Share News

Turkey Pakistan Bangladesh Nexus: తురుష్కుల దండయాత్ర 2.0

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:56 AM

బంగ్లాదేశ్‌ నేడొక హింసాగ్నిగుండం. ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నది... పాకిస్థాన్‌, చైనా, టర్కీ. 1971 నాటి విభజనకు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్నది పాక్‌ లక్ష్యం. చైనా దానికి తోడయింది....

Turkey Pakistan Bangladesh Nexus: తురుష్కుల దండయాత్ర 2.0

బంగ్లాదేశ్‌ నేడొక హింసాగ్నిగుండం. ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నది... పాకిస్థాన్‌, చైనా, టర్కీ. 1971 నాటి విభజనకు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్నది పాక్‌ లక్ష్యం. చైనా దానికి తోడయింది. జత కలసిన టర్కీ– అటు పాక్‌, ఇటు బంగ్లా... రెండు వైపుల నుంచీ భారత్‌పై విషం కక్కుతోంది. టర్కీ నాయకులు, అధికారులు, సైనిక ప్రతినిధులు ఇటీవల పాక్‌తో పాటు బంగ్లాలో తరచుగా పర్యటించడం, ఆధునిక ఆయుధ వ్యవస్థలు సమకూర్చడం ద్వారా ఇండియాను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ‘చికెన్‌ నెక్‌’ను తెగ్గోయడం ద్వారా భారత ఈశాన్య రాష్ట్రాలను కలిపేసుకుని ‘మహా బంగ్లాదేశ్‌’ ఏర్పాటు చేయాలన్నది కొంతమంది బంగ్లాదేశీ నాయకుల కల. అది నెరవేర్చే బాధ్యత తనదే అన్నట్లు టర్కీ దూకుడు ప్రదర్శిస్తున్నది.

కశ్మీర్‌ వేర్పాటువాదానికి మద్దతునిస్తున్న టర్కీ... ఇటీవలి ఎర్రకోట పేలుడుకు మార్గదర్శకత్వం వహించినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితులైన డాక్టర్‌ ఉమర్‌ మొహమ్మద్‌, డాక్టర్‌ ముజమ్మిల్‌ షకీల్‌ గనీ, డాక్టర్‌ ముజఫర్‌ రాథర్‌లకు టర్కీ రాజధాని అంకారాలోని సూత్రధారుల నుంచే ఆదేశాలు, నిర్దేశాలు అందినట్లు స్పష్టమైంది. 68 అనుమానాస్పద మొబైల్‌ నంబర్ల మూలాలు పాకిస్థాన్‌, టర్కీలలో బయటపడ్డాయి. ఈ ముగ్గురు ఉగ్ర డాక్టర్లు టర్కీలో 20 రోజుల దాకా మకాం వేసి, సిరియా టెర్రరిస్టు నాయకుల వద్ద శిక్షణ పొందారన్నది సమాచారం.

కశ్మీర్‌లో టెర్రరిస్టులను బలోపేతం చేసి, ఆ ప్రాంతాన్ని భారత్‌ నుంచి విడగొట్టడమే ప్రధాన లక్ష్యంగా టర్కీ ముందుకెళుతోందని సిరియన్‌ నేషనల్‌ ఆర్మీలో భాగమైన ఉగ్రవాద సంస్థ ‘సులేమాన్‌ షా బ్రిగేడ్‌’ చీఫ్‌ అబూ ఎంసా తెలిపినట్లు కుర్దిష్‌ వార్తా సంస్థ ఏఎన్‌ఎఫ్‌ ఆ మధ్య వెల్లడించింది. టర్కీ మద్దతు కలిగిన ‘హమాస్‌’ ఉగ్రవాద సంస్థ సభ్యులు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం ఇటీవలి ముచ్చటే. ఇక టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ అయితే ఐక్యరాజ్యసమితి మొదలుకొని ప్రతి అంతర్జాతీయ వేదికపైనా కశ్మీర్‌ సమస్యను లేవదీస్తూ, పాక్‌కు వంత పాడుతున్నారు.


ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనం అనంతరం సైనిక కమాండర్‌ ముస్తఫా కెమాల్‌ అతాతుర్క్‌ నాయకత్వంలో 1923 అక్టోబరులో ఏర్పాటైన టర్కీ రిపబ్లిక్‌– లౌకిక, ఉదారవాద, ప్రజాస్వామ్య విధానాలు, విలువలతో కూడుకొన్న దేశంగా ప్రస్థానం ప్రారంభించింది. ఇస్లామిక్‌ పిడికిలి నుంచి బయటపడి, ఆధునిక దేశంగా ముందడుగు వేసింది. అతాతుర్క్‌ 1925లో ‘హ్యాట్‌ రెవల్యూషన్‌’లో భాగంగా బుర్ఖా, హిజాబ్‌ వంటి మతపరమైన వస్త్రధారణను నిషేధించారు. ఇస్లామిక్‌ చట్టం స్థానే స్విస్‌ తరహా పౌరస్మృతి ప్రవేశపెట్టారు. కానీ, అతాతుర్క్‌ కృషి, తరువాతి కాలంలో మరుగుజ్జు నాయకుల పుణ్యమా అని బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఇక, 2003లో ఎర్డోగాన్‌ టర్కీ ప్రధానమంత్రి అయ్యాక– తిరోగమనం వేగం పుంజుకొంది. సెక్యులర్‌, లిబరల్‌ పునాదులనే పెకిలించి, టర్కీలో మరో మతఛాందస ఒట్టోమన్‌ సామ్రాజ్యానికి శంకుస్థాపన జరిగింది. ఎర్డోగాన్‌ వచ్చీ రావడంతోనే ఇస్లామిక్‌ విద్య ప్రవేశపెట్టారు. కొత్తగా వేలాది మసీదులు నిర్మించారు. 2014లో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాక దేశాన్ని పూర్తిగా ఇస్లామీకరించడమే కాకుండా– పలు దేశాల్లో భారీ మసీదులు నిర్మించడం ద్వారా తన భావజాల విస్తరణ కాంక్షను చాటిచెప్పారు.

13వ శతాబ్దం మొదలుకొని 20వ శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమయ్యే దాకా ముస్లిం (ఉమ్మా) ప్రపంచానికి టర్కీ నాయకత్వం వహించింది. ఎర్డోగాన్‌ ఇప్పుడు ఆ దిశలోనే సాగిపోతున్నారు. ఈ కాలపు ఖలీఫాగా అవతరించి, తన తరహా ఇస్లామిక్‌ పిడివాద ఒట్టోమన్‌ సామ్రాజ్యం స్థాపించాలని ఆయన 1994లో ఇస్తాంబుల్‌ మేయర్‌ పదవికి పోటీ చేసినప్పుడే కంకణం కట్టుకున్నారు. 2016 నాటి తిరుగుబాటు కుట్రను దారుణంగా అణచివేసిన అనంతరం టర్కీలో సైన్యం, న్యాయ, విద్యా రంగాలు సహా సకల సంస్థలు, వ్యవస్థల్నీ ఇస్లామిక్‌ మతఛాందసులతో నింపివేసిన ఎర్డోగన్‌– తన లక్ష్య సాధనకు వీలుగా, భావజాల విస్తృతికి సైనిక, ఆర్థిక, దౌత్య మార్గాలను ఎంచుకొన్నారు. పశ్చిమ, మధ్య ఆసియాలతో పాటు బాల్కన్‌ (ఆగ్నేయ ఐరోపాలోని అల్బేనియా, బల్గేరియా, గ్రీస్‌, రొమానియా, సెర్బియా, స్లొవేనియా తదితర) దేశాలపై తొలుత దృష్టి కేంద్రీకరించారు. పూర్తిస్థాయి భావసారూప్యం కలిగిన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లనూ కలుపుకొని ఇప్పుడు భారత్‌ కుడి ఎడమల పక్కలో బల్లాలు దించే దుర్మార్గానికి తెగబడ్డారు.


టర్కీ, పాకిస్థాన్‌లది గాఢమైన మ‘మతా’నుబంధం. ఉభయ దేశాలదీ ఛాందసవాద ఇస్లామిక్‌ పంథానే. ఈ సోదర ప్రేమను మరింత బలోపేతం చేసుకొనే క్రమంలోనే ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పాకిస్థాన్‌కు మానవరహిత వైమానిక వ్యవస్థలు, కమికాజ్‌ డ్రోన్లను టర్కీ సమకూర్చింది. టర్కీ వైమానిక పరిశ్రమ (టీఏఐ)లో పెద్ద సంఖ్యలో పాకిస్థానీ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. భారత్‌ ప్రధాన లక్ష్యంగా అయిదోతరం (కాన్‌) యుద్ధ విమానాలు సహా పలు ఆయుధ వ్యవస్థల్ని ఉభయ దేశాలు ఉమ్మడిగా తయారుచేస్తున్నాయి. అమెరికా నుంచి భారత ఆర్మీకి ఆఖరు విడతగా ఆరు అపాచీ హెలికాప్టర్లు చేరకుండా ఇటీవల టర్కీ అడ్డుకొంది. ఈ హెలికాప్టర్ల రవాణా విమానం యూకే నుంచి భారత్‌కు వచ్చేందుకు వీలుగా తన గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి నిరాకరించి టర్కీ తన కుళ్లుబుద్ధిని నిర్లజ్జగా చాటుకొంది. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ను కాకుండా పాకిస్థాన్‌ను చేర్చుకోవాలని పట్టుపట్టింది. వేల మంది పాకిస్థానీ సైనికాధికారులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఎఫ్‌–16 యుద్ధ విమానాల ఆధునికీకరణ విషయంలోనూ పాక్‌కు సహాయపడుతోంది. పాక్‌తో పాటు ఇటు బంగ్లాదేశ్‌నూ భారత్‌ పైకి టర్కీ ఉసిగొల్పుతోంది. పాక్‌ సైనిక గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ)తో పాటు బంగ్లాదేశ్‌లోని మతోన్మాద జమాతే ఇస్లామీతోనూ చేతులు కలిపి భారత్‌కు సెగపెట్టే కుట్రలకు తెరదీస్తోంది. బైరక్తర్‌ టీబీ–2 డ్రోన్లు, టీఆర్‌జీ–300 రాకెట్‌ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి, ఆధునిక రైఫిళ్లు, మిషిన్‌గన్‌లు, మందుపాతరలకు చెక్కు చెదరని ఒటొకార్‌ కోబ్రా–II వాహనాలతో పాటు కీలక సైనిక సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యవస్థలతో బంగ్లాదేశ్‌ కోరలకు మరింత పదునుపెడుతోంది.

తాజా భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో టర్కీ కుట్రలపై భారత్‌ ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. పదునైన దౌత్య వ్యూహమే కీలకం. ముఖ్యంగా టర్కీ శత్రుదేశాలతో రక్షణ, ఆర్థిక, సహాయ సహకారాలపై తక్షణం దృష్టి సారించాలి. విశ్వవేదికలపై టర్కీ తీరును ఎండగట్టాలి. ఇస్లామిక్‌ మహాసామ్రాజ్య చక్రవర్తిత్వమే లక్ష్యంగా ఎర్డోగాన్‌ ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తున్నప్పటికీ– రాజకీయ, ఆర్థిక అవసరాలు ఎప్పటికైనా వెనక్కిలాగేవే. ఈ వాస్తవం తెలిసివచ్చేలా చేయగలిగితే– తురుష్కుల తాజా దండయాత్రను తిప్పికొట్టినట్లే!

పి. దత్తారాం ఖత్రీ

సీనియర్‌ జర్నలిస్టు

ఇవీ చదవండి:

హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్.. అందుకేనా?

కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యమేమీ లేదు: మల్‌రెడ్డి రంగారెడ్డి

Updated Date - Jan 07 , 2026 | 02:56 AM