ముఖ్యమంత్రిపై ఎందుకింత అక్కసు?
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:59 AM
రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయకుడు. వ్యక్తులు, పార్టీల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన స్థానం అది. తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం నెలకొన్నది. తమ...
రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయకుడు. వ్యక్తులు, పార్టీల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన స్థానం అది. తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం నెలకొన్నది. తమ కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ ఆ స్థానంలో ఉన్నా వారిని అవమానించడమే లక్ష్యంగా కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తున్నది.
తెలంగాణ ఉద్యమాన్ని కవచంగా వాడుకొని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులైన చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలపై ఇష్టారీతిన విమర్శలు చేశారు. స్వరాష్ట్ర కాంక్ష అత్యున్నత దశలో ఉన్నందున ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే పూర్తి నిరంకుశ వైఖరిని ప్రదర్శించారు. పాలనలో లోపాలపై ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తెలంగాణ ద్రోహులుగా, వ్యతిరేకులుగా ముద్ర వేసి నోర్లు మూయించారు. రాయడానికి వీలుకాని రీతిలో ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల తీరుతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇది జీర్ణించుకోలేని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, ఇంకా ఆ పార్టీ నాయకులు నిత్యం ముఖ్యమంత్రి వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా అంతులేని దుష్ప్రచారానికి తెరలేపారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా చిన్న విమర్శ చేస్తే ‘‘గౌరవ ముఖ్యమంత్రిని విమర్శిస్తారా’’ అంటూ కేటీఆర్ సూక్తులు చెప్పేవారు. ఆ స్థానంలో మరో నాయకుడు వస్తే మాత్రం ‘హౌలాగాడు’, ‘గుంపు మేస్త్రి’, ‘చిల్లరగాడు’... లాంటి అసభ్య పదజాలం వాడుతూ తన బుద్ధిని చాటుకుంటున్నారు.
తండ్రి అధికారంలో ఉన్న పదేళ్లపాటు యువరాజుగా చలామణి అయిన కేటీఆర్, తన అడుగులకు మడుగులొత్తే అధికారులను నియమించుకొని ఫోన్ ట్యాపింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ప్రతి స్కీమ్‌ను స్కామ్‌గా మార్చి భారీగా పోగేసుకున్నారు. ఒక దశలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అన్నట్లు మంత్రులు, అనుచరులు ప్రకటనలు గుప్పించారు. కేటీఆర్ సైతం ఆ కలల్లో విహరించారు. కానీ ఆ కుర్చీని తండ్రి వీడలేదు. తర్వాతి ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారు. ఆ అసంతృప్తికి అహంకారం తోడవడంతో కేటీఆర్‌లో విచక్షణ నశించింది. ముఖ్యమంత్రిని దూషించడం, ఆ పదవిని అవమానించడమే కేటీఆర్ తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను సొంత మీడియాతోపాటు, వందలాది యూట్యూబ్ చానెళ్లను, వేలాది సంఖ్యలో వెబ్‌సైట్లను ఏర్పాటు చేయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. ఒక్కో దశలో అవి శ్రుతి మించడం, మళ్ళీ వెంటనే సర్దుకోవడం సహజంగానే జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ కుటుంబం ప్రజాస్వామ్య సంప్రదాయాలను, కట్టుబాట్లను గంగలో కలిపేసింది. తెలంగాణలోని సబ్బండ వర్ణాలు తమ కుటుంబానికి జేజేలు కొట్టాలని భావిస్తోంది. తమను వ్యతిరేకించిన వారిని అవమానిస్తోంది. ఏ విమర్శలు చేయాలీ, ఏమి చేయకూడదనే కనీస జ్ఞానం బీఆర్‌ఎస్‌లో లోపిస్తోంది.
యువతరాన్ని క్రీడల వైపు మళ్లించే ఉద్దేశంతో ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన సందర్భంలోనూ, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు కువిమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వెక్కిరిస్తూ బీఆర్ఎస్ కార్యాలయంలో ఓ స్కిట్ వేయడం వారి దిగజారుడుతనానికి పరాకాష్ఠ. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ విషవలయం పల్లెపల్లెకూ పాకింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ అంశంపై దృష్టి సారించకపోవడంతో చిన్నపిల్లలు సైతం డ్రగ్స్ విషకౌగిలిలో చిక్కుకున్నారు. యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడి, క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇలాంటి అంశాల్లో కూడా ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నేతలు కువిమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని దూషిస్తున్న కేటీఆర్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పదేళ్ల బీఆర్ఎస్ కుటుంబ పాలనలోని అవినీతి పైన, అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలపైన రేవంత్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేయడంతోనే ప్రజలు ఆయన నేతృత్వంలోని పార్టీకి పట్టం కట్టారు. ఈ విషయం మరిచి బూతులు, వెకిలి విమర్శలతో రేవంత్‌రెడ్డిని తక్కువ చేసి, రాక్షసానందం పొందాలని భావిస్తే అది కేటీఆర్‌కే చేటుగా పరిణమిస్తుంది. కేటీఆర్ తీరు మారకపోవటం వల్లనే శాసనసభ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి గుండు సున్నా దక్కింది. పంచాయతీ ఎన్నికల్లో 30శాతం స్థానాలు కూడా సాధించలేకపోయారు. ఆయన తీరు ఇలాగే కొనసాగితే ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేస్తారని గుర్తించాలి.
చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
లోక్‌సభ సభ్యులు, భువనగిరి
ఇవి కూడా చదవండి
మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..