Share News

‘ఆత్మగౌరవ ప్రతీక’ను కాపాడుకోవాలి

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:46 AM

విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు. ఆంధ్రా ప్రజల పోరాటానికి, త్యాగానికి చిరునామా! ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఈ పరిశ్రమను అందరం కలిసి కాపాడుకోవాలి!...

‘ఆత్మగౌరవ ప్రతీక’ను కాపాడుకోవాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు. ఆంధ్రా ప్రజల పోరాటానికి, త్యాగానికి చిరునామా! ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఈ పరిశ్రమను అందరం కలిసి కాపాడుకోవాలి!

1960 సంవత్సరం పంచవర్ష ప్రణాళికలో తీరప్రాంతంలో ఉక్కు కర్మాగారం కోసం ప్రతిపాదన చేశారు. అందుకు అనువైన ప్రదేశం కోసం సర్వే చేయటానికి ఒక అమెరికన్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. కర్మాగార స్థాపనకు విశాఖపట్నం అనుకూలమని ఆ కంపెనీ నివేదిక ఇచ్చింది. కానీ ఈ కర్మాగారాన్ని తమ రాష్ట్రానికి తన్నుకుపోవటానికి వివిధ రాష్ట్రాల నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. 1966లో కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను తిరస్కరించేలా చేశారు. దాంతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించగల స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం నుంచి తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రంలో పెద్దయెత్తున ఆందోళనలు చెలరేగాయి. విద్యార్థులు, యువకులు రోడ్డెక్కారు. ఈ ఉద్యమానికి టి.అమృతరావు, తెన్నేటి విశ్వనాథం, ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులు నాయకత్వం వహించారు.

గుంటూరు జిల్లా విసదల గ్రామానికి చెందినవారు అమృతరావు (ఈయన విగ్రహం అమరావతి రోడ్డులో మెన్స్‌ మెడికల్ హాస్టల్‌కు వెళ్లే దారిలో ఉంది). ఈయన అప్పటికే పేరొందిన కాంగ్రెస్ నాయకుడు. 1966 అక్టోబర్ 14న ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ విశాఖ వీధుల్లో తిరిగి వేలాది మందిని కూడగట్టారు. మరుసటి రోజే విశాఖపట్నం కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్ష 20 రోజుల పాటు సాగింది. దాంతో ఉద్యమం రాష్ట్రమంతా దావానలంలా వ్యాపించింది. గుంటూరు, విజయవాడ, తిరుపతి, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు, యువకులు లక్షల సంఖ్యలో విశాఖపట్నం వచ్చారు. నవంబర్ 1న పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రమంతా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విజయవాడ, గుంటూరు, కాకినాడల్లో కూడా కాల్పులు జరిగి మొత్తం 32 మంది చనిపోయారు. ఉద్యమ తీవ్రతకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విశాఖలోనే ఉక్కు కర్మాగారం నెలకొల్పుతున్నట్టు ప్రకటించింది. కానీ తాత్సారం చేయటంతో మరికొంతకాలం ఉద్యమం కొనసాగింది. ఏడుగురు కమ్యూనిస్టు పార్టీల ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. చివరికి 1970 జూలైలో పార్లమెంట్ దీనికి ఆమోదం తెలిపింది.


ఉక్కు కర్మాగారం కోసం 68 గ్రామాలకు చెందిన 16,850 కుటుంబాలు సుమారు 40,000 ఎకరాల భూములు త్యాగం చేశారు. దానికి ప్రతిఫలంగా స్టీల్ ప్లాంట్‌లో ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వారికి ఆర్‌–కార్డ్‌ (రిహాబిలిటేషన్‌ కార్డ్‌) ఇచ్చారు. అయితే ఇప్పటివరకు 8,000 కుటుంబాలకే ఆ అవకాశం వచ్చింది. మిగిలిన 8,850 కుటుంబాలు 35 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం 29,000 మంది వరకు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిజానికి ఇంకా ఎక్కువ మందే అవసరమవుతారు. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందన్న సాకుతో ఉద్యోగాల్లో కోతపెట్టారు. తక్కువ మంది కార్మికులు ఉండటం కూడా ఇటీవల జరిగిన ప్రమాదానికి ఒక కారణం. ఫ్యాక్టరీలో ప్రత్యక్ష ఉద్యోగాలకు తోడు స్టీల్ ప్లాంట్ ఆధారిత ఎంఎస్‌ఎంఈల ద్వారా 40–50 వేల మంది ఉపాధి పొందుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి 2,000 నుంచి 2,500 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.

ఇదిలావుంటే, ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోందనే వంకతో ఆశ్రిత పెట్టుబడిదారులకు దాన్ని చౌకగా 20–30వేల కోట్లకే ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. అయితే ఆ భూముల విలువే ఇప్పుడు 1.5 నుంచి 2.5 లక్షల కోట్లు ఉంటుంది. 20వేల ఎకరాల మిగులు భూమి ఉంది. దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంది. అసలు ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందే దానికి సొంతంగా ఐరన్ ఓర్ గనులు కేటాయించకపోవటం వల్ల. రాష్ట్రంలో ఓబుళాపురం గనులను, ఇంకా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ గనులను కేటాయించమని ఎప్పటినుంచో అడుగుతున్నా కేటాయించలేదు. ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలకు మాత్రం గనులు కేటాయించిన ప్రభుత్వాలు, విశాఖ ఉక్కుకు కేటాయించకపోవటం శోచనీయం. ప్లాంట్ మొత్తం ఉత్పత్తి ఖర్చులో 60–70శాతం కేవలం ముడిసరుకు కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తోంది. అదే ఇతర ఫ్యాక్టరీల్లో అయితే ఆ ఖర్చు 35–45శాతం మాత్రమే. కోవిడ్ టైంలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశమంతా సరఫరా చేసిన ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉంది.


ఇదిలా ఉంటే, పక్కనే ఉన్న గంగవరం పోర్టును ఆశ్రిత పెట్టుబడిదారులకు అప్పగించిన తర్వాత స్టీల్ప్లాంట్ ఇబ్బందులు మరింతగా పెరిగి నష్టాల్లోకి వెళ్లింది. అంతకుముందు సముద్రం నుంచి నేరుగా కన్వేయర్ బెల్ట్ మీద ముడిసరుకు వచ్చేది. కానీ ఇప్పుడు వారికి ఛార్జీలు కట్టాల్సి వస్తోంది. దాని వల్ల ఖర్చులు, వారితో పేచీలు కూడా పెరిగాయి. స్టీల్ ప్లాంట్ కింద ఉన్న 20వేల ఎకరాల మిగులు భూమిపై కన్నేసిన వారు ప్లాంట్‌ను ఎలాగైనా చేజిక్కించుకునేందుకు యత్నిస్తూ, స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లే కుట్రలు పన్నుతున్నారు. వారికి మేలు చేసేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను 20–30వేల కోట్లకే ప్రైవేటుపరం చేయటానికి చర్యలు ప్రారంభించింది. ఈ దారుణానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమించారు.

స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి లేదా ఎన్‌ఎండీసీతో అనుసంధానం చేసి ఫ్యాక్టరీ నడపాలి. గంగవరం పోర్టును ప్రభుత్వమే నిర్వహించి ప్రైవేట్‌ వ్యక్తులు పెడుతున్న ఇబ్బందులను తొలగించాలి. మిగులు భూమిని వారి పరం చేయరాదు. భూములిచ్చి ఇప్పటికీ ఆశతో ఎదురుచూస్తున్న కుటుంబాలకు స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇవ్వాలి. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసి రియల్ ఎస్టేట్ రాబందుల పాలు చేయకూడదు. ఈ ప్లాంట్ మూతబడితే లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. కనుక విద్యార్థులు, యువకులు, రైతులు, సామాన్య ప్రజల త్యాగాలతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటును పరిరక్షించే ఈ ఉద్యమాన్ని అందరం బలపరచాలి.

డా. జి.గంగాధర్

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు

జులై మూడో వారంలో తల్లికి వందనం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 12:46 AM