Share News

కూటమి ప్రభుత్వంపై ఆదివాసీల కోటి ఆశలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 02:26 AM

అడవిని, భూమిని, ప్రకృతి వనరులను నమ్ముకుని జీవించే ఆదివాసీల జీవన విధానాన్ని, సంస్కృతిని, ఉపాధిని కాపాడేందుకు అనేక ప్రత్యేక చట్టాలు, విధానాలు అమలులోకి వచ్చాయి. అయితే నేడు ఆ చట్టాలు...

కూటమి ప్రభుత్వంపై ఆదివాసీల కోటి ఆశలు

అడవిని, భూమిని, ప్రకృతి వనరులను నమ్ముకుని జీవించే ఆదివాసీల జీవన విధానాన్ని, సంస్కృతిని, ఉపాధిని కాపాడేందుకు అనేక ప్రత్యేక చట్టాలు, విధానాలు అమలులోకి వచ్చాయి. అయితే నేడు ఆ చట్టాలు కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. న్యాయపరంగా ఏర్పడ్డ కొన్ని అంశాల ఆధారంగా గిరిజనేతరులు వ్యవహరిస్తున్న తీరుతో ఆదివాసి సమాజం తీవ్ర అన్యాయానికి గురవుతున్నది. ఆదివాసీలు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవడానికి పోరుబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఆదివాసీ ప్రాంతాల పాలన కోసం రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లో నియమ నిబంధనలు పొందుపరిచారు. షెడ్యూల్డ్ ప్రాంత స్థానిక ఆదివాసీ అభ్యర్థులతోనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు వీలుగా 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 3ను తీసుకువచ్చి ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీలకు 100శాతం రిజర్వేషన్ కల్పించింది. దీనిని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కేసులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 2020లో జీవో 3ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో నిరుద్యోగ ఆదివాసీలకు తెలుగు రాష్ట్రాలలో జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి నుంచి నేటి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలు పోరాటం చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదివాసీలకు ఉద్యోగ నియామకాల్లో మళ్లీ 100శాతం రిజర్వేషన్ కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయినా అది అమలుకాలేదు.

అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తెచ్చారు. షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు రెగ్యులేషన్ 1/70 అటువంటిదే. ఇది షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీ భూముల పరిరక్షణకు బలమైన కవచంగా ఉంది. దీనిని నిర్వీర్యం చేయాలని గిరిజనేతరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అనేక గ్రామాలు, మండల కేంద్రాలలో గిరిజనేతరులు అధిక సంఖ్యలో ఉన్నారని, దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వీరికి భూములు కొనుగోలు చేయడానికి లేదా కౌలుకు తీసుకోవడానికి ఈ చట్టం వల్ల అవకాశం లేకుండా పోయిందని వారు పేర్కొంటూ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ చట్టం న్యాయ పరిశీలనను ఎదుర్కొంటోంది. ఈ చట్టాన్ని కోర్టు రద్దు చేస్తే తమ భవిష్యత్ ఏమిటని ఆదివాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా ఎప్పటి నుంచో జోన్–1లో ఉంది. దానిని జోన్–2లో కలిపారు. దీనివల్ల విద్య, ఉపాధి అవకాశాలలో మరింత వెనుకబడిపోతామని ఆదివాసీలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. జీవో 3 బదులుగా రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు, న్యాయపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి ‘షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం’ రూపొందించాలి. లేదా 5వ షెడ్యూల్ క్లాస్–2 ప్రకారం ఆదివాసీ ప్రాంతంలో 100శాతం రిజర్వేషన్ ఇస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి, దానికి రాష్ట్రపతి ఆమోదం పొందాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు రెగ్యులేషన్ 1/70 చట్టం రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో ఉన్న కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి చట్ట పరిరక్షణ బాధ్యతను స్వీకరించాలని; అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1 లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్ని మార్గాలనూ అన్వేషించి పూర్తి న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మరోసారి ఆదేశించారు. అయితే వీటి కార్యరూపం కోసం ఆదివాసీ సమాజం ఎదురుచూస్తోంది.

ఆదివాసీల సంక్షేమం అంటే కేవలం పింఛన్లు, సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడం, ఉపాధి అవకాశాలను కాపాడడం, భూమిని రక్షించడం, వారి సంస్కృతిని గౌరవించడం కూడా. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు పలుమార్లు ప్రకటించింది. అదే స్ఫూర్తితో ఆదివాసీల న్యాయమైన ఆందోళనలను కూడా సానుకూలంగా పరిశీలించి, వారి హక్కులు, అవకాశాలు, భవిష్యత్తు దెబ్బతినకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. హక్కుల పరిరక్షణతో పాటు అభివృద్ధి కూడా అందేవిధంగా ప్రభుత్వం ముందుకు సాగితేనే ఆదివాసీ సమాజానికి నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.

ఎన్. సీతారామయ్య

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 02:26 AM