Share News

కల్లోల కడలిలో అగ్రరాజ్యం!

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:15 AM

యుద్ధ నేరస్థుడు స్వేచ్ఛగా తన దురాగతాలను మరింత తీవ్రంగా కొనసాగిస్తుండడం ఎంత విచారకరం! ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు గురించి నేను ప్రస్తావిస్తున్నాను. గాజాలో...

కల్లోల కడలిలో అగ్రరాజ్యం!

యుద్ధ నేరస్థుడు స్వేచ్ఛగా తన దురాగతాలను మరింత తీవ్రంగా కొనసాగిస్తుండడం ఎంత విచారకరం! ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు గురించి నేను ప్రస్తావిస్తున్నాను. గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణపై 2024లో ఆయనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ అరెస్ట్‌ వారంట్‌ ఒకటి జారీ అయింది. ఆ మేరకు నెతన్యాహును అరెస్ట్‌ చేసి ఉన్నట్టయితే ఇరాన్‌, లెబనాన్‌, గల్ఫ్‌, ఇజ్రాయెల్‌ ప్రజలకు నేటి దుస్థితి దాపురించి ఉండేది కాదు. ఇప్పుడు ఇరాన్‌కు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో యుద్ధానికి వెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను పురిగొల్పింది అతగాడే. జైలులో ఉండవలసిన నెతన్యాహు, దురహంకారి ట్రంప్‌ చూస్తుండగా మానవతకు వ్యతిరేకంగా మరిన్ని అమానుష నేరాలకు పాల్పడుతున్నాడు!

ఈ యుద్ధంలోకి దిగేలా అమెరికాను తానే రెచ్చగొట్టానన్న అభియోగాలను నెతన్యాహు నిరాకరిస్తున్నారు. ఇరాన్‌ నుంచి ఇజ్రాయెల్‌కు ఎదురయ్యే అణుముప్పు గురించి ట్రంప్‌ను తాను ఒప్పించాల్సిన అవసరం రాలేదని, పరిస్థితిని ఆయనే అర్థం చేసుకుని సొంత చొరవతో వ్యవహరించారని నెతన్యాహు చెబుతున్నారు. అయితే నెతన్యాహు వాదనను జెనీవాలో అమెరికా–ఇరాన్‌ల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఒమన్‌ విదేశాంగమంత్రి తిరస్కరించారు. చర్చలను వ్యతిరేకించిన నెతన్యాహు ప్రోద్బలంతోనే ట్రంప్‌ వాటికి స్వస్తి చెప్పి యుద్ధానికి ఆదేశించారని ఒమన్‌ మంత్రి స్పష్టం చేశారు. గత నెల చివరి రోజున అమెరికాతో కలిసి ఇరాన్‌కు వ్యతిరేకంగా సంయుక్త దాడులు ప్రారంభించిన తరువాత ఇజ్రాయెల్‌ యుద్ధ వ్యూహం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ సైనికచర్య ప్రారంభ లక్ష్యాలను దాటి విస్తృత, నిరంతర, స్వతంత్ర ఎత్తుగడలతో స్వంత అస్తిత్వాన్ని సముపార్జించుకున్నది.

ఈ స్వతంత్ర వ్యూహంలో భాగంగానే ఇరాన్‌కు అత్యంత కీలకమైన సౌత్‌పార్స్‌ సహజవాయువు క్షేత్రంపై ఈ నెల 18న ఇజ్రాయెల్‌ దాడి చేసింది. ఈ దాడి గురించి తనకు ముందుగా తెలియదని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సౌత్‌పార్స్‌ సహజవాయువు క్షేత్రంపై దాడి ఉదంతంతో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధ లక్ష్యాల మధ్య అంతరం పెరుగుతోంది. ఇరాన్‌ ఆర్థిక, సైనిక, మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని నెతన్యాహు పట్టుదల. అయితే వెనెజువెలాలో మాదిరిగా ఇరాన్‌లో తమకు అనుకూలమైన నాయకులతో ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ట్రంప్‌ ప్రాధాన్యమిస్తున్నారు. ఇరాన్‌ చమురు క్షేత్రాలపై సౌత్‌పార్స్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ తరహా దాడులను మళ్లీ చేయబోమని, అయితే ఇరాన్ భూభాగాలను ఆక్రమించుకునేందుకు పూనుకోవాలని నెతన్యాహు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన అభీష్టం నెరవేరితే యుద్ధం పశ్చిమాసియాలోని సకల దేశాలకూ విస్తరించడం ఖాయం.


గాజా యుద్ధం ప్రారంభమైన నాటినుంచీ నెతన్యాహు దౌర్జన్య విధానాలను అమెరికా అధ్యక్షుడు సమర్థిస్తూ వస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు ట్రంప్‌ చాలాసార్లు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రితో ఫోన్‌లోనే కాకుండా ముఖాముఖీగా కూడా మంతనాలు జరిపారు. వీటి ఫలితంగానే ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించాలని ఇద్దరూ నిర్ణయించారు. ఇరాన్‌ సర్వోన్నత నేత అలీ ఖమెనీ ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లోని తన నివాసంలో ప్రభుత్వ, సైనిక దళాల ఉన్నతాధికారులతో సమావేశమవనున్నారని సీఐఏ, ఇజ్రాయెల్‌ గూఢచార వర్గాలు పసిగట్టాయి. సరిగ్గా ఆ సమావేశం జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులు ప్రారంభించింది. తొలిరోజునే ఖమేనీ, ఇతర ఉన్నతాధికారులు మరణించారు. ఖమేనీ మరణం యుద్ధాన్ని ఆ తొలి క్షణంలోనే తీవ్రతరం చేసింది. నిజానికి ఫిబ్రవరి 28కి రెండు రోజుల ముందే అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చల్లో సానుకూల స్థితి నెలకొన్నట్టు గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అణు ఒప్పందానికి దోహదం చేసేలా ఇరాన్ అనేక షరతులకు సమ్మతించిందని బ్రిటన్‌ జాతీయ భద్రతా సలహాదారు జోనాథన్‌ పోవెల్‌ చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ట్రంప్‌, స్టీవ్‌ విట్కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌లు నెతన్యాహు వాదనలకే ప్రాధాన్యమిచ్చారు. రెండు రోజుల అనంతరం ఎటువంటి హెచ్చరిక లేకుండా చర్చలకు అర్ధాంతరంగా స్వస్తి చెప్పి ఈ యుద్ధాన్ని ప్రారంభించారు!

బెంజమిన్‌ నెతన్యాహు ఈ కాలపు యుద్ధోన్మాదులలో అగ్రేసరుడు. తనను తాను నోబెల్‌ శాంతి పురస్కారానికి ప్రతిపాదించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ సైతం యుద్ధ పిపాసిగా పరిణమిస్తున్నాడు. వెనెజువెలా మాదిరిగానే క్యూబాను కూడా దాసోహం చేసుకునేందుకు ఆయన ఆరాటపడుతున్నాడు. నెతన్యాహు తనను తాను ‘మిస్టర్‌ సెక్యూరిటీ’గా అభివర్ణించుకుంటున్నారు. 7 అక్టోబర్ 2023 విపత్తు–ఇజ్రాయెలీలపై హమాస్‌ అమానుష దాడి–ని పసిగట్టి నివారించలేకపోయిన నెతన్యాహు ఇజ్రాయెల్‌ మనుగడను కాపాడగలిగే ఏకైక నాయకుడిని తానేనంటూ ‘మిస్టర్‌ సెక్యూరిటీ’గా చలామణీ అవుతున్నారు. వచ్చే అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌ తన చేతుల్లో భద్రంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరోపక్క, ఆయన ఏకపక్షంగా లెబనాన్‌, యెమెన్‌, సిరియా, ఇరాక్‌లపై దాడులు చేశారు. పాలస్తీనియన్ల అస్తిత్వాన్ని తుడిచిపెట్టేందుకు గాజాలో మారణకాండకు పాల్పడ్డారు. గత జూన్‌లోను, మళ్లీ ఫిబ్రవరిలోను ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లాడు. ఈ చర్యలతో ఆయన ఇజ్రాయెల్‌కు శాశ్వతమైన భద్రతను సమకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ఆయన నిత్యం కలహశీలతతో వ్యవహరిస్తున్నారు. గాజాలో హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తానని శపథం చేసిన నెతన్యాహు హింసోన్మాదానికి 70 వేల మందికి పైగా పాలస్తీనియన్లు బలయ్యారు. లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్‌ అనుకూల సంస్థ హెజ్బొల్లాను అంతమొందించేందుకు నెతన్యాహు జరిపిన దాడుల్లో ఇప్పటికే పది లక్షల మందికి పైగా లెబనీస్‌ ప్రజలు నిర్వాసితులయ్యారు. అమెరికా– ఇజ్రాయెల్‌ దాడుల నుంచి బతికి బయటపడిన మిగతా ఇరాన్‌ నాయకులు ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులను ముమ్మరం చేశారు.


అణ్వాయుధాలను సమకూర్చుకోవాలనే దృఢ సంకల్పానికి కూడా వచ్చారు. ఇందుకు ‘మిస్టర్‌ సెక్యూరిటీ’ వినాశనకర విధానాలే కారణం. ఇటువంటి పరిస్థితిని నివారించేందుకే జో బైడెన్ లాంటి వారు ఇజ్రాయెల్‌ను అదుపు చేస్తుండేవారు. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ నెతన్యాహుకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడికి అనుమతించారు. ట్రంప్ తీరు జుగుప్సాకరంగా ఉంటోంది. ఇరాన్ నుంచి అమెరికాకు అణు ముప్పు ఉందని అమెరికన్‌ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. యుద్ధాన్ని గల్ఫ్‌ దేశాలకు విస్తరింపజేసేందుకు హోర్ముజ్‌ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్‌ పూనుకుంటోందన్న వాస్తవాన్ని పసిగట్టడంలో ట్రంప్‌ విఫలమయ్యారు. ఇది దిగ్భ్రాంతికరమైన వైఫల్యం. ఇప్పుడు ఈ జలసంధిని ఇరాన్ నియంత్రణ నుంచి తొలగిస్తామని గర్జిస్తున్నప్పటికీ వర్తమాన పరిణామాలపై ట్రంప్ కలత చెందుతున్నారనేది వాస్తవం.

భగభగ మండుతున్న చమురు క్షేత్రాలు, భస్మీపటలమైన నివాస గృహాలు, క్షతగాత్రుల ఆర్తరావాలు, ఆప్తులను కోల్పోయినవారి విలాపాల నడుమ, నాలుగో వారంలోకి ప్రవేశించిన ఈ యుద్ధంలో కొన్ని వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్‌ పాలనా వ్యవస్థ సుస్థిరంగా ఉన్నది, అంతేకాదు, మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్నది; ఇరానియన్లు తమ పాలకులపై తిరుగుబాటు చేసే సూచనలు ఏ మాత్రం లేవు; యుద్ధం సంభవిస్తే ఆ వినాశనాన్ని పశ్చిమాసియా అంతటికీ వ్యాపింపజేయాలన్న దివంగత ఖమేనీ ప్రణాళిక ఫలిస్తోంది; పతనమవుతున్న స్టాక్‌ మార్కెట్లు, పెరుగుతోన్న ఇంధన ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర అంతరాయాలు, కాంగ్రెస్‌కు జరగబోయే మధ్యంతర ఎన్నికలలో ఓటమి భయాలు ట్రంప్‌ను వెంటాడుతున్నాయి. ఇరానియన్‌ బాంబులు, క్షిపణుల కంటే ఆ ఆర్థిక దురవస్థలు, సంభావ్య రాజకీయ పరిణామాలే అమెరికా అధ్యక్షుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నెతన్యాహు దూకుడును అదుపుచేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ సంక్షోభం మరింత భయానకంగా విషమించక ముందే సమస్యల సుడి నుంచి అమెరికాను ఆయన గట్టెక్కించగలరా? అన్నది ఒక పెద్ద ప్రశ్న.

సైమన్‌ టిస్డాల్‌

(ది గార్డియన్‌)

ఇవి కూడా చదవండి..

5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్

Updated Date - Mar 24 , 2026 | 02:16 AM