Share News

ఏది ఉత్తమ చారిత్రక నవల?

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:36 AM

కొన్ని సంవత్సరాల క్రితం ఓ పాత పుస్తకాల షాపులో కురుతలైన్ హైదర్ అనే రచయిత్రి ఉర్దూలో రాసిన ‘ఆగ్ కా దర్యా’ అనే నవల తెలుగు అనువాదం ‘అగ్నిధార’ చదువుతుంటే ఆ పుస్తకంలో...

ఏది ఉత్తమ చారిత్రక నవల?

కొన్ని సంవత్సరాల క్రితం ఓ పాత పుస్తకాల షాపులో కురుతలైన్ హైదర్ అనే రచయిత్రి ఉర్దూలో రాసిన ‘ఆగ్ కా దర్యా’ అనే నవల తెలుగు అనువాదం ‘అగ్నిధార’ చదువుతుంటే ఆ పుస్తకంలో మార్జిన్స్‌లో ఒకచోట కనిపించిన మాట ‘‘Retrospective falsification’’. గతాన్ని తలుచుకొని వగచడం అని అనుకోవచ్చు దాని అర్థం. తెలుగులో చారిత్రక నవల గురించి ఆలోచించినప్పుడు నాకు ఇదే మాట గుర్తు వస్తుంది.

అసలు చారిత్రక నవల అంటే ఏంటి? దాని అవసరం ఏంటి? అని ఒక చరిత్ర విద్యార్థిగా నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు– చరిత్ర అంటే మానవాళి చేసిన ఓ గొప్ప ప్రయాణం తాలుకూ కథ అనిపిస్తుంది. దానిని తెలుసుకోవడానికి అకడమిక్ చరిత్ర పుస్తకాలు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతాయి. కానీ, చరిత్ర పుస్తకాలతో వచ్చిన సమస్య ఏంటంటే అవన్నీ సంవత్సరాలు, తేదీలు, సంఘటనలుగా విభజించబడిన ఒక బోరింగ్ సబ్జెక్టుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు సామాన్యజనాలకి లేదా పాఠకులకి చరిత్ర మీద ఆసక్తి కలిగించడానికి చారిత్రక నవలలు, సినిమాలు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ సంద ర్భంలో సినిమాలని పక్కనపెట్టి నవలల గురించి మాట్లాడుకుంటే తెలుగులో చారిత్రక నవల అనగానే మొదటగా అడివి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి, ముదిగొండ శివప్రసాద్ పేర్లు గుర్తొస్తాయి. అయితే వీళ్ళందరి రచనల్లోనూ ఉండే ఒక లక్షణం– గతకాలపు వైభవాన్ని, మనం కోల్పోయిన గొప్ప జీవితాన్ని మనకు అంటే పాఠకులకు ఒక విధంగా చూపిస్తూ పాఠకులకు కొంత మైమరపునూ, ‘‘అయ్యో, ఆ కాలంలో మనం లేకపోయామే’’ అన్న బెంగనూ కలిగించే విధంగా ఉంటాయి. చరిత్ర మీద ఆసక్తి కలిగించడానికి ఈ తరహా నవలలు మొదట్లో కొంత ఉపయోగపడ్డా, ఇవే చరిత్ర అనుకొని పొరబడే ప్రమాదం కూడా ఉంది. గోనగన్నారెడ్డి గజదొంగగా మారి రుద్రమదేవికి సాయం చేశాడని నేను చాలాకాలం నమ్మాను. అది అడివి బాపిరాజు గారి చమత్కారం అని తర్వాత తెలిసింది. ఒకనాటి తెలుగు పాఠకులందరికీ గుర్తు ఉన్న చారిత్రక నవల తెన్నేటి సూరి ‘చంఘిజ్‌ఖాన్’. ఆ నవల ఆంధ్రపత్రికలో సీరియల్‌గా వస్తున్నప్పుడు, ఎవరో పాఠకులు అడిగారట ‘‘నువ్వు చంఘీజ్ ఖాన్ కథ రాస్తున్నావా? లేదా వారం వారం ఈ దేశంలో జరిగే రాజకీయాలు రాస్తున్నావా?’’ అని. మంగోలియా ప్రజలకు తెలుగువారి జీవన విధానం గురించి ఏమీ తెలిసి ఉండకపోవచ్చు గానీ తెలుగు పాఠకులకి మధ్యయుగాల నాటి మంగోల్ ప్రజల జీవన విధానం గురించి చాలా బాగా తెలుసు అంటే అది తెన్నేటి సూరి గొప్పతనం అనే చెప్పుకోవాలి.


ఈ మధ్య వేరే భాషలకి చెందిన కొన్ని విశిష్టమైన చారిత్రక నవలల తెలుగు అనువాదాలు చదివాను. వాటిలో ముఖ్యమైనవి మరాఠీలో శరణ్ కుమార్ లింబాలే రాసిన ‘సనాతన్’, కన్నడలో వసుధేంద్ర ‘తేజో తుంగభద్ర’, తమిళంలో జయమోహన్ ‘వెళ్లయానై (తెల్ల ఏనుగు)’, రా. ముత్తునాగు ‘సులుంతీ’ నవలలు. వీటిలో ‘సనాతన్’ నవల మహారాష్ట్ర ప్రాంతంలో జరిగిన చరిత్రాత్మక బీమా కోరేగావ్ యుద్ధానికి ముందు ప్రారంభమై, స్వాతంత్య్రోద్యమం వరకూ నడుస్తుంది. ‘తేజో తుంగభద్ర’ విజయనగర సామ్రాజ్య కాలంలో భారత, యూరోప్ దేశాలను కలిపిన వ్యాపారం నేపథ్యంగా నడుస్తుంది. జయమోహన్ ‘తెల్ల ఏనుగు’ నవల మద్రాస్ నగరం నేపథ్యంలో, 1870లలో బెంగాల్ నుంచి మద్రాస్ వరకూ వ్యాపించిన భయంకరమైన కరువుని కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుంది. రా. ముత్తునాగు ‘సులుంతీ’ నవల 17వ శతాబ్దంలో మధురై నాయకరాజుల పాలనలో అక్కడ తలెత్తిన రాజకీయ పరిణామాలను చూపిస్తూ, మాధవుడు అనే ఓ మంగలి ప్రధాన పాత్రగా నడిచే కథ. ఈ కథ వస్తుపరంగానూ, రచనాపరంగానూ ఎంతో విశిష్టమైనది. వీటన్నింటిలోనూ పాఠకుడు తనని తాను చూసుకుంటాడు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త మంచి కాలంలోనే బతుకున్నాం అనే ఓ అవగాహన కలుగుతుంది.

ఆ కోవకి చెందిన నవలలు తెలుగులో ఉన్నాయా? అని వెతికితే, నాకు వెంటనే గుర్తు వచ్చేది, బండి నారాయణస్వామిగారి ‘శప్తభూమి’ నవల. పద్దెనిమిదవ శతాబ్దపు రాయలసీమ చరిత్రనూ ప్రజల సుఖదుఃఖాలనూ కళ్ళకు కట్టినట్టు చూపించిన నవల అది. నవల చివరిలో కథానాయకుడు బిల్లే ఎల్లప్ప చేసే ప్రాణత్యాగాన్ని పాఠకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఈ నవలను పాఠకులు కూడా ఎంతో ఆదరించారు. మళ్ళీ అదే రచయిత నుంచి చరిత్రలో మరికొంత వెనక్కి వెళ్ళి రాసిన నవల ‘కడపటి యుద్ధం’. విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన ‘కడపటి యుద్ధం’, చరిత్రలో ‘తళ్ళికోట యుద్ధం’గా, ‘రక్కసి తంగడి యుద్ధం’గా పేర్కొన్న యుద్ధం. యుద్ధానికి ముందు విజయనగర పట్టణం లోపల, ఆ కాలపు అంతఃపురాల నేపథ్యంగానే కాక, పంచమవాడలు, వేశ్యావాటికలు, వర్తకబజారులు, రాజులు, బంటులు, బానిసలు సానులు, వ్యాపారులు ప్రధాన పాత్రలుగా ఎంతో ఆసక్తికరంగా ఆరువందల పేజీల నిడివితో రచయిత మనల్ని చెయ్యి పట్టుకొని తనవెంట ఆ కాలానికి తీసుకుపోతారు.

ఇలాంటివే తెలుగులో మరికొన్ని రచనలను ఉదహరించుకోవచ్చు. పండరంగని అద్దంకి శాసనం ఆధారంగా కరణం బాలసుబ్రమణ్యం పిళ్ళె రాసిన ‘బోయకొట్టములు పండ్రెండు’ మంచి చారిత్రక నవల. చాళుక్యుల, పల్లవుల రాజకీయాల మధ్య ఒక చిన్న రాజ్యం ఎలా నలిగిపోయింది, అసలు ఒక రాజ్యం ఎలా పుడుతుంది, దాని నిర్మాణం ఎలా జరుగుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, అలాగే ఎలా పతనం అవుతుందనే అంశాలను ఈ నవలలో రచయిత ఎంతో నేర్పుతో వివరిస్తారు.


చారిత్రక కథల సంకలనాలు తెలుగులో అరుదు. ప్రస్తుత కాలంలో తెలుగులో చారిత్రక కాల్పనిక రచనకి ఎంతో కృషి చేస్తున్న రచయిత సాయి పాపినేని. ఆయన రాసిన ‘ఆంధ్రపథం’ తెలుగువారి అందరి ఇళ్లలోనూ ఉండదగ్గ పుస్తకం. నేటి తరం యువతకి అసలు ఒక జాతిగా తెలుగువారి మూలాలను బృహత్శిలాయుగం (megalithic period) నుంచి 1953లో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేవరకూ రకరకాల కాలాలలో, దాదాపుగా ప్రాంతానికి ఒక కథ చొప్పున రాసిన అద్భుతమైన రచన ఇది.

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏది ఉత్తమ చారిత్రక నవల?

చాలామంది ‘హిస్టారికల్‌ ఫిక్షన్‌’ అనే దానిని విరోధాబాస (paradox) అంటారు. అంటే, చరిత్రే ఓ కల్పన, మళ్ళీ చరిత్ర ఆధారిత కాల్పనిక నవలా? అని. ‘‘Re constructing the past with the scientific methods’’ అనేది చరిత్ర అనేదానికి అకడమిక్ స్కాలర్స్ ఇచ్చే నిర్వచనం.

ఉత్తమ చారిత్రక నవల అనే దానికి నిదర్శనంగా నాకు అనిపించింది ఏంటంటే– గతకాలపు వైభవాన్ని, గతచరిత్రను పాఠకులకి తెలియజేయడంతో పాటూ, మొత్తం మానవ సమాజంగా ఎన్ని అవాంతరాలను దాటుకొని నేడు మనం ఈ స్థితికి చేరుకున్నాం అని తెలియజేసేది. తనకు తెలియని కాలంలో తనకు సంబంధం లేని మనుషుల మధ్య జరిగిన కథగా కాకుండా, కాలం ఏదైనా జరుగుతున్నది తన కథగానే పాఠకుడు భావించాలి. కథలో తనని తాను చూసుకోగలగాలి. ఎందుకంటే మనుషులు అందరినీ సమానం చేసేవి ఎమోషన్స్, అవి ప్రాంతాలకు కాలాలకు అతీతం. అయితే చారిత్రక నవలా రచన అనేది అంత సులువైన పని కాదు. నిశిత చరిత్ర పరిశోధనతో పాటూ అద్భుతమైన కాల్పనిక శక్తి కూడా ఉండాలి. ప్రస్తుతం తెలుగులో చరిత్ర ఆధారంగా వస్తున్న రచనలు చాలా తక్కువ. దాదాపు లేవనే చెప్పాలి. అప్పుడప్పుడూ బండి నారాయణస్వామి లాంటివారు ఆశ కలిగిస్తూ ఉంటారు. ఆయన లాంటి మరింతమంది రచయితలు, మరిన్ని రచనలు రావాల్సిన అవసరం తెలుగు సాహిత్యానికి, సమాజానికీ ఉంది.

ప్రసాద్‌ సూరి

91336 08072

ఇవి కూడా చదవండి..

శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు

మీ బ్రెయిన్ రేంజ్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 21 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Jan 26 , 2026 | 05:36 AM