Share News

‘ఇండియా’కు దారి చూపిన ఓట్‌ చోరీ

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:10 AM

ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలతో సర్‌ ప్రక్రియ పట్ల సుప్రీంకోర్టు దృక్పథం మారింది. 13.30 కోట్ల మంది పౌరులు ఓటుహక్కు కోల్పోయేందుకు కారణమైన...

‘ఇండియా’కు దారి చూపిన ఓట్‌ చోరీ

ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలతో సర్‌ ప్రక్రియ పట్ల సుప్రీంకోర్టు దృక్పథం మారింది. 13.30 కోట్ల మంది పౌరులు ఓటుహక్కు కోల్పోయేందుకు కారణమైన ఆ సవరణ ప్రక్రియలోని విధి విధానాలు కొన్నిటిని రద్దు చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సైతం నిర్ణయించి, దిద్దుబాటు చర్యలూ చేపట్టింది. నియమం ప్రకారం అయితే ఓటర్ల సంఖ్య వయోజన జనాభాకు ఇంచుమించు సరిసమానంగా ఉండి తీరాలి. మరి సర్‌ ప్రక్రియ అమలుపూర్తయిన అనంతరం ప్రతి రాష్ట్రంలోను వయోజన జనాభా –ఓటర్ల నిష్పత్తి ఎలా ఉండనున్నది? ఆ నిష్పత్తి 100 శాతానికి చేరువలో ఉన్నట్టయితే తుది జాబితాలు లోపరహితమైనవని విశ్వసించవచ్చు. లేనిపక్షంలో అవి లోపభూయిష్ఠమైనవి అనేందుకు సంకోచించనవసరం లేదు.

ఓటర్‌ జాబితాల నుంచి తొలగింపునకు గురైన ఓటర్లలో (మృతులు మినహా) అత్యధికుల పేర్లు మళ్లీ జాబితాలలో చేరనున్నాయి. తమ సిబ్బంది ఇంటింటికి వెళ్లి, తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుతారని, ఈసీఐ ఇచ్చిన హామీ ద్వారా సర్‌ తుది జాబితాలు సక్రమంగా ఉండేందుకు అవకాశమున్నదనే నమ్మకం కలుగుతోంది. మంచిదే. అయినా, సర్‌ రాజ్యాంగవిహితంగా అమలవుతున్నదని మొదటినుంచీ వాదించిన ఈసీఐ ఇప్పుడు ఈ చర్యలు ఎందుకు తీసుకుంటున్నట్టు? తన తప్పులకు ప్రాయశ్చితం చేసుకుంటోందా? లేక, సర్‌లో అన్యాయం కొనసాగితే ప్రజలు మరింతగా ఆగ్రహ భార్గవులు అవుతారని భయపడిందా? ఏమైనా కావచ్చు కానీ ఒకటి మాత్రం స్పష్టం: తొలగింపులకు గురైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలలో చేర్చడం వల్ల ఓట్‌ చోరీ వ్యతిరేక ఉద్యమం 2029 నాటికి తన ప్రభావశీలతను పూర్తిగా కోల్పోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తున్నది.


2024 సార్వత్రక ఎన్నికల సందర్భంలో ‘భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది’ అన్న అంశం ప్రజలను అమితంగా కలవరపరిచింది. స్వాతంత్ర్య నిర్మాతలు, గణతంత్ర రాజ్యాంగ వ్యవస్థాపకుల ఆశయాలు, అభీష్టాలు వమ్మయిపోతున్నాయనే భావన ప్రజల మనసుల్లో నెలకొన్నది. దీనికితోడు అవధులు లేని అవినీతి, అదుపు లేని ధరల పెరుగుదల, పెచ్చరిల్లిన నిరుద్యోగం, గ్రామీణ శ్రామిక, పట్టణ కార్మిక జనావళికి ఎదుగూ బొదుగూ లేని వేతనాలు, వ్యవసాయ ఆదాయాలు తగ్గిపోవడం, రోడ్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కొరవడడం, సమాజ జీవితంలో సర్వత్రా నేరపూరిత కార్యకలాపాలు పెరిగిపోవడం మొదలైనవి అన్ని రాష్ట్రాల ప్రజలనూ వేధించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారింది. అయితే ప్రజల అసంతృప్తి, ఆగ్రహం ఆ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించలేకపోయాయి. ఎన్నికల పూర్వ, అనంతర పొత్తులతో ఎన్డీఏ సర్కార్‌ 293 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకున్నది. ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 స్థానాలు వచ్చాయి. ‘రాజ్యాంగం ప్రమాదంలో పడింది’ అన్నది సత్యదూరం కాదు కనుకనే అసంఖ్యాక ప్రజలు ఆ వాస్తవాన్ని విశ్వసించారు. ఆ ఆరోపణతో ఇండియా కూటమి నిర్వహించిన ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అయినప్పటికీ ఎన్నికలలో పరిస్థితులు ఇండియా కూటమికి అనుకూలంగా పరిణమించలేదు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రాగలిగింది.

ఈ నవంబర్‌ తొలినాళ్లలో అమెరికా కాంగ్రెస్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికలలో కూడా ఇటువంటి పరిణామాలే సంభవించడం గమనార్హం. రిపబ్లికన్‌ పార్టీ ‘మాగా’ (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌) ప్రచారానికి డెమొక్రాట్లు దీటుగా ప్రతిస్పందించారు. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రాజ్యాంగ విరుద్ధ పాలనాశైలి అమెరికన్‌ ఓటర్లను మనస్తాపానికి గురిచేసింది. ట్రంప్‌ అప్రజాస్వామిక పాలనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసిన అంశాలు రెండు: ఒకటి యుద్ధం, మరొకటి ధరలు అందుబాటులో లేకుండాపోవడం. అత్యధిక ఓటర్లకు ఆహారం, ఇంధన ధరలు, గృహ వసతి వ్యయాలు భరించలేని స్థాయిలో పెరిగిపోయాయి. రోజువారీ జీవితం దుర్భరమైపోవడానికి ట్రంప్‌ విధానాలే కారణమని అమెరికన్లు విశ్వసించారు. గాజా (పాలస్తీనా)పై ఇజ్రాయెల్‌ దాడుల్లో వేలాది అమాయక ప్రజలు హతమారిపోవడం, ఆ ప్రాంతం పూర్తిగా విధ్వంసమవడం అమెరికా ఓటర్లను కలవరపరిచింది. ఇజ్రాయెల్‌తో కలిసికట్టుగా ఇరాన్‌పై ట్రంప్‌ యుద్ధానికి వెళ్లడంవల్లే తమకు కష్టాలు దాపురించాయని వారు గట్టిగా భావించారు. యుద్ధం కారణంగా చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధి మూతపడడం, అనేక దేశాలకు వ్యతిరేకంగా ట్రంప్‌ విచక్షణారహితంగా విధించిన సుంకాలతో స్వదేశంలో ధరలు అలవికాని విధంగా పెరిగిపోయాయని, ట్రంప్‌ పాలన తమకు కష్టనష్టాలనేకానీ కనీస శ్రేయస్సును ఇవ్వడం లేదని అమెరికన్లు నమ్ముతున్నారు.


భారత్‌లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఆహార ధరలు పెరిగిపోయాయి. టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 12.3శాతంగా ఉండగా, వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని దాటి 6.1శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 8.9శాతం. ఒక ప్లేటు శాకాహార భోజనం ధర ఐదు సంవత్సరాల క్రితం రూ.30.80 ఉండగా ఈ నవంబర్‌లో రూ.41.90కి చేరింది. వాస్తవ వేతనాలు స్తంభించిపోయాయి. కుటుంబ పొదుపులు తగ్గిపోయి రుణాలు పెరిగిపోయాయి. అధికారిక సమాచారం ప్రకారమే నిరుద్యోగం పట్టణ ప్రాంతాలలో 6.7శాతం, గ్రామీణ ప్రాంతాలలో 4.2శాతం. శాశ్వత ఉద్యోగాలు ఎవరికీ దొరకడం లేదు.

ముందున్నది ముసళ్ల పండుగే. ద్రవ్యోల్బణం రేటు, నిరుద్యోగం రేటు మరింతగా పెరగనున్నాయి. ఆర్బీఐ త్వరలోనే రెపో రేటును 5.50శాతం నుంచి 5.75 లేదా 6శాతానికి పెంచే అవకాశమున్నది. పీఎల్‌ఐ పథకాలు (ఉత్పత్తిని పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్రోత్సాహకాలు) సత్ఫలితాలనివ్వడం లేదని అధికారిక సమాచారమే స్పష్టం చేసింది. స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా 14శాతం వద్దనే నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రేటు మరింతగా పెరగకుండా ఎలా ఉంటాయి? ద్రవ్యలోటు, వాణిజ్యలోటు (ముఖ్యంగా చైనాతో), ప్రైవేట్‌ పెట్టుబడుల కొరత, ప్రభుత్వ మూలధన వ్యయాల తగ్గుదల, మందకొడి డిమాండ్‌ మొదలైనవి మన ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్నాయి. అయితే ప్రభుత్వం జీడీపీ వృద్ధిరేటు పెరుగుదల గురించి లేని గొప్పలు చెబుతోంది. వికసిత్‌ భారత్‌ గురించి ప్రధానమంత్రి, మంత్రులూ ప్రతిరోజూ మాట్లాడుతున్నారు. లగ్జరీ కార్లు, నగరాల శివార్లలో ఖరీదైన బహుళ అంతస్తుల నివాస గృహాల గురించి రోజూ పత్రికలలో మిరుమిట్లు గొలిపే వాణిజ్య ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇక ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సుల గురించి చెప్పనవసరమే లేదు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దేశంలోకి ప్రవహిస్తున్నాయని పాలకులు ఘనంగా ప్రకటిస్తున్నారు. ప్రజలు వీటిని ఒక తమాషా వ్యవహారంగా పరిగణిస్తున్నారు.


ప్రజలు కోరుతున్నదేమిటి? ఉద్యోగాలు, వేతనాలు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు మొదలైనవి కదా. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాదాపుగా నిలిపివేశారు. కాయకష్టంతో బతికేవారు అటువంటి ఆసరాకు ఆరాటపడుతున్నారు. పీఎల్‌ఐ పథకాలు వైఫల్యాల పుట్టలు. నైపుణ్యాల అభివృద్ధి పథకం అంతకుమించిన వైఫల్యం. తాగునీరు (జల్‌ జీవన్‌) పథకం ఎండిపోయింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఒక ఘోర వైఫల్యం.

ఓట్‌ చోరీ వ్యతిరేక ఉద్యమం ఇండియా కూటమికి కొత్త బలాన్ని సమకూర్చింది. ఎన్డీఏకు గట్టి సవాళ్లను విసిరే శక్తి ప్రతిపక్ష కూటమికి లభించింది. ఇది నరేంద్రమోదీని కలవరపెడుతోంది. గురువారంనాడు ఫిక్కీ వార్షిక సమావేశంలో ఆయన చేసిన ప్రసంగమే అందుకు నిదర్శనం. ఓట్‌ చోరీ ఉద్యమ అనుభవంతో ప్రజలు ఎదుర్కొంటున్న మరిన్ని సమస్యలపై పోరాడేందుకు ఇండియా కూటమి సమాయత్తమవాలి. అటువంటి పోరాటాలు చేసినప్పుడే తిరుగులేని రాజకీయశక్తిగా ప్రభవించడం సాధ్యమవుతుంది.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 02:10 AM