విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట!
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:12 AM
రాష్ట్రంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2024 ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. ముఖ్యంగా...
రాష్ట్రంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2024 ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. ముఖ్యంగా అభివృద్ధికి ఆయువుపట్టుగా నిలిచే విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి విద్యుత్ డిమాండ్‌ను సర్దుబాటుచేయడంలో విజయవంతమైంది. ఎల్‌నినో ప్రభావంలోనూ ప్రజలకు నాణ్యమైన కరెంట్ అందుతుందంటే ప్రభుత్వ ముందుచూపుతో పాటు ఈ రంగంలో వచ్చిన పెట్టుబడులే కారణం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఆర్థిక సుస్థిరత, గ్రీన్ ఎనర్జీ విస్తరణ అనే మూడు ప్రధాన లక్ష్యాల సాధనగా ప్రభుత్వం పని చేస్తోంది. జగన్‌రెడ్డి పాలనలో విధ్వంసమైన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను గాడిలో పెడుతూ సామాన్యులకు 24 గంటలు నిరాటంకంగా విద్యుత్ అందిస్తోంది.
విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రెండో ఏడాది కూడా ‘ట్రూ డౌన్’ విజయవంతంగా అమలు చేస్తూ 1.30 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో రూ.924 కోట్లు ట్రూడౌన్ చేసింది. ఈ మొత్తాన్ని 2025 నవంబరు నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు ప్రతినెలా బిల్లులో సర్దుబాటు చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.940.07 కోట్లు ట్రూడౌన్ చేసేలా డిస్కంలు ఏపీఈఆర్‌సీలో పిటిషన్‌లు దాఖలు చేశాయి. వాటిని పరిశీలించి అనుమతించిన ఖర్చులు పోను రూ.629.35 కోట్లు ట్రూడౌన్ కింద వినియోగదారులకు సర్దుబాటు చేసేందుకు కమిషన్ అనుమతించింది.
సామాన్య విద్యుత్ వినియోగదారులతో పాటు అనేక రంగాలకు తోడ్పాటు అందించేలా ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తోంది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50లకే ఇచ్చి ఏడాదికి రూ.1,150 కోట్లు అదనపు భారం ప్రభుత్వమే భరిస్తోంది. వాణిజ్య కేటగిరీ వినియోగదారులకు యూనిట్ ధరను రూ.12.25 నుంచి రూ.9.95కు తగ్గించి వ్యాపారస్తులకు భరోసా కల్పిస్తోంది. కుటీర పరిశ్రమలకు లోడ్ పరిమితి 10 హెచ్‌పీ నుంచి 20 హెచ్‌పీకి పెంచి చిన్నతరహా పెట్టుబడిదారులకు ఆర్థిక చేయూతను ఇస్తోంది. హ్యాండ్‌లూమ్ మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరాఫరా చేసి చేనేత రంగానికి కొత్త ఊపును తీసుకొచ్చింది. అలానే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. 22 లక్షల మంది రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ నిరాటంకంగా అందించి సాగులో వారికి తోడుగా నిలుస్తోంది. ఈ రెండేళ్లలో వివిధ రూపంలో రూ.32,000 కోట్ల విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వమే భరించడం పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో గత ఏడాదితో పోల్చితే 25శాతం వరకు విద్యుత్ డిమాండ్ పెరిగింది. ప్రతి ఏడాదీ ఈ నెలలో సుమారు 210 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడకం ఉంటే.. ఈ ఏడాది అది సుమారు 296 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ మేరకు రోజుకు 10 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ కొనుగోలు చేసి నెలకు రూ.240 కోట్లు వరకు అదనంగా ప్రభుత్వం భరిస్తోంది. థర్మల్ విద్యుత్ తయారీకి కావాల్సిన బొగ్గు నిల్వలను పెంచుతూ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంది. ఇదే సమయంలో సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, పంప్డ్ స్టోరేజ్ వంటి పునరుత్పాదక రంగాలపై దృష్టి పెడుతూ ఈ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 6.5 లక్షల ఉద్యోగాలే లక్ష్య సాధనగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.
ఎన్. నీలం నాయుడు
Also Read:
హెల్త్‌కేర్ సెక్యూరిటీ.. కొత్త తరం ఆర్థిక ప్రణాళిక
ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు రూ.5లక్షల ఫైన్