Share News

‘విద్యా వారం’లో సాధించిందేమిటి?

ABN , Publish Date - Jun 06 , 2026 | 02:02 AM

రాష్ట్ర ప్రభుత్వం 2026 మార్చి ఆరు నుంచి జూన్ పన్నెండు వరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ అనే తొంభై తొమ్మిది రోజుల యాక్షన్ ప్లాన్‌ చేపట్టింది. రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం నిర్వహించిన వివిధ అభివృద్ధి...

‘విద్యా వారం’లో సాధించిందేమిటి?

రాష్ట్ర ప్రభుత్వం 2026 మార్చి ఆరు నుంచి జూన్ పన్నెండు వరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ అనే తొంభై తొమ్మిది రోజుల యాక్షన్ ప్లాన్‌ చేపట్టింది. రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన సమీక్ష, భవిష్యత్‌లో చేపట్టవలసిన కార్యాచరణ ఈ ప్రణాళికలో భాగం. ఇందులో విద్యారంగానికి సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించారు. బోధన రంగంలో రావలసిన మార్పులు, విద్యార్థుల్లో ప్రోది చేయవలసిన సృజనాత్మకత, ఉపాధి కల్పన, ఇంటర్ డిసిప్లినరీ అధ్యయనం, యూత్ పార్లమెంట్, మోడల్ అసెంబ్లీ నిర్వహణ, అకడమిక్ సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం, పేరెంట్స్–టీచర్స్ మీటింగ్స్‌, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల సంక్షేమం మొదలైన లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాలను పరిపూర్తి చేయడానికి మే 11 నుంచి 17 వరకు ఎడ్యుకేషన్ వీక్‌ను నిర్వహించారు. అయితే మొక్కుబడిగా జరిగే అనేక సభల తీరుకు ఇదేమీ భిన్నంగా లేదు.

తెలంగాణ సమాజం అక్షర జ్ఞానాన్ని ఒడిసిపట్టి ఎల్లెడలా విస్తరించాలని ఎంతగానో తపించింది. ఈ నేపథ్యంలో ఇతర సమాజాలకు ఉన్న అనుకూలతలు తెలంగాణ పొందలేకపోయింది. బ్రిటీషాంధ్రకు మద్రాస్ ప్రావిన్సు ఇచ్చిన అవకాశాల వల్ల ఆంగ్ల విద్య, పత్రికల నిర్వహణ, వ్యాపార మెళకువలు, పెట్టుబడిదారీ ఆర్థిక నమూనా, నీటి వనరు కింద రూపుదిద్దుకున్న స్థిరమైన వ్యవసాయం అనుకూలతలు అయ్యాయి. ఆర్థిక, రాజకీయ ముందుచూపు మాత్రమే కాకుండా సాంస్కృతిక వికాసం కూడా ఆంధ్ర ప్రజలలో జరిగింది. ఫలితంగా తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురయ్యారనే సత్యం ఆలస్యంగా బోధపడింది. కనుక అరవయ్యో దశకం చివర్లో ప్రత్యేక తెలంగాణ కావాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. తిరిగి తొంభయ్యో దశకం చివర్లో తెలంగాణ ఏర్పాటు లక్ష్యం ప్రజా ఉద్యమ రూపాన్ని తీసుకున్నది.


వందేళ్ల నుంచి తెలంగాణ సమాజం నాణ్యమైన విద్య కోసం ఎదురుచూస్తున్నది. పాలకుల ప్రయోగాలకు కేంద్రంగా ఉండిన ఈ నేల పొందిన దాని కంటే కోల్పోయిందే ఎక్కువ. ప్రజల సామూహిక పోరాటం వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సారవంతమైన విద్యను పొందగలమనే సాంత్వనను పాలకులు ఇవ్వలేకపోతున్నారు. ఏలికలు ఒకరి మీద మరొకరు నెపం మోపుకోవడం వల్ల సమాజానికి ఒరిగేది శూన్యం. వివిధ రంగాలలో నాణ్యమైన ఫలితాలు రావాలంటే నైపుణ్యమైన మానవ వనరు ఉండాలనే ఎరుక పాలకులకు ఉంటేనే సమాంతరంగా విద్యను విస్తరించే ఆలోచనలకు పునాది పడుతుంది. దశాబ్ద కాలంలో అనుకున్న ఆకాంక్షలు నెరవేరలేదని ప్రజలు పాలకులను మార్చారు. కనుక కొత్త పాలకులు కొత్త విధానాలపై దృష్టిని కేంద్రీకరించి పనిచేయాలి.

తెలంగాణలో వర్తమాన పాలకులు నాణ్యమైన విద్య ద్వారా నైపుణ్యాలను ప్రోది చేయగలమనే అవగాహన ఉన్నట్లుగా కన్పించినా, ఆ లక్ష్యం దిశగా అడుగులు పడకపోతే ఫలితం శూన్యం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు, స్కిల్ యూనివర్సిటీ రూపొందించడం, ఓయూకు వెయ్యి కోట్లు, ఉమెన్స్ యూనివర్సిటీకి 500 కోట్లు, పాలమూరు యూనివర్సిటీ మౌలిక వసతుల కల్పన కోసం నిధుల కేటాయింపు ఈ రెండేళ్లలో జరిగింది. విద్యా రంగం గురించి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి రావలసిన మార్పుల గురించి నివేదికను రూపొందించడానికి తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. వారు విస్తృతంగా పర్యటించి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న పరిస్థితుల గురించి క్షేత్ర స్థాయి సమాచారాన్ని సేకరించారు. దాని ఆధారంగా నివేదికను రూపొందించి ప్రభుత్వ పెద్దలకు అందించారు. చాలా మంది విద్యార్థులలో పఠన, లేఖన నైపుణ్యాల కొరతను కమిషన్ గుర్తించింది. నైపుణ్యాలు లేని డిగ్రీలను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా విద్యా సంస్థలు ఉంటే సమాజానికి నష్టం. ఏకోపాధ్యాయ పాఠశాలతో విద్యలో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేమని కమిషన్ అభిప్రాయపడింది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో బోధించే వాళ్లు లేనప్పుడు నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నను కమిషన్ సమాజం ముందు ఉంచింది. ఎనభై శాతం ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులతో ఉన్నత విద్యలో ఏ లక్ష్యాలను చేరుకోగలం? అధ్యాపకుల నియామక ప్రక్రియ జ్ఞానం, నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసుకోవడానికి అనుకూలంగా లేనప్పుడు మనం పొందే ఫలితాలు కూడా నాసిరకంగానే ఉంటాయి. ఎంపికలో, పదోన్నతులు కల్పించడంలో శాస్త్రీయ, హేతుబద్ధ దృష్టి ఉండాలి. అప్పుడే అనుకున్న విద్యా లక్ష్యాలను చేరుకోగలం. ఇవన్నీ సమకూరాలంటే ప్రభుత్వానికి విద్యారంగం ప్రథమ ప్రాధాన్యంలో ఉండాలి. అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో ఉదాసీన తత్వం ఉండకూడదు.


గంభీర ప్రకటనలతో మార్పు రాదు, ఆచరణాత్మకతకు పూనుకోవాలి. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు వేగంగా మౌలిక వసతుల కల్పన మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. బోధనకు సరిపడే ఉపాధ్యాయులను, అధ్యాపకులను నియమించాలి. విద్యాలయాల నిర్వహణకు కావలసిన నిధులను కేటాయించాలి. వృత్తి నిబద్ధతలో తలెత్తుతున్న పరిమితులను అధిగమించాలంటే పటిష్ఠమైన, చిత్తశుద్ధి కలిగిన పర్యవేక్షణ యంత్రాంగాన్ని నియమించాలి. తెలంగాణకు ఓయూ కేంద్ర బిందువు. సరాసరి రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ఒక విద్యార్థి ఇక్కడ చదువుతుంటారు. కనుక దీనికి కేటాయించే నిధులు తెలంగాణ అభివృద్ధిలో భాగమని పాలకులు భావించాలి. ఓయూ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటివరకు ఆ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఇక్కడ ఖాళీగా ఉన్న వెయ్యి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మీనమేషాలు లెక్కిస్తే నాణ్యమైన విద్య అందని ద్రాక్ష అవుతుంది. రెండేళ్ల నుంచి యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బోర్డు నత్తనడకలో ఉంది.

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కూడా కావడం వల్ల ఆయన చొరవ చూపాలి. లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన, అందిస్తున్న గురుకులాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విస్మరణకు గురైన వర్గాల పిల్లలు చదువుకునే సంస్థలు ప్రభుత్వ విస్మరణకు గురికాకూడదనే ఎరుక ఏలికకు ఉండాలి. ఎడ్యుకేషన్ వీక్ నిర్దేశించుకున్న లక్ష్యాలు సాకారం కావాలంటే సభల కంటే చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణకు ప్రభుత్వం పూనుకోవడానికి తెలంగాణ పౌరసమాజం జోక్యం విధిగా ఉండాలి.

ప్రొఫెసర్ చింతకింది కాశీం

ప్రిన్సిపాల్, ఆర్ట్స్‌ కాలేజీ, ఓయూ

ఇవి కూడా చదవండి..

టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

Updated Date - Jun 06 , 2026 | 02:02 AM