ఎన్ని పుట్టినరోజులైనా విరసం ఇంతేనా?
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:09 AM
విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 5న విరసం వాళ్ళు చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘భారతదేశంలో ఫాసిజం – ప్రత్యేకతలు’ అని ఒక కరపత్రం విడుదల చేసారు...
విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 5న విరసం వాళ్ళు చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘భారతదేశంలో ఫాసిజం – ప్రత్యేకతలు’ అని ఒక కరపత్రం విడుదల చేసారు. 1500 పదాల ఈ కరపత్రంలో ‘బ్రాహ్మణీయ’ అనే పదం మూడుసార్లు మాత్రమే వచ్చింది. ‘పెట్టుబడి’, ‘పెట్టుబడిదారీ’, ‘దళారీ’, ‘బూర్జువా’, ‘అర్ధ వలస’ పదాలు మాత్రం ముప్పైసార్లు వచ్చాయి. భారతదేశంలో ఫాసిజం కేవలం ‘బూర్జువా’, ‘అర్ధ వలస–అర్ధ భూస్వామ్యా’ లతో మాత్రమే ముడిపడి ఉన్నదా? ఫాసిజం గురించి చెప్పమన్నా, కుల వ్యవస్థ గురించి చెప్పమన్నా, అదానీ, అంబానీ లాంటి సోఫిస్టికేటెడ్ కార్పొరేట్ దురాక్రమణ గురించి మాట్లాడమన్నా – విరసం ధోరణి అటు తిరిగి ఇటు తిరిగి ‘బూర్జువా’, ‘అర్ధ వలస అర్ధ భూస్వామ్యా’ల దగ్గరకే వచ్చి ఆగిపోతుంది.
అసలు ‘ఫాసిజం’ అంటే ఏమిటి? క్లుప్తంగా చెప్పుకుంటే– నిరంకుశ లేదా నియంతృత్వ పాలన. ఫాసిస్ట్ పాలనలో సామాన్యంగా కనపడే లక్షణాలు– అతివాద జాతీయవాదం, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడం, పౌర హక్కులకూ స్వేచ్ఛలకూ పరిమితులు విధించడం, వ్యక్తులూ సంస్థలూ తమ స్వప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే లోబడాలని ప్రభుత్వం బలవంతపెట్టడం, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అబద్ధ ప్రచారాన్నీ (ప్రొపగాండా) బలప్రయోగాన్నీ తరచుగా వాడటం... మొదలైనవి. ఇది ముస్సోలిని పుణ్యమా అని ముందుకు వచ్చిన పొలిటికల్ ఐడియాలజీ. వ్యక్తులందరూ ఒకే జాతీయ సమూహంగా ఏకమవ్వాలి, వ్యక్తికంటే దేశమే గొప్పది, ఆ ఏకీకృత దేశాన్ని ఒక బలమైన కేంద్రీయ ప్రభుత్వం నడిపించాలి అనే విలువలను భూమికగా చేసుకుని ఫాసిజం పని చేసింది. ఇక మన దేశంలో దేశంలో ప్రస్తుత ఫాసిస్ట్ భావజాలం ఎవరి అధికార కాంక్షను కాపాడడానికో అర్థం చేసుకోవటం సులభమే. కానీ ‘బూర్జువా’, ‘వలస వాదం’, ‘భూస్వామ్య వాదం’, ‘పెట్టుబడీదారీ వాదం’ లాంటి పదాలను విరసం వాళ్ళు ఆంజనేయ దండకంలా యాంత్రికంగా వాడటమే తప్ప ఈ దేశంలో ఫాసిజం మౌలిక లక్షణాల్ని చెప్పడానికి ఎందుకు మొహమాటపడుతున్నారో అర్థం కాదు. కాంగ్రెస్ కాలంలో ఉన్న ఫాసిజానికి, బెంగాల్‌లో సీపీఎం కాలంలో ఉన్న ఫాసిజానికి, నేడు సంఘ్ పరివార్ శక్తుల హయాంలో ఫాసిజానికి తేడా లేదా?
ఇప్పుడు ఉమర్ ఖలీద్‌కు బెయిల్ రాదు కానీ ఆశారం బాపూకు, డేరా బాబాకు బెయిల్ వస్తుంది. ఇంకో పక్క కేంద్ర గిడ్డంగి– అనుబంధ గిడ్డంగుల విధానాన్ని మార్చివేసి 130 టెండర్లు పిలిస్తే, అందులో 110 టెండర్లు అదానీకే వస్తాయి. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి చట్టాలను ఉల్లంఘించనక్కర్లేదు, పాటించాల్సిన నియమాలను మారిస్తే చాలు. అప్పుడిక ఫలితం ముందే నిర్ణయించబడిన ఆటగా మారుతుంది. 5.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారం చేస్తున్న వేదాంత గ్రూప్ చైర్మన్ ‘‘దేశంలో అత్యంత క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఈ ప్రభుత్వం ఒక్కరికే (అదానీ) ధారాదత్తం చేస్తున్నది’’ అని స్టేట్‌మెంట్ ఇస్తే, మరుసటి రోజే ఆయన కంపెనీ మీద ఈడీ దాడులు జరిగాయి. ఇది కేవలం పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడటం కోసమే కాదు. అదే అయితే కేవలం అదానీ కోసమే నియమాలు మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడిది ‘క్రోనీ కేపిటలిజం’ స్థాయిని కూడా దాటేసింది. ఇంకా దీన్ని పట్టుకుని విరసం వాళ్ళు ‘‘దళారీ బూర్జువా విధానం’’ అని పాతచింతకాయ పచ్చడి మాటలు వాడుతునే ఉన్నారు. అసలు పెట్టుబడీదారీవిధానం అంటేనే లాబీయింగ్ ఉండితీరుతుంది. మళ్ళీ దానికి ‘దళారీ’ అని ఏదో అమెరికా వాళ్ళో, చైనా వాళ్ళో మన ఆర్థిక స్థితిని తారుమారు చేస్తున్నట్టు రాయడం ఏమిటి? ‘యే టాటా కౌన్ రే, యే బిర్లా కౌన్ రే’ అని ఎగిరిన వాళ్ళు కాస్తా ఇప్పుడు సడన్‌గా అదానీ పిక్చర్‌లోకి వచ్చేసరికి ‘‘అరేయ్! ఇదేంటి 2000 వరకు అదానీ ఎవరో తెలీదు. ఎలా పుట్టుకొచ్చాడు. ఎవరు పెంచి పోషించారు?’’ అని నాలుక కొరుక్కుంటున్నారు. అసలు ఇప్పుడున్న పెట్టుబడీదారీ లక్షణాన్ని సమూలంగా అర్థం చేసుకోవడంలో తడబడుతున్నారు.
అలాగే ఏదో ‘ఆవు’ వ్యాసం లాగ ‘‘అర్ధ భూస్వామ్య–అర్ధ వలస రాజ్య సమాజంలో ఫాసిజం వస్తే ఎట్లా ఉంటుందో హిందుత్వ కార్పొరేట్ ఫాసిజంలో చూడవచ్చు’’ అని రాస్తారు. ‘అర్ధ వలస’ అంటే ఏమిటి? ఇప్పటి అదానీ మోనోపోలీని వదిలేసి మన దేశంలో అంతకంటే చిన్న సమస్య అయిన వలసవాదం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వలసవాదం ప్రతి వెనుకబడిన దేశం లోనూ ఉంటుంది. ఎందుకంటే – అక్కడ పెట్టుబడి ఎక్కువ అందుబాటులో ఉండదు. వేరే దేశాల పెట్టుబడుల మీద ఆధారపడిన ప్రతి ఎకానమీ పరిస్థితి ఇంతే! మరి విరసం వాళ్లకు ఇక్కడి ప్రయారిటీస్ తెలీవా? లేక తెలీనట్టు నటిస్తారా? ప్రతి ‘అర్ధ భూస్వామ్య–అర్ధ వలస దేశం’లో హిందూత్వ కార్పొరేట్ ఫాసిజం ఉందా లేక మన దేశంలోనే ఉందా? ఉంటే ఎందుకుంది? ఇక్కడి ప్రత్యేకతలు ఏంటి? ఇవన్నీ వదిలేసి ‘అర్ధ వలస’ అని ఊకదంపుడుగా రాయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇలాంటి వాళ్ళు సమాజాన్ని సమూలంగా మారుస్తాం అని చెప్తూ ప్రజలు నమ్మాలని ఆశించడం, నమ్మకపోతే రాజ్యం ఏజంట్స్ అనో, కార్పోరేట్ విషపురుగులు అనో ముద్ర వేయడం! ఇలాంటి విషయాల్లో– కుక్కని చంపే ముందు అది పిచ్చిదని ముద్ర వేయాలి అన్న ఫాసిస్ట్ సూత్రాన్నే వీళ్ళూ అనుసరిస్తారు.
‘‘భారతీయ రాజకీయ ఆర్థిక చరిత్రలో భాగంగా ఏర్పడిన బ్యూరాక్రటిక్ దళారీ పెట్టుబడీదారీ విధానం నుంచి ఫాసిజం వచ్చింది’’ అని రాస్తారు! దేశ రాజకీయ ఆర్థిక చరిత్రను అధ్యయనం చేయకుండా బాధ్యతారహితంగా మాట్లాడే మాటలు ఇవి. ఈ కరపత్రంలో వాక్యం వాక్యానికీ ఉండే అయోమయాన్ని బైట పెట్టాలంటే ఇక్కడ స్థలం సరిపోదు. విరసం కులాన్ని నిర్మాణాత్మక సమస్యగా చూడ్డం ఇప్పటికీ అలవాటు చేసుకోలేకపోయింది. బ్రాహ్మణీయ హిందూత్వ సమూల స్వరూపాన్ని ఛేదించలేక ఇప్పటికీ అవే ‘ఆవు’ వ్యాసాలు రాసుకుంటోంది!
పి. విక్టర్ విజయ్‌కుమార్
ఈ వార్తలనూ చదవండి:
దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..
గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..