Share News

విలువైన వనరుగా మురుగునీరు

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:08 AM

పరిశుభ్రతకు ప్రసిద్ధమైన ఇండోర్‌కు తాగునీరు స్వచ్ఛంగా సరఫరా కాని పాడురోజులు దాపురించాయి. మంచి నీరు మలమూత్రాలతో మలినమవడంతో ఇండోర్‌ వాసులు...

విలువైన వనరుగా మురుగునీరు

పరిశుభ్రతకు ప్రసిద్ధమైన ఇండోర్‌కు తాగునీరు స్వచ్ఛంగా సరఫరా కాని పాడురోజులు దాపురించాయి. మంచి నీరు మలమూత్రాలతో మలినమవడంతో ఇండోర్‌ వాసులు కొంతమంది మరణించడం మనసును కలచివేసే దుర్వార్త. నీటి సరఫరాతో సహా మునిసిపల్‌ సేవలు అధ్వానంగా ఉండడం వల్లే ఇండోర్‌లో ఆ శోచనీయ ఘటన వాటిల్లింది. ప్రతి రోజూ, ప్రతి ఒక్కరూ మల మూత్రాలు విసర్జిస్తారు. వాటిని ఫ్లష్‌ చేస్తారు, అవి నగర మురుగునీటి ప్రవాహాల్లో కలిసిపోతాయి. మురుగునీటి నిర్వహణలో లోపాలు నీటి వనరులు కలుషితమవడానికి దారితీస్తున్నాయి. నీటి సరఫరాపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్న ప్రభుత్వాలు, సరఫరా చేస్తున్న ప్రతి లీటర్‌ నీటిలో 80 శాతం వ్యర్థజలంగా తిరిగి పర్యావరణంలోకి వస్తోందన్న వాస్తవాన్ని ఉపేక్షిస్తున్నాయి. వ్యర్థ జలాలను అడ్డగించి, శుద్ధి చేయడం వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమవడమే ఆ నిర్లక్ష్యానికి కారణం. ఫలితంగా అవి నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. మురుగునీటి శుద్ధి వ్యర్థజలాలను వ్యర్థ ఉత్పత్తిగా కాకుండా విలువైన వనరుగా మారుస్తుంది. కనుక వ్యర్థజలాలను శుద్ధి చేసి, పునరుపయోగించుకోవడం గురించి ఆలోచించకపోతే స్వచ్ఛమైన తాగునీటి లభ్యత, ఇతరత్రా జల భద్రత అసంపూర్ణంగానే ఉండిపోతాయి. ఇండోర్‌ దురంతం నుంచి మనం నేర్చుకోవల్సిన పాఠమిది.

పట్టణ ప్రాంతాలలో పౌర సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న కార్యక్రమాలు ఆ వాస్తవాన్ని గుర్తించాయి. అయినా నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల రూపకల్పనలో ఆవశ్యక మార్పులు సంభవించడం లేదు. 2015లో ప్రారంభమైన ‘అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ (అమృత్‌) కార్యక్రమం కింద నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల మెరుగుదలకు దేశవ్యాప్తంగా 500 పట్టణాలు, నగరాలకు ఆర్థిక సహాయమందిస్తున్నారు. గత పది సంవత్సరాలలో ఈ కార్యక్రమం కింద 3,500 ప్రాజెక్టులకు రూ.1,93,104 కోట్ల ఆర్థిక సహాయమందించినట్టు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ ఆర్థిక సహాయంలో నీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం లభించింది. ఖర్చు పెట్టిన మొత్తంలో 62శాతం నీటి సరఫరా సదుపాయాల అభివృద్ధికి వెచ్చించారు. మురుగునీటి పారుదల వ్యవస్థల అభివృద్ధికి 34శాతాన్ని మాత్రమే వినియోగించారు. భూగర్భ జల వనరులను పునశ్శక్తిమంతం చేసి, నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు దోహదం చేసే జల వనరుల పునరుజ్జీవన పనులకు అతి తక్కువగా కేవలం 3 శాతాన్ని మాత్రమే వినియోగించారు.


ఈ ప్రాధాన్యాలు మారవలసిన అవసరమున్నది. మారి తీరాలి. అప్పుడు మాత్రమే వ్యర్థ జలాలను పూర్తిగా అడ్డుకుని, శుద్ధిచేసి, పునరుపయోగించుకునేందుకు అవసరమైన ఆర్థిక వనరులు నగరాలకు సమకూరుతాయి. నగరాలలో ప్రస్తుత నీటి సరఫరా వ్యవస్థలకు పైప్‌లు, పంప్‌లు ప్రధాన ప్రాతిపదికగా ఉన్నాయి. స్థానిక జల వనరులు ఎండిపోవడం లేదా పూర్తిగా కలుషితమైపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి నీటిని నిత్యం రవాణా చేసుకోవాల్సిన పరిస్థితి. ఇండోర్‌ ఒకప్పుడు తన నీటి అవసరాలకు స్థానిక సరస్సులు జలాశయాలపై ఆధారపడేది; ఇప్పుడు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్మదానది నుంచి తాగునీటిని సమకూర్చుకుంటున్నది. నీటిని తీసుకువచ్చే పొడుగాటి పైప్‌లైన్‌ నిర్మాణానికి, నిర్వహణకు అయ్యే వ్యయం తక్కువేమీ కాదు. నీటిని పంపింగ్‌ చేసేందుకు భారీ పరిమాణంలో విద్యుత్‌ అవసరమవుతుంది. వీటన్నిటికయ్యే వ్యయాన్ని అంతిమంగా నీటి వినియోగదారులే భరించడం అనివార్యమవుతోంది.

మురుగునీటిని సరైన విధంగా అడ్డుకుని, శుద్ధి చేయకపోవడం ప్రజారోగ్య విపత్తుకు దారితీస్తోంది. నివాస, పారిశ్రామిక ప్రాంతాల నుంచి శుద్ధి కేంద్రాలకు వ్యర్థ జలాలను సమర్థంగా, సురక్షితంగా రవాణా చేసేందుకు పైప్‌ నెట్‌వర్క్‌ల విస్తరణ, పంపింగ్‌ స్టేషన్లను పెంచడం వంటి అంశాలకు ప్రస్తుత మురుగునీటి నిర్వహణ ప్రణాళికలు ప్రాధాన్యమిస్తున్నాయి. మోరీలలోకి ప్రవహిస్తున్న వ్యర్థ జలాలను భూగర్భ నెట్‌వర్క్‌ల ద్వారా శుద్ధికేంద్రాలకు పంపింగ్‌ చేసి, శుద్ధి అనంతరం (ఇప్పటికే ద్రవ, ఘన వ్యర్థాలతో కాలుష్య నెలవులుగా ఉన్న) నదులు, సరస్సులలోకి విడుదల చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ కృషి చాలావరకు ‘వ్యర్థ’మవుతోంది. పట్టణ ప్రాంతాలలో చాలా కుటుంబాలు తమ ప్రాంగణంలోనే ఉన్న ఏదో ఒకరకమైన సెప్టిక్ ట్యాంక్‌కు సంధానమై ఉన్న టాయిలెట్‌లపై ఆధారపడుతున్నాయి. ఇండోర్‌లో అటువంటి టాయిలెట్‌ వ్యవస్థల నుంచి వ్యర్థ జలాలు లీక్‌ అయిన కారణంగానే తాగునీరు కలుషితమైపోయింది.


పరిష్కారమేమిటి? ఆ టాయిలెట్‌లను డీస్లడ్జ్‌ (సెప్టిక్ ట్యాంకులు మొదలైన మురుగునీటి వ్యవస్థల్లో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, ఇతర మలినాలను తొలగించే ప్రక్రియ) చేయాలి. ఆ విసర్జిత వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తీసుకువెళ్లాలి. శుద్ధి చేసిన ద్రవ, ఘన పదార్థాలను ఎరువుగా, ఇంధనంగా పునరుపయోగించాలి. ఇలా జరగని పక్షంలో మంచినీటి సరఫరా వ్యవస్థలు కలుషితమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉంటాయి. చెప్పవచ్చినదేమిటంటే... నీటి సరఫరా మెరుగ్గా ఉండడంపై దృష్టి పెడుతూనే, అంతకంటే ముందుగా మురుగునీటి నిర్వహణకు ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ప్రతి గృహం నుంచీ బయటకు పారే మలమూత్రాలను అడ్డుకోవడంతో సహా మురుగునీటి నిర్వహణ వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తూ ‘అమృత్‌’ కార్యక్రమాలకు పునఃరూపకల్పన చేయాలి. సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి ద్రవ, ఘన వ్యర్థాలను భూగర్భ పైప్‌ల ద్వారా కాకుండా ట్యాంకర్ల ద్వారా శుద్ధి కేంద్రాలకు రవాణా చేసేందుకు మునిసిపల్‌ కార్పొరేషన్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు సమకూర్చాలి. దీనివల్ల శుద్ధి పనులు వేగంగా జరుగుతాయి, చౌకగా జరుగుతాయి. మరింత సమ్మిళితంగా జరుగుతాయి. శుద్ధి చేసిన ద్రవ, ఘన వ్యర్థాలను పునరుపయోగించుకునేలా కూడా నగరాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు సమకూర్చాలి. ఈ విధంగా శుద్ధి చేసిన వ్యర్థాలను పునరుపయోగించుకోవడమే లక్ష్యంగా అమృత్‌ ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి. పునరుపయోగించిన ద్రవ, ఘన వ్యర్థాల పరిమాణం ప్రాతిపదికన నగరాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాలి.

జల వనరులను పునరుజ్జీవింప చేయడంతో సహా నీటి సరఫరా ప్రాజెక్టులను స్థానిక జలవనరులతో సంధానించడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి నీటి రవాణాకు అయ్యే ఖర్చులు తగ్గుతాయి. భూగర్భ జల వనరులు పునశ్శక్తిమంతమయ్యేందుకు దోహదం చేకూరుతుంది. సామాన్యులకు సదుపాయంగా నీటి సరఫరా వ్యయాలు తగ్గుతాయి. మురుగునీటి నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యమిచ్చినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. జలవనరులు కలుషితమవుతున్నంత వరకు పరిశుభ్రమైన నీటి కోసం నగరాలు కొత్త జల వనరులను అన్వేషిస్తూనే ఉంటాయి. అంటే మరింత సుదూర ప్రాంతాల నుంచి తాగునీటిని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. తద్వారా నీరు కలుషితమయ్యే అవకాశాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇండోర్‌ విషాదం నుంచి మనం నేర్చుకోవల్సిన మరో పాఠమిది.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Also Read:

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 02:08 AM