ప్రపంచాన్ని తుపాకీతో బెదిరించి...
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:15 AM
వారు ఎప్పుడూ నేర్చుకోరు, ఎప్పటికీ మారరు. ఒక సార్వభౌమిక దేశాన్ని దుర్బలం చేసేందుకు కలహశీల అమెరికా అధ్యక్షుడు ఒకరు మరోసారి విధ్వంసక దాడులకు పూనుకున్నారు. తన చర్యను...
వారు ఎప్పుడూ నేర్చుకోరు, ఎప్పటికీ మారరు. ఒక సార్వభౌమిక దేశాన్ని దుర్బలం చేసేందుకు కలహశీల అమెరికా అధ్యక్షుడు ఒకరు మరోసారి విధ్వంసక దాడులకు పూనుకున్నారు. తన చర్యను సమర్థించుకునేందుకు పచ్చి అబద్ధాలు, సత్యదూర వాదనలు ప్రచారం చేస్తున్నారు. ఆ దౌర్జన్యాన్ని ముందస్తుగా సంకల్పించారు, ఆ దుష్ట సంకల్పం ప్రపంచానికి వెల్లడి కాకుండా మోసపూరిత శాంతి చర్చల తంతు జరిపారు. సంయమనం వహించాలన్న మిత్రదేశాల సలహాను పాటించలేదు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయ నియమాలు, ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేశారు, మరోసారి ఆ సార్వభౌమిక దేశంపై అత్యాధునిక విధ్వంసక ఆయుధాలతో విరుచుకుపడ్డారు.
గతంలో వలే ఇప్పుడు కూడా అమెరికా దౌర్జన్య చర్య ఫలితం ఊహించలేనిదేమీ కాదు: ఇరాన్‌కు వ్యతిరేకంగా విస్తృతస్థాయిలో మళ్లీ ప్రారంభమైన అమెరికా–ఇజ్రాయెల్ దాడి మహా విధ్వంసంతో అల్లకల్లోలాన్ని సృష్టించింది. పరిస్థితులను ఇంకా భయానకం చేస్తోంది, అంతర్జాతీయ చమురు విపణి కుదేలయిపోతోంది. టెహ్రాన్ పాలకుల మద్దతు ఉన్న హెజ్బొల్లా, హౌతీ సాయుధ బృందాలు రంగంలోకి దిగడంతో కొత్త విద్వేషాలు రగుల్కొంటాయి, ఉగ్రవాద ప్రతీకారాలు విజృంభిస్తాయి. పాశ్చాత్య ప్రపంచ విరోధులు మాత్రమే పరమానందం పొందుతారు. సార్థక ఫలితాలు ఏవైనా సమకూరుతాయా? అసాధ్యం. అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌లలో అమెరికా నేతృత్వాన పాశ్చాత్య దేశాల జోక్యపు చేదు ఫలితమే ఇప్పుడూ ఇరాన్‌లో చూడబోతున్నాం.
అఫ్ఘాన్, ఇరాక్‌లలో జోక్యాలు క్షమించరానివి! ఆ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనేలేదు. ప్రపంచాన్ని తుపాకీతో బెదిరించి తాను నిర్దేశించినట్టు నడిచేలా చేయగలనని 21వ శతాబ్ది ప్రజలు ఎన్నుకున్న అమెరికా అధ్యక్షుడు ఒకరు విశ్వసించడం విస్మయకరం! నైతిక వివేచన పూర్తిగా కొరవడిన నిర్ణయ ఫలితమే ఇరాన్‌పై దాడి. జార్జి బుష్ హయాంలో 2003లో ఇరాక్ దురాక్రమణ, ఇప్పుడు ఇరాన్‌పై భీకర దాడులు రెండూ ఒకే విధమైనవి. ఇతర దేశాలలో అమెరికా జోక్యాలు– వియత్నాంలోనూ, 1953లో సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన పాలన మార్పు రెండూ అంతిమంగా విఫలమయ్యాయి. ఆ వైఫల్యాలకు అమెరికా భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. విదేశాలలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని నివారిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. అది కల్తీలేని బొంకుమాట. ప్రపంచ దేశాలతో అమెరికా సంబంధాల తీరుతెన్నులను ట్రంప్ మార్చివేయగలరని విశ్వసిస్తున్నవారు 1945 అనంతరం సామ్రాజ్యవాద దురహంకారంతో అది పాల్పడిన నీతిబాహ్య చర్యలను ఓసారి సమీక్షించండి. పూర్వపు అధ్యక్షులకు ట్రంప్ భిన్నమైన వ్యక్తి కాదు. జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన తరువాత ఆ దేశంలోని చమురు సంపద మాత్రమే తనకు అవసరమని ట్రంప్ అన్నారు. అయితే ఆ తరువాత ఇతర విషయాలలో సంభవిస్తున్నది గమనిస్తే అమెరికా సామ్రాజ్యవాద జోక్యాల తుచ్ఛ చరిత్రకు భిన్నంగా లేదని అర్థమవుతుంది.
జార్జి బుష్ మాదిరిగానే డొనాల్డ్ ట్రంప్ సైతం అబద్ధాలే పునాదిగా ఒక సంక్షోభాన్ని సృష్టించారు. బుష్, ఆయన సహ నేరస్థుడు టోనీ బ్లెయిర్ వలే ట్రంప్ సైతం ఉద్దేశపూర్వకంగా ఇరాన్ నుంచి సంభావ్య ముప్పును గోరంతలు కొండంతలు చేశారు. దీర్ఘ శ్రేణి క్షిపణులను ఇరాన్ అభివృద్ధి చేస్తోందని, వాటివల్ల యూరోపియన్ దేశాలలోని అమెరికా బలగాలకు ముప్పు ఏర్పడవచ్చని, ఆ క్షిపణులు అమెరికా భూభాగాలకు కూడా చేరగలవని పదే పదే చెప్పారు. సద్దాం హుస్సేన్ కల్పిత ఆయుధాల విషయంలో బుష్ ప్రభృతులు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్నే ఇరాన్ విషయంలో ట్రంప్ చేశారు. ఇరాన్ దాడులకు సిద్ధమైనందునే తాము ముందస్తు దాడులు చేశామన్న ఇజ్రాయెల్ వాదనలో సత్యం ఏ మాత్రం లేదు. గత ఏడాది జూన్‌లో అమెరికా–ఇజ్రాయెల్ మొదటి సంయుక్త దాడి అనంతరం నెలకొన్న శాంతియుత పరిస్థితులను పరిరక్షించుకునేందుకే ఇరాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అణ్వాయుధాల తయారీ సామర్థ్యాన్ని సైతం ఇరాన్ వేగంగా సమకూర్చుకుంటోందని ట్రంప్ చేస్తున్న వాదనను గత ఇరవై ఏళ్లుగా ఇరాన్ పాలనావ్యవస్థ సర్వోన్నత అధినేత మొదలు జూనియర్ మంత్రి దాకా ప్రతి ఒక్కరూ ఖండిస్తూ వస్తున్నారు. ‘తాము ఎట్టి పరిస్థితులలోనూ అణ్వాయుధాన్ని అభివృద్ధి పరచబోమని’ ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అర్ఘాషి నిన్నగాక మొన్న స్పష్టంగా ప్రకటించారు. దీనిపై వాద ప్రతివాదాలు జరిగాయి. అయితే ఇరాన్ అణ్వాయుధాల తయారీలో పురోగతి సాధించినట్టు ఎటువంటి రుజువులను అమెరికా, ఐక్యరాజ్యసమితి అధికారులుగానీ నెతన్యాహు గానీ ప్రపంచానికి వెల్లడించలేకపోయారు.
‘అమెరికా ప్రజాస్వామ్యానికి, ప్రపంచ భద్రతకు ట్రంప్ ఒక పెనుముప్పుగా పరిణమించారు’ అని బరాక్ ఒబామా పాలనలో జాతీయ భద్రతా వ్యవహారాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన బెన్ రోడెస్ వ్యాఖ్యానించారు. మన ఆధిక్యతను అంగీకరించని, మన మార్గాన్ని అనుసరించేందుకు సుముఖంగా లేని దేశాలను లొంగదీసుకోవాలని అమెరికన్ ఆదర్శాలు పురిగొల్పుతాయా? అని రోడెస్ విస్మయం వ్యక్తం చేశారు. ఇతర దేశాల కంటే అమెరికా స్వాభావికంగా ప్రత్యేకమైనది, విభిన్నమైనది, ఉన్నతమైనదని ప్రవచించే అమెరికన్ అసాధారణవాదానికి ఈయనొక వ్యక్తీకరణ. అయితే ఆ అసాధారణ వాదం ఒక మిథ్యా విశ్వాసమే.
ఇరాన్‌పై దాడికి సర్వసన్నాహాలు చేస్తూనే ట్రంప్ ఆ దేశంతో రెండోసారి చర్చలు జరిపారు! జెనీవాలో జరిగిన ఆ చర్చలు ఎంత ప్రహసనప్రాయమైనవో ఇప్పుడు తేటతెల్లమయింది. తమ లక్ష్యాలను వెన్వెంటనే గరిష్ఠంగా సాధించుకోవడానికి సమష్టిగా పూనుకున్న ట్రంప్, నెతన్యాహులు ఇరాన్‌పై భీకర దాడులను ఇప్పట్లో నిలిపివేయడం జరగనిపని. 1979 ఇరానియన్ విప్లవంలో అమెరికాకు ఎదురైన అవమానాలకు అంతిమంగా ప్రతీకారం తీర్చుకున్న అధ్యక్షుడుగా చరిత్రలో నిలిచిపోవాలని ట్రంప్ అభిలషిస్తున్నారు. ఇరాన్‌ను తిరిగి పాశ్చాత్య ప్రపంచబాటలోకి తీసుకురావడంతో పాటు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న కాంగ్రెస్ ఎన్నికలలో ఓటర్ల మద్దతును మళ్లీ కూడగట్టుకోవడమే ట్రంప్ లక్ష్యం. తన రేటింగ్‌ను అతివేగంగా, గణనీయంగా పునరుద్ధరించుకునేందుకు ఆయన ఆరాటపడుతున్నారు. ఇరాన్‌ను చావు దెబ్బతీసి తమ నయా వలసవాదానికి అనుగుణంగా ఇజ్రాయెల్ మనుగడకు శాశ్వత రక్షణ సమకూర్చుకోవడం నెతన్యాహు లక్ష్యం.
ఇరాన్‌లో అమెరికా–ఇజ్రాయెల్‌ల అనాలోచిత, ప్రమాదకర జోక్యం ఎలా ముగుస్తుందో ఊహించలేం. అయతొల్లా ఖమేనీ, ఆయన సన్నిహిత సహచరులు, వారసులు ఎందరు మరణించినప్పటికీ ఇరాన్ పాలనా వ్యవస్థ ఇప్పటికిప్పుడు పూర్తిగా కూలిపోవడమనేది అసంభవం. మతపరమైన విధానాల ప్రాతిపదికన నడిచే ఇరాన్ పాలనా వ్యవస్థ కొనసాగుతుంది. అది దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత పెనుసవాళ్లను విసిరే అవకాశమూ ఉన్నది. ఇరాన్‌ను పనిచేసే ప్రజాస్వామ్యంగా మార్చివేసేందుకు ప్రస్తుత విధ్వంసక దాడులు దోహదం చేయవు. 1979 విప్లవానంతరం పాశ్చాత్య ఆధిపత్యాన్ని ఎలా ధిక్కరిస్తూ వస్తున్నదో ఇక ముందూ అలానే ధిక్కరిస్తుంది, ఆ ధిక్కారాన్ని తేలిగ్గా తీసివేసేందుకు వీలులేదు.
అమెరికా, ఇరాన్ మధ్య శాంతియుత సహజీవనం అసాధ్యమని భావించనవసరం లేదు. అందరూ అంగీకరించే ప్రాతిపదికల పైన అది సాధ్యమవుతుంది. అయితే ప్రజాస్వామిక స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి, హక్కులు, నైతిక విలువల నిబద్ధత మొదలైనవి అటు ట్రంప్‌కు, ఇటు ఖమేనీ వారసులకు గిట్టని విషయాలు. ఇరువురూ ప్రజలపై పూర్తి నియంత్రణను కోరుకునేవారే. పర్షియన్ చక్రవర్తి వలే ‘సమ్రాట్’ ట్రంప్ సైతం ఇరానియన్లు తనకు లొంగిపోవాలని, కప్పం చెల్లించాలని, భయభక్తులతో గౌరవం చూపాలని ఆశిస్తున్నారు. ఇంట సమస్త అమెరికన్ల నుంచి కూడా తనపట్ల ఇటువంటి విధేయత, స్వామిభక్తి ట్రంప్ కోరుకుంటున్నారు. నిరంకుశ పాలన అమెరికన్లు, ఇరానియన్ల ఉమ్మడి శత్రువు. వారి నాయకులే వారెదుర్కొంటున్న సమస్య. ప్రస్తుత యుద్ధం ప్రపంచాన్ని అగ్నిపర్వతం మీదకు తీసుకువెళ్లింది.
సైమన్ టిస్డాల్
(ది గార్డియన్)
ఇవి కూడా చదవండి
పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్
ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి