Share News

హక్కు ఆధారిత చట్టాలు ఇక ప్రభుత్వ దయ!

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:42 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) రద్దుతో దేశంలో ఒక కీలకమైన రాజకీయ ప్రశ్న ముందుకు వచ్చింది: సంక్షేమాన్ని పౌరుల హక్కుగా పరిగణించే ఆలోచన నుంచి భారత ప్రభుత్వం క్రమంగా పక్కకు...

హక్కు ఆధారిత చట్టాలు ఇక ప్రభుత్వ దయ!

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) రద్దుతో దేశంలో ఒక కీలకమైన రాజకీయ ప్రశ్న ముందుకు వచ్చింది: సంక్షేమాన్ని పౌరుల హక్కుగా పరిగణించే ఆలోచన నుంచి భారత ప్రభుత్వం క్రమంగా పక్కకు తప్పుకుంటున్నదా? ఈ పరిణామం కేవలం ఒక పథకం ముగింపునకు సంబంధించింది కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో పౌరుడికి, రాజ్యానికి మధ్య ఉన్న సామాజిక ఒప్పందం (social contract)లో వస్తున్న పెనుమార్పుకు సంకేతం.

ఒక్క ‘నరేగా’ విషయంలోనే కాదు; సమాచార హక్కు చట్టం (RTI), జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), అటవీ హక్కుల చట్టం (FRA) వంటి హక్కుల ఆధారిత చట్టాల భవిష్యత్తుపైనా ఇలాంటి ఆందోళనే కలుగుతోంది. ముఖ్యంగా గత పదేళ్ళ మోదీ ప్రభుత్వ పాలనలో సంక్షేమాన్ని చట్టబద్ధమైన హక్కుగా నిర్వహించటం మానేసి, పరిపాలనా నిర్ణయాలు, కార్యనిర్వాహక నియంత్రణల ద్వారా నిర్వహించాలన్న ధోరణి పెరగటం చూస్తున్నాం.

స్వాతంత్ర్యానికి ముందు దశలో తొలి జాతీయవాదులు పేదరికం అనేది వ్యక్తిగత వైఫల్యం కాదనీ, వలస పాలనలోని దోపిడీకి వ్యవస్థాగత ఫలితమనీ వాదించారు. పేదరికాన్ని కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా ఒక నిర్మాణాత్మక సమస్యగా చూడాలనే ఈ దృక్పథం, నాటి వామపక్ష రాజకీయ –ఆర్థిక ఆలోచనల ప్రభావంతో మరింత బలపడింది. ‘‘స్వతంత్ర భారతదేశ ప్రధాన కర్తవ్యాలు: ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం పెట్టడం; దుస్తులు లేని ప్రజలకు దుస్తులు ఇవ్వడం,’’ అని రాజ్యాంగ సభలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రకటనలో ఇదే భావన ప్రతిఫలిస్తుంది.


అయితే స్వాతంత్ర్యం తర్వాతి కాలంలో పేదరిక నిర్మూలన అనేది ప్రధానంగా ప్రభుత్వ నేతృత్వంలోని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపంలోనే కొనసాగింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు సామాజిక న్యాయం పట్ల రాజ్యానికి ఉన్న బాధ్యతను స్పష్టంగా ప్రకటించినప్పటికీ, అవి చట్టపరంగా అమలు చేయాల్సిన హక్కులుగా మారలేదు. ఫలితంగా సంక్షేమం పౌరుల చట్టబద్ధ హక్కుగా కాకుండా, పాలనాపరమైన విచక్షణ పైన, రాజకీయ సంకల్పంపైన ఆధారపడిన అంశంగా కొనసాగింది. ఈ పరిమితిని రాజ్యాంగ రూపకల్పన దశలోనే చూడవచ్చు. పని హక్కును ప్రాథమిక హక్కులలో ఎందుకు చేర్చలేదని ప్రముఖ రచయిత ముల్కరాజ్ ఆనంద్ స్వయంగా అంబేడ్కర్‌ను ప్రశ్నించినప్పుడు, ఆయన, ‘‘రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీలో నేనొక్కడినే లేను’’ అని సమాధానమిచ్చారు. అంటే పనిని హక్కుగా మలిచే రాజకీయ సంకల్పం అప్పుడే సంపూర్ణంగా రూపుదిద్దుకోలేకపోయింది. ఈ వైఖరే స్వాతంత్ర్యానంతర కాలంలో సంక్షేమ హక్కుగా గాక, పథకాల రూపంలో కొనసాగడానికి ఒక ముఖ్య కారణంగా మారింది.

1991లో కేంద్ర ప్రభుత్వం ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేయడం ప్రారంభించిన తరువాత, వాటి ఫలితంగా ఏర్పడిన అసమానతలకు ప్రతిస్పందనగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆహారం, ఉపాధి, పారదర్శకత, గౌరవం వంటి మౌలిక అంశాల చుట్టూ సాగిన ఈ పోరాటాలు సంక్షేమాన్ని హక్కుల ఆధారంగా పునఃరూపకల్పన చేయాలన్న ఆలోచనకు బలమైన పునాదిని వేశాయి.

ఈ ఉద్యమాలలో అత్యంత ప్రభావవంతమైనది రాజస్థాన్‌లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) నేతృత్వంలో సాగిన సమాచార హక్కు ఉద్యమం. ‘హమారా ఖర్చా, హమారా హిసాబ్’ (మన సొమ్ము–మన లెక్కలు) అనే నినాదంతో ప్రజా పనులకు సంబంధించిన అవినీతిని బహిర్గతం చేసిన ఈ ఉద్యమం, ‘పారదర్శకత’ను ‘వేతనాలు’, ‘ఉపాధి’ వంటి కార్మికుల మౌలిక హక్కులతో నేరుగా ముడిపెట్టింది. సమాచారాన్ని కేవలం ఒక సూత్రంగా గాక, న్యాయమైన, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన అనివార్యమైన షరతుగా ప్రజల ముందుకు తెచ్చింది.


అదే సమయంలో, ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పటికీ ఆకలి, పోషకాహార లోపాలు ఎందుకు కొనసాగుతున్నాయన్న ప్రశ్నతో ఆహార హక్కుల ఉద్యమాలు మొదలయ్యాయి. 2001లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఆహార హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) నుంచి ఉద్భవించిందని వాదించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తదుపరి ఉత్తర్వులు ప్రజా పంపిణీ వ్యవస్థను, మధ్యాహ్న భోజనం వంటి పథకాలను జీవించే హక్కుతో ముడిపడిన చట్టబద్ధ హక్కులుగా గుర్తించాయి.

2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన హక్కుల డిమాండ్లను చట్టరూపంలోకి తేవడానికి ఒక రాజకీయ అవకాశం ఏర్పడింది. సామాన్యుడి కోసం పాలన అందిస్తామని ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం ప్రజా ఒత్తిళ్లకు స్పందించక తప్పలేదు. అందువల్లనే– ‘సమాచార హక్కు చట్టం’ (2005), ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (2005), ‘అటవీ హక్కుల చట్టం’ (2006), ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ (2013) వంటి కీలక హక్కుల ఆధారిత చట్టాల అమలు మొదలైంది. ఈ చట్టాలు సంక్షేమాన్ని పరిపాలనా విచక్షణ పరిధి నుంచి బయటకు తీసి, అమలు చేయాల్సిన చట్టబద్ధ హక్కులుగా మార్చాయి.

కానీ గత దశాబ్ద కాలంగా ఈ హక్కుల ఆధారిత చట్టాలు బలహీనమవుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాటిని అమలు చేయాలన్న రాజకీయ సంకల్పం తగ్గడమే. సంక్షేమాన్ని పౌరుల చట్టబద్ధ హక్కుగా కాకుండా, నియంత్రణలు, పరిపాలనా విధానాల ద్వారా నిర్వహించాలన్న పాత దృక్కోణం మరలా బలపడింది. ఈ ధోరణి ఒకటి రెండు విధాన నిర్ణయాలకు పరిమితం కాకుండా, నిరంతర పరిపాలనా చర్యలు, మార్గదర్శకాలు, సాంకేతిక షరతుల రూపంలో వ్యవస్థాగతంగా లోతుగా పాతుకుపోయింది. అంతేకాదు, తీవ్ర రాజకీయ ప్రతిఘటనల మధ్య రూపొందిన ఈ చట్టాల్లోనే రాజ్యానికి విస్తృత కార్యనిర్వాహక వెసులుబాటు (Executive discretion) కల్పించే నిర్మాణ లక్షణాలు మొదటి నుంచీ అంతర్లీనంగా ఉన్నాయి.


ఉదాహరణకు ఉపాధి హామీ (నరేగా) చట్టబద్ధమైనదైనప్పటికీ– పనుల కేటాయింపు, నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ బలంగా ఉండేది. నిధులు ఆలస్యం అయినప్పుడు నిరుద్యోగ భృతిని డిమాండ్ చేయడం ఆచరణలో సామాన్యుడికి చాలా కష్టసాధ్యంగా మారింది. అలాగే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) విషయానికి వస్తే– సెక్షన్ 8 వంటి మినహాయింపులు సమాచారాన్ని నిరాకరించేందుకు విస్తృత అవకాశాలను కల్పించాయి. అంతేకాక, సమాచార కమిషనర్ల నియామకంపై రాజకీయ నియంత్రణ కొనసాగడం వల్ల సంస్థాగత స్వాతంత్ర్యం పరిమితంగా మారింది. ఇక ఆహారభద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ)లో ఆహారాన్ని సార్వత్రిక హక్కుగా కాకుండా లక్ష్యిత ప్రయోజనంగా పరిమితం చేయడం వల్ల, జనాభా పెరుగుతున్న కొద్దీ అనేక అర్హులు ఈ చట్ట పరిధి వెలుపలికి నెట్టబడ్డారు. అలాగే అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) అమలు బాధ్యత మొత్తం చారిత్రకంగా ఆదివాసీ హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించిన అటవీశాఖ చేతుల్లోనే ఉండటం, ఈ చట్ట ఆత్మకు విరుద్ధమైన పరిస్థితిని సృష్టించింది. ఇలా ఆ చట్టాల్లో స్వతహాగా నిబిడీకృతమై ఉన్న నిర్మాణ లోపాలే, దరిమిలా రాజకీయ సంకల్పం తగ్గిన తరువాత, చట్టాలను రద్దు చేయకుండానే వాటిని లోపల్నుంచి డొల్లగా మార్చడానికి (hollowing out) సులభతర మార్గాలుగా మారాయి.

ప్రస్తుత పరిణామాలను ఈ కార్యనిర్వాహక వెసులుబాటు దృక్కోణంలోనే అర్థం చేసుకోవాలి. డిమాండ్‌ ఆధారితంగా అమలు చేయదగినవిగా రూపొందిన హక్కులు ఇప్పుడు సాంకేతిక షరతులు, విధానపరమైన ఆంక్షల ద్వారా పునఃరూపకల్పన చేయబడుతున్నాయి. దీనివల్ల వాటి సారాంశం క్రమంగా క్షీణిస్తోంది. సంక్షేమాన్ని ఒక ఉపకారం నుంచి ఒక హక్కుగా మార్చిన ఈ హక్కు ఆధారిత చట్టాలు బలహీనపడటం అంటే ప్రజలు కేవలం వాటి ప్రయోజనాలను మాత్రమే కోల్పోతున్నట్టు కాదు, తమ క్షేమానికి రాజ్యాన్ని జవాబుదారీగా నిలబెట్టే సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నట్టే!

ఇప్పుడు ఉపాధి హామీ పేరు మారిందా లేదా కొత్తగా రూపుదిద్దుకున్నదా అన్నది కాదు అసలు ప్రశ్న. సంక్షేమాన్ని పౌరుల హక్కుగా చూడకుండా భారత ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందా అన్నదే కీలకమైన ప్రశ్న. దశాబ్దాల ప్రజా పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ హక్కులను ప్రజా బాహుళ్యంలో విస్తృత చర్చ లేకుండా బలహీనపరిస్తే, వాటికి ఉన్న చట్టపరమైన రక్షణ క్రమంగా క్షీణిస్తుంది.

భారతదేశంలో సామాజిక భద్రత అనేది రాజ్యపు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన ‘ఉపకారం’ కాదు; అది పౌరుల ‘చట్టబద్ధమైన హక్కు’. సంక్షేమాన్ని తిరిగి హక్కుల కోణంలో ప్రతిష్ఠించడమే నేటి అసలైన రాజకీయ, సామాజిక సవాలు. ఈ మార్పుపై బహిరంగ చర్చ, నిరంతర ప్రజా పర్యవేక్షణ మాత్రమే దశాబ్దాల పోరాటాల ఫలితమైన ఈ చట్టాలను కాపాడగలవు.

చక్రధర్ బుద్ధ

సీనియర్ పరిశోధకులు, లిబ్‌టెక్ ఇండియా

ఈ వార్తలు కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Updated Date - Feb 19 , 2026 | 01:42 AM