు. అడవులలోనే ఉండిపోకుండా, ఆహారం కోసం అవి అరణ్యాల నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. దుర్గమారణ్యాల నుంచి వెలుపలకు వచ్చిన అడవి జంతువులు ఊళ్లపై పడుతున్నాయి, పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రాణ రక్షణకు, పంటలను కాపాడుకునేందుకు మనుషులు వాటితో తలపడడం అనివార్యమవుతోంది. వన్యప్రాణుల సంరక్షణ విజయవంతమవడం కూడా ఈ సంఘర్షణలకు ఒక పాక్షిక కారణం. అయితే ఇది రైతుల దురవస్థలను ఉపేక్షించేందుకు కారణం కాకూడదు.


పూణేలోని సుప్రసిద్ధ ‘గోఖలే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌’ గత ఏడాది ‘మానవ–వన్య ప్రాణుల సంఘర్షణలు: మహారాష్ట్రలో నికర వ్యవసాయక నష్టాలపై ఒక అంచనా’ అన్న నివేదికను వెలువరించింది. మానవులు, అడవి జంతువుల మధ్య ఘర్షణలపై మన దేశంలో ఇంతవరకు జరిగిన ఏకైక అధ్యయనమది. వన్యమృగాల మూలంగా మహారాష్ట్రలో వ్యవసాయదారులకు ఏటా 10 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లుతున్నదని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఇది చాలా తక్కువ అంచనా అని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. అడవి జంతువుల బెడద మూలంగా 62శాతం మంది రైతులు తమ పంటల సాగు విస్తీర్ణాన్ని తగ్గించినట్టు కూడా ఆ అధ్యయనంలో వెల్లడయింది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. అకాల వర్షాలు, పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం తరువాత అడవి జంతువులతో పంటలకు సంభవిస్తున్న నష్టమే తామెదుర్కొంటున్న ప్రధాన సమస్య అని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. ఈ నష్టమే తమ ఆదాయం తగ్గిపోవడానికి ప్రధాన కారణమని వేలాది రైతులు వాపోయారు.

‘డౌన్‌ టు ఎర్త్‌’ ప్రతినిధులు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వన్యమృగాల దాడుల వల్ల రైతుల పంటలకు, వారి జీవనాధారాలకు నష్టం వాటిల్లుతోందని, ఫలితంగా పలువురు రైతులు తీరని రుణగ్రస్తతతో సతమతమవుతున్నారని స్పష్టమయింది. మానవులు, జంతువుల మధ్య సంబంధాన్ని మళ్లీ సమతుల్యంచేసి మనుషులు, జంతుకోటి నడుమ సహజీవనం నెలకొల్పేందుకు చేయవలసినదేమిటి అన్నది ఇప్పుడు మనముందున్న ప్రశ్న.

ఈ ప్రశ్నకు భారత ప్రభుత్వ ప్రతిస్పందన ఉత్సాహకరంగా లేకపోగా, చాలా నిరాశాజనకంగా, అయోమయం సృష్టించేదిగా ఉన్నది. సంతోషకరమైన విషయమేమిటంటే ఈ సంక్షోభ ‘స్వభావాన్ని’ ఇప్పుడు పాలకులు అంగీకరిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటల కాలం (జూన్‌–జూలై)లో జంతువుల సంబంధిత పంట నష్టాలను జాతీయ పంట బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో చేర్చారు. జంతువుల మూలంగా పంట నష్టానికి గురైన రైతులు 72 గంటల వ్యవధిలో అధికారులకు తెలియజేస్తే, డ్రోన్ల ద్వారా ఆ నష్టాన్ని ధ్రువీకరించుకుని నష్టపరిహారం చెల్లిస్తారు. ఈ పథకాల నిబంధనల దృష్ట్యా రైతులకు ఈ సహాయం కొనసాగుతుందో లేదో వేచి చూడవలసి ఉన్నది. వన్యప్రాణుల దాడులకు నష్టపోయిన రైతులలో 25శాతం మంది ఫిర్యాదు చేసినా, వారిలో కేవలం 1–2శాతం మందికి మాత్రమే నష్టానికి అనుగుణంగా నష్టపరిహారం చెల్లింపులు జరిగాయని పూణే నివేదిక పేర్కొంది. చాలా మంది రైతులకు ఆ పథకం గురించి తెలియనే తెలియదని, తెలిసినవారు సైతం అధికార యంత్రాంగం నుంచి ఎదురయ్యే చికాకులను భరించలేక నష్టపరిహారంపై ఆశలు వదులుకుంటున్నారని కూడా ఆ నివేదిక వ్యాఖ్యానించింది!


కేరళలో ఈ సమస్య తీవ్రరూపం సంతరించుకుంది. ఆ రాష్ట్రంలో అది కేవలం మానవులు –జంతువుల మధ్య సంఘర్షణే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా పరిణమించింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని సెక్షన్‌ 62 ప్రకారం, ఒక వన్య జంతువును ‘Vermin’ (పంటలకు హాని కలిగించే జంతువు)గా ప్రకటించే అధికారం ఒక్క కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. దరిమిలా ఆ జంతువును సంహరించేందుకు అటవీశాఖకు అనుమతినిస్తారు. వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు జంతువులు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నా వాటిని ‘Vermin’గా ప్రకటించేందుకు కేంద్రం సంకోచిస్తోంది. ఈ కారణంగా కేరళ ప్రభుత్వం 2024–25లో తన సొంత వన్యప్రాణి సంరక్షణ బిల్లును తీసుకువచ్చింది. అడవి పంది దాడులను రాష్ట్రవ్యాప్త విపత్తుగా ఆ బిల్లు ప్రకటించింది. ఆ అడవి జంతువును ‘Vermin’గా వర్గీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపేందుకు కేరళ గవర్నర్‌ ఎట్టకేలకు అంగీకరించారు. రైతులు తమకు తాముగా అడవి పందులను సంహరించేందుకు ఆ బిల్లు అనుమతినివ్వలేదు. అందుకు బదులుగా ఆ సంహార క్రియను నిర్వర్తించే అధికారాన్ని లైసెన్స్‌ ఉన్న తుపాకీ వీరులకు అప్పగించింది. గ్రామ పంచాయత్‌ల విజ్ఞప్తి మేరకు వారు ఆ వన్య జంతువును సంహరించేందుకు పూనుకోవల్సి ఉంటుంది.

పంటలకు నష్టం కలిగిస్తున్నవే అయినప్పటికీ రీసస్‌ కోతులకు సంరక్షణ కల్పించాలని గత సంవత్సరాంతంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ సిఫారసు చేసింది. ఈ కారణంగా వాటిని సంహరించడం అసాధ్యమవుతోంది. జంతు హక్కుల కార్యకర్తల ప్రోద్బలంతో ఆ సిఫారసు చేశారు. అయితే ఆ కోతులు పంటలకు హాని కలిగిస్తున్నందున వాటి సంఖ్యను నియంత్రించేందుకు అటవీ శాఖలు సకల ప్రయత్నాలు చేస్తున్నాయన్న వాస్తవాన్ని ఆ జాతీయ సంస్థ విస్మరించింది. అవగాహనా లోపమే అందుకు కారణమని నేను విశ్వసిస్తున్నాను. ఇది వన్య ప్రాణుల సంరక్షణకుగానీ, రైతుల శ్రేయస్సుకుగానీ తోడ్పడదు.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

ఇవి కూడా చదవండి

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

IPL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 01:28 AM