..ఇక్కడి నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు!
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:44 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిగతా దేశాలతో సాగిస్తున్న సుంకాల (టారిఫ్) యుద్ధానికి అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఫెడరల్ ప్రభుత్వపు శాసన నిర్మాణ విభాగమైన అమెరికన్ కాంగ్రెస్‌కు మాత్రమే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిగతా దేశాలతో సాగిస్తున్న సుంకాల (టారిఫ్) యుద్ధానికి అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఫెడరల్ ప్రభుత్వపు శాసన నిర్మాణ విభాగమైన అమెరికన్ కాంగ్రెస్‌కు మాత్రమే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA) ప్రకారం సుంకాలు విధించే అధికారం ఉంటుందని, ప్రెసిడెంట్‌కు అలాంటి విశిష్ట అధికారాలు లేవని స్పష్టం చేసింది. అంతేకాదు, ట్రంప్ విధించిన విస్తృత టారిఫ్‌లను రద్దు చేసింది. దురుసు ప్రవర్తనతో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ.
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనేది అక్కడ ఓ యాభై ఏళ్ళుగా వినిపిస్తున్న నినాదం. 1980లలో రోనాల్డ్ రీగన్, 1992లో బిల్ క్లింటన్ ఈ నినాదాన్ని ముందుకు తెచ్చారు. 2015 ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని ఎర్రటోపీ మీద ముద్రించి నెత్తిన పెట్టుకున్నారు ట్రంప్. ఆయన రెండోసారి గెలిచాక ఈ నినాదం వాగ్దానంగా మారింది. వాగ్దానం విధానంగా మారింది. సుంకాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనంలో ట్రంప్ నియమించిన న్యాయమూర్తులు కూడా ఉన్నారు. అది ట్రంప్‌కు మరింత దిగ్ర్భాంతిని కలిగించే విషయం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో దేశాధినేతలు తమ ప్రయోజనాలను దేశ ప్రయోజనాలుగా చిత్రిస్తుంటారు. ట్రంప్ కూడా ఆ పనే చేశారు. ‘దేశ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలు తెగువ చూపలేదు’ అని విమర్శించారు.
అమెరికా రాజకీయ చరిత్రలో అధ్యక్షులు– న్యాయస్థానాల మధ్య ఘర్షణలు కొత్తవి కావు. ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ‘కోర్ట్ ప్యాకింగ్ ప్లాన్’ను తెచ్చి న్యాయస్థానాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. రిచర్డ్ నిక్సన్ కూడా వాటర్ గేట్ కేసులో న్యాయస్థానాల మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, అవేవీ పనిచేయలేదు. చివరకు వారు న్యాయస్థానాల తీర్పులను శిరసావహించాల్సి వచ్చింది. ట్రంప్ దుందుడుకు స్వభావం రీత్యా ఆయన సుప్రీంకోర్టు మీద తిరుగుబాటు చేస్తారా? అనే చర్చ కూడా ఒకటి నడుస్తోంది. కోర్టును బహిరంగంగా విమర్శించడం రాజకీయంగా సాధ్యమే. ఆ పని ట్రంప్ చేస్తూనే ఉన్నారు. అయితే, తీర్పును అమలు చేయకుండా తిరుగుబాటు చేయడం రాజ్యాంగ పరిధిలో సాధ్యం కాదు. అందుకే, ఇప్పటివరకూ అత్యంత అరుదుగా వాడిన 122వ సెక్షన్ ఉపయోగించుకుని, మొదటగా ప్రకటించిన పది శాతాన్ని పదిహేను శాతానికి పెంచి మళ్ళీ తన పంతం నెగ్గించుకునే ప్రయత్నంలో పడ్డారు ట్రంప్. తాను ఇతరత్రా మార్గాలను అన్వేషించి, ఆచరణలోకి తెచ్చేవరకూ ఈ విధానం ఉనికిలో ఉంటుందన్నారు ట్రంప్. తీర్పును అడ్డుపెట్టుకొని తనతో గేమ్స్ ఆడవద్దని ఇతర దేశాలను కూడా హెచ్చరించారాయన. సుంకాల మాదిరిగానే, గ్రీన్‌ల్యాండ్ వివాదం కూడా ముగిసినట్టుగా భావించడానికి అవకాశం లేదు. భూగోళంపై గ్రీన్‌ల్యాండ్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం తగ్గిపోదు, అమెరికాకు గ్రీన్‌ల్యాండ్ అవసరం కూడా తగ్గేది కాదు.
డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్న ఏఐ మ్యాప్‌లో గ్రీన్‌ల్యాండ్, కెనడా, వెనెజువెలా తదితర దేశాలను అమెరికా భూభాగంగా చూపించారు. చట్టపరంగా దీనికి ఎటువంటి విలువా లేదు కానీ, రాజకీయాల్లో మ్యాప్‌లు అమాయక బొమ్మలు కావు. అవి ప్రపంచ శక్తుల భవిష్యత్తు ఆకాంక్షలను, నడకల దిశను, దురాక్రమణ ఆలోచనలను సూచించే సంకేతాలు. గతంలోకి పరికించి చూస్తే, ప్రపంచ శక్తులు ముందుగా మ్యాపులతోనే ఆడుకున్నాయి. తరువాత మాటలుగా మార్చాయి. ఆ తరువాత విధానాలను మార్చాయి. ఆపైన యుద్ధాలు సాగించాయి. చివరకు దేశాల సరిహద్దులనే మార్చేశాయి. ప్రపంచ పటంలో అగ్రరాజ్యంగా వెలుగొందాలనుకున్న ఏ దేశమైనా తన ప్రయాణాన్ని ఎప్పుడూ యుద్ధంతో మొదలుపెట్టదు; అది ముందుగా భాషలోకి, బొమ్మల్లోకి, ప్రజల ఊహల్లోకి ప్రవేశిస్తుంది. ఆ మ్యాప్ కింద రాసిన ‘ఇక్కడి నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు’ అనే ట్రంప్ వ్యాఖ్య కూడా కేవలం ఒకానొక రాజకీయ వాక్యం కాదు. చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే– ఇలాంటి భాష వినిపించిన ప్రతిసారీ, దాని వెంబడి ఘోర పరిణామాలే జరిగాయి. బ్రిటిష్ చరిత్రకారుడు ఏజేపీ టేలర్ అన్నట్లు, ‘యుద్ధాలు అకస్మాత్తుగా జరుగుతాయనుకోవడం మన అజ్ఞానం; నిజానికి అవి చాలాకాలంపాటు మాటలతోనే సిద్ధమవుతాయి’. నేటి ప్రపంచంలో ఆ మాటల స్థానాన్ని బొమ్మలు, మీమ్స్, ఏఐ మ్యాప్‌లు ఆక్రమించాయి. రూపం మారిందిగానీ సారం సేమ్ టు సేమ్!
1930ల నాటి యూరప్‌లో ఇటలీ ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినీ మాటలు కూడా ఇలానే ఉండేవి. ఆఫ్రికా ఆక్రమణను సమర్థించుకోవడానికి ఆయన ‘ఇటలీ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి సువిశాల స్థలం కావాలి’ అంటుండేవారు. నాజీ హిట్లర్ కూడా విదేశీ భూభాగాల గురించి ఇలాంటి మాటల్నే తన ఆత్మకథలో రాసుకున్నాడు. జర్మనీలో ఆహార కొరత సమస్య ముందుకు వచ్చినప్పుడల్లా తాను తూర్పు దిక్కుకు చూసేవాడిననీ, అక్కడ తనకు సువిశాల రష్యా భూముల్లో పంటలు పండిస్తున్న యూదు రైతులు కనిపిస్తారని పేర్కొన్నాడు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే జర్మనీ ఆహార సమస్య తీరుతుందనేది అతని ఆలోచన! అయినప్పటికీ స్టాలిన్ రష్యాతో ఒక నిర్యుద్ధ సంధి చేసుకున్నాడు. వీలు చిక్కగానే ఆ సంధిని బాల్టిక్ సముద్రంలో కలిపేసి, రష్యా భూభాగంలోకి 15 వందల కిలోమీటర్లకు పైగా చొచ్చుకుపోయాడు. జపాన్ చక్రవర్తి హిరోహిటో, స్పెయిన్ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో కూడా ఇతర దేశాల భూముల్ని అక్రమించుకోవడాన్ని బాహాటంగా సమర్థించుకుంటూ ఇలాంటి సిద్ధాంతాలనే ముందుకు తెచ్చేవారు.
జాతీయ గర్వం, దేశభద్రత, వ్యూహాత్మక అవసరాల సాకులతో సాగిన ఆ వాదనలు చివరకు భూమండలాన్ని రక్తపాతంలో ముంచాయి. ఇది వ్యక్తుల్ని విమర్శించడానికో, డొనాల్డ్ ట్రంప్‌ను ముస్సోలినీతోనో, హిట్లర్‌తోనో పోల్చడానికి కాదు. చరిత్రలో పదే పదే కనిపించే ధోరణుల్ని కొంచెం ముందుగా, లోతుగా అర్థం చేసుకోవడానికి మాత్రమే గతాన్ని తడమాల్సి వస్తున్నది.
కీడుకు ఒక సామాన్య లక్షణం ఉంటుందని అమెరికన్ చరిత్రకారిణి హన్నా ఆరెండ్ అంటారు. దానిని ఆమె ‘Banality of Evil’గా నిర్వచించారు. బాధ్యతగల స్థానాల్లో ఉన్నవారు తాము తీసుకునే నిర్ణయాల పర్యవసానాలను బేరీజు వేసుకునే ఇంగితజ్ఞానాన్ని కోల్పోయిన ప్రతిసారీ, ప్రపంచస్థాయిలో తీవ్రమైన కీడు చోటు చేసుకుందని ఆమె హెచ్చరించారు. సార్వభౌమత్వం అంటే శక్తిమంతుడి ఇష్టాయిష్టాలు కాదు; అది ప్రజల హక్కు. ఈ ఆదర్శాన్ని చిన్నచూపు చూస్తే చిన్న దేశాల భవిష్యత్తే కాక మొత్తం ప్రపంచ శాంతే కనుమరుగైపోతుంది. చరిత్ర మౌనంగా ఉండదు. అది వర్తమాన ప్రపంచాన్ని నిద్ర లేపుతుంటుంది. నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని గుర్తుచేస్తుంది. అప్రమత్తంగా ఉన్నవాళ్ళు, సమూహ బాధ్యతలు తెలిసినవాళ్ళు మాత్రమే చరిత్ర విసిరిన సవాలుకు సమాధానం ఇవ్వగలరు.
డానీ
సమాజ విశ్లేషకులు
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ