ఫిరాయింపులు : కొత్త బెంగాలీ కథ!
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:12 AM
రాజకీయాలలో ఎంత దిగువకు దిగజారితే అథఃపాతాళానికి చేరుకున్నట్టు? ఇది రాజకీయ ప్రశ్న కాదు, సామాజికమే. రాజకీయ నాయకులు అవకాశవాదంతో పార్టీలు ఫిరాయించడానికి ఎప్పటికప్పుడు కొత్త దారులు కనిపెడుతున్నారు....
రాజకీయాలలో ఎంత దిగువకు దిగజారితే అథఃపాతాళానికి చేరుకున్నట్టు? ఇది రాజకీయ ప్రశ్న కాదు, సామాజికమే. రాజకీయ నాయకులు అవకాశవాదంతో పార్టీలు ఫిరాయించడానికి ఎప్పటికప్పుడు కొత్త దారులు కనిపెడుతున్నారు... యథేచ్ఛగా ఆ దారిన పరుగులు తీస్తున్నారు. ఈమధ్యే చోటుచేసుకున్న పశ్చిమ బెంగాల్ పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దశాబ్దంన్నర పాటు ఏకచ్ఛత్రాధిపత్యం సాగించిన మమతా బెనర్జీని ప్రజలు ఇంటికి సాగనంపారు. ఇది ప్రజాస్వామ్యంలో సహజ పరిణామం. ఏదో ఒక్క రాజకీయ పక్షాన్నో, ఒకే ఒక్క రాజకీయ నేతనో ప్రజలు శాశ్వతంగా అధికారంలో ఉండనివ్వకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఒక పార్టీ అండతో గెలిచినవారు, ఒక్క ఉదుటున గీత దాటిపోతే... మరి వారి రాజకీయ విధేయత సంగతి ఏమిటి? రాజకీయ అధికారం, సామాజిక హోదా కల్పించిన మాతృసంస్థతో కలిసి నడవాలా, అక్కరలేదా? రాజకీయ నడతలో నైతికతకు స్థానం ఉండనక్కరలేదా? ఎన్నికలలో ప్రజలు ఒక పార్టీని ఇంటికి పంపగానే అప్పటివరకూ ఆ పార్టీలో ఉండి రాజకీయాలను నడిపించిన వ్యక్తులు ఒక్కసారిగా, మూకుమ్మడిగా కొత్త దారులు అన్వేషించడాన్ని సామాజిక పరిశోధకులు ఎలా నిర్వచిస్తారు? దీనిని అధినాగరిక లక్షణంగా పునర్నిర్వచించడానికి కొలమానం ఏమైనా ఉన్నదా? ఈ దేశంలో పార్టీ ఫిరాయింపు రాజకీయాలు కొత్తేమీ కాదు, కానీ అందుకు కూడా కొన్ని పద్ధతులను పాటించడం గతంలో చూశాం. ఇప్పుడు మార్గం మారింది.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలో అప్రతిహతంగా ఏలుబడి సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాగ్రహాన్ని చవిచూసింది. గతంలో ఆ పార్టీ టిక్కెట్టుపై గెలిచి సగర్వంగా పార్లమెంటు మెట్లు ఎక్కిన 20 మంది సభ్యులు రాత్రికి రాత్రి ఎన్సీపీఐ (నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా) అనే పార్టీలోకి వెళ్లిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికలలో కదా..., కానీ ఇప్పుడు పార్టీ మారిన వారు అసెంబ్లీ సభ్యులు కారు, వారు పార్లమెంటు సభ్యులు. తృణమూల్ నాయకత్వంపై అసంతృప్తి ఉంటే, నాయకత్వంపై తిరుగుబాటు అవసరం అనుకుంటే గతంలో ఎప్పుడో ఈ పని చేసి ఉండవచ్చు. కానీ అలా చేయలేదు. సరే, పశ్చిమ బెంగాల్లో చక్రం తిప్పిన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్సీపీఐలోకి వెళ్లిన వారికి, పాత పార్టీలో కనిపించని ఉత్తేజపూరితమైన సైద్ధాంతిక బలం ఏమైనా కొత్త పార్టీలో కనిపించిందా అంటే అటువంటిదేమీ ఉన్నట్టు లేదు. అసలు ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంతటి రాష్ట్రాన్ని నడిపించినంతటి పెద్ద పార్టీ నుంచి మరో పార్టీలోకి వీరు వెళ్లారంటే అదింకా ఎంత పెద్ద పార్టీయో కదా అని అనిపిస్తుంది. కానీ ఆరా తీస్తే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు తెలుస్తాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీకి పశ్చిమ బెంగాల్‌లో అసలు మూలాలే లేవు. ఆ పార్టీ వెనుక ప్రజలు లేరు, ఆ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కార్యకర్తలు లేరు.
కలకత్తాలో ఒక చిన్న ఆఫీసు మాత్రమే ఉందట. పోనీ గతంలో ఏమైనా పెద్ద రాజకీయ చరిత్ర ఉందా అంటే అదీ లేదు. ఇప్పుడు 20 మంది పార్లమెంటు సభ్యులను తనలోకి ఇముడ్చుకున్న ఆ బుజ్జి రాజకీయ పక్షానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో సైతం ఎన్నడూ పోటీ చేసిన చరిత్ర లేదు. అప్పనంగా 20 మంది ఎంపీల రాక ఓ హఠాత్ పరిణామం. దాంతో అసలు ఎక్కడా ఏ రూపంలోనూ ప్రాతినిధ్యమే లేని ఓ చిన్న రాజకీయ పక్షం ఉన్నట్టుండి ఒక్కసారిగా పార్లమెంటులో ఒక పెద్ద పార్టీగా రాత్రికి రాత్రి అవతరించేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలలో ఇప్పుడు అగ్రతాంబూలం ఈ బుజ్జి పార్టీదే. ఇంతా చేస్తే దీని వయస్సు ముచ్చటగా మూడేళ్లే. గతంలో ఈ పార్టీ తరఫున నలుగురు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తే.. ఒక్కొక్కరికి వచ్చిన ఓట్లు నాలుగైదు వందలకు మించలేదు. అప్పట్లో ఆ పార్టీ నినాదం మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘మీ ఓట్లను కాపాడుకోవడానికి పార్టీ ఫిరాయింపుదారులను తిప్పికొట్టండి’ అని ప్రజలకు సందేశం ఇచ్చిన నినాదం అది. ఎంత బాగుందీ నినాదం! ఆదర్శప్రాయమైన ఒక నినాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి ఆ పార్టీ నేతలు చేసిన కృషిని ఆ పార్టీకి వచ్చిన ఓట్ల సంఖ్యతో బేరీజు వేయనక్కరలేదు గానీ, జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఆ నినాదానికీ, తదుపరి పరిణామాలకూ ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఏడు కిరణాల మధ్య జిగేల్‌మని మెరుస్తున్న పాళీని ఎన్నికల గుర్తుగా ఎంచుకున్న ఈ పార్టీకి విరాళాలు కూడా వచ్చాయి. వచ్చిన లక్షా పదివేల డెబ్భై అయిదు రూపాయలలో ఖర్చులు పోగా, ఇంకా డెబ్భై అయిదు రూపాయలు బ్యాంకు ఖాతాలో నికరంగా మిగిలే ఉన్నాయి. బాగుంది. విరాళాల దుర్వినియోగం జరగనే లేదు. ఈ విశేషాలను బట్టి చూస్తే.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్సీపీఐలోకి వచ్చిన వారు ఆ పార్టీ నినాదం చూసి ఆకర్షితులై ఇందులోకి వచ్చారనుకోవడానికి ఇసుమంత ఆధారం కూడా కనిపించడం లేదు. మరి ఎందుకు మారినట్టు? పార్టీ ఫిరాయింపుదార్లుగా ముద్ర పడకూడదనే ఉద్దేశంతోనే, వారు మూకుమ్మడిగా పార్టీ మారారన్నది చెప్పకనే చెబుతున్నది. అంత అవసరం ఏమొచ్చిందీ అంటే... అసలు సిసలు తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, కాబట్టి తమనే అసలైన తృణమూల్‌గా గుర్తించాలని ఈ 20 మందీ వెళ్లి ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించాలి. ఎన్నికల కమిషన్ అవునని అంగీకరించడానికి చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా సమయం.
ఈ డిజిటల్ యుగంలో దీర్ఘకాలం ఎదురుచూసే సహనశీలురు అరుదు. అందుకే ఒక్క దెబ్బతో– ఒక కొత్త వ్యూహంతో– పాత మిత్రులతో కలిసి కాక, పార్లమెంటులో విడిగా ప్రత్యేకంగా కూర్చునే వీలును సాధించుకున్నారు. బాగు బాగు... మామూలుగా అయితే ఒక రాజకీయపక్షం మాత్రమే మరో పార్టీలో విలీనం కావచ్చు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ కొత్త పార్టీలో తమ పాత పార్టీ విలీనం అయ్యింది కనుక తామూ అందుకు అంగీకరిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. కానీ ఇప్పుడు మూడింట రెండు వంతుల మంది మేము ఫలానా పార్టీలో చేరిపోయామని ప్రకటించుకోవడం వల్ల అనేక విధాలుగా అందరికీ శిరోభారం తగ్గినట్టే.
మమతా బెనర్జీ ఆశ్రిత పక్షపాతానికి బందీ అయ్యుండవచ్చు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయకపోయి ఉండవచ్చు, అవినీతిని అరికట్టలేకపోయి ఉండవచ్చు, ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడానికి మరెన్నయినా కారణాలు ఉండవచ్చు. కానీ వాటిని వ్యతిరేకించేవారు ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రాలనే ఆచరణలోకి తెచ్చి ఉండవచ్చు. కానీ అలా జరగకపోవడాన్ని సమాజం కూడా ఆక్షేపిస్తున్నట్టు లేదు. నాయకులలోని అప్రజాస్వామిక వర్తన చూస్తే సమాజానికి చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు. ఒకప్పుడు ఇటువంటి పరిణామాలు సంభవించినప్పుడు ప్రజలు ఈసడించుకునేవారు. చెట్టు కిందో, గట్టు మీదో కూర్చుని వార్తా పత్రికలు పట్టుకుని మరీ ఇందులోని మంచి– చెడు గురించి చర్చోపచర్చలు చేసేవారు. ఎవరికి తోచిన పద్ధతిలో వారు ఇటువంటి పరిణామాల పట్ల ఏదో ఒక స్థాయిలో నిరసన ధ్వని వినిపించేవారు. ఇప్పుడు ఆ సంస్కృతి మాయమైపోయింది.
ఇది కూడా ఆకస్మికంగా జరిగింది కాదు. ఇది మనకు మామూలే. ఆ రోజుల్లో చీటికీ మాటికీ పార్టీలు మారే వారిని ఉద్దేశించి ఆయారాం, గయారాం అనేవారు. హర్యానా శాసనసభ్యుడు గయా లాల్ కేవలం పదిహేను రోజులలో ముచ్చటగా మూడు పార్టీలు ఫిరాయించడంతో ఈ శకం ప్రారంభమైంది. అది ఒక రకమైన తిట్టు. అయితే దేశ రాజకీయాలలో శ్రీరామునికి ఉచితాసనం ఇవ్వడం మొదలయ్యాక ఆయారాం, గయారాం అనడానికి ఎవరైనా సంశయించవలసివస్తోంది. అంత తేలికగా నోరు పెగలడం లేదు. అలనాటి ఫిరాయింపు క్రీడలో భజన్‌లాల్ ఉదంతం మరీ విచిత్రం. హర్యానా మంత్రిమండలి మొత్తం ఏకబిగిన జనతా పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి దూకడం పెద్ద సంచలనం సృష్టించింది, పెనుదుమారం మిగిల్చింది. ఫిరాయింపు ప్రహసనం పుణ్యమా అని దేశంలో ఉన్నట్టుండి కుప్పకూలిన రాష్ట్ర ప్రభుత్వాల సంఖ్య 45 వరకూ ఉంటుందని విశ్లేషకులు తేల్చారు.
భారత రాజకీయాలలో ఒకప్పుడు హెచ్.ఎన్ బహుగుణ అనే నాయకుడు ఉండేవారు. దేశం మొత్తం మీద ఎక్కువ సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన రాజకీయ నాయకుడు ఎవరు అంటే.. మొట్టమొదట ఈ బహుగుణ పేరే వినవచ్చేది. ఊ.. అంటే పార్టీ మారడం, ఆ.. అంటే పార్టీ మారడం. ఇదేమిటయ్యా అంటే దానికీ ఆయన ఓ దీటైన, సజావుగా ధ్వనించే సమాధానం చెప్పేవారు. ప్రజల పట్ల బహుగుణకు గల అంకితభావం గురించి ఆయన కుమార్తె ఒక పుస్తకమే రాసినా, చీటికీ మాటికీ పార్టీలు మారడాన్ని ప్రజలు ఆమోదించిన దాఖలా మాత్రం లేదు. అప్పటి పరిస్థితినీ, ఇప్పటి పరిస్థితినీ ఒక్కసారి పోల్చుకుంటే ప్రజాస్వామిక ప్రయాణంలో మనం చాలా దూరం వచ్చేసినట్టే కనిపిస్తున్నది. ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకోవడానికి ఇప్పటి పశ్చిమ బెంగాల్ కథ లాగా... ఊరూ పేరూ లేని పార్టీలలోకి ఇలా మూకుమ్మడిగా చేరిపోతే, వారిని ఎన్నుకున్న ఓటర్లు సైతం ఆక్షేపించక మిన్నకుంటే ప్రజాస్వామ్య భావనల భవిష్యత్తు అయోమయంలో పడినట్టు కాదా? వచ్చేపోయేవారిని రా రమ్మని పిలవడానికి తలో రాజకీయ అంగడి పెట్టుకోవడానికి మార్గం సుగమం చేసినట్టు కాదా? కిం కర్తవ్యం...?!
జగన్
సీనియర్ జర్నలిస్ట్
ఈ వార్తలనూ చదవండి:
దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..
గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..