Share News

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

ABN , Publish Date - Mar 02 , 2026 | 06:01 PM

హర్ముజ్ జలసంధిలోని ఓ ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందారు.

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి
oil tanker attacked in Oman Waters

ఇంటర్నెట్ డెస్క్: ఒమాన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మృతి చెందినట్టు అక్కడి అధికార వర్గాలు సోమవారం ధ్రువీకరించాయి. మస్కట్ గవర్నరేట్‌లోని సుల్తాన్ కబూస్ పోర్టుకు వాయువ్య దిశలో 52 నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో మార్చి 1న ఈ దాడి జరిగినట్టు ఒమాన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ పేర్కొంది. ఆయిల్ ట్యాంకర్‌ను ఎమ్‌కేడీ వీవైఓఎమ్‌గా గుర్తించారు. మార్షల్ ఐల్యాండ్స్ జెండాతో వెళుతున్న సమయంలో నౌకను పేలుడుపదార్థాలున్న మరో పడవ ఢీకొట్టిందని అన్నారు. ఫలితంగా ఆయిల్ ట్యాంకర్‌లోని ప్రధాన ఇంజన్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బందిని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు కన్నుమూశారని తెలిపారు. ఆయిల్ ట్యాంకర్‌లోని 21 మంది సిబ్బందిలో 16 మంది భారతీయులు, నలుగురు బంగ్లాదేశీయులు, ఒక ఉక్రెయిన్ పౌరుడు ఉన్నారని అన్నారు.


మధ్యప్రాచ్యంలో ఘర్షణలు మొదలైన నాటి నుంచీ హార్ముజ్ జలసంధిలోని నౌక దాడికి గురి కావడం ఇది రెండోసారి. అంతకుమునుపు, ఒమాన్‌లోని ముసందం పెనిస్సులాకు సమీపంలోని సముద్ర జలాల్లో స్కైలైట్ అనే ఆయిల్ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగింది. ఘటన సమయంలో నౌకలో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఖసబ్ పోర్టుకు ఉత్తరాన ఐదు నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో ఈ దాడి జరిగిందని ఒమాన్ మారిటైమ్ సెక్యూరిటీ కేంద్రం ఇటీవల పేర్కొంది. హార్ముజ్ జలసంధి మీదుగా నౌకలకు అనుమతి లేదని ఇటీవలే ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

ఇరాన్ తన వ్యూహాన్ని మార్చిందా?

ఇరాన్‌పై దాడులు! అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..

Updated Date - Mar 02 , 2026 | 06:10 PM