Share News

అదే రాతిరి... అదే చంద్రుడు

ABN , Publish Date - Aug 03 , 2026 | 03:00 AM

చూడడానికి పైన అదే చంద్రుడు.. కింద అదే రాతిరి కానీ- పిచ్చివాడు పాడే పాట మీద కూర్చొని వాడి తల్లి కన్నీళ్లను...

అదే రాతిరి... అదే చంద్రుడు

చూడడానికి

పైన అదే చంద్రుడు.. కింద అదే రాతిరి

కానీ-

పిచ్చివాడు పాడే పాట మీద కూర్చొని

వాడి తల్లి కన్నీళ్లను గుర్తు చేసుకుంటుంది

పున్నమి

కింద అదే రాతిరి.. పైన అదే చంద్రుడు

కలలో మృత్యువును కౌగిలించుకుంటున్న

వాళ్ళలో ఒకరైనా

ఈ కాలపు తత్వవేత్త కాకపోతారా

అని ఆశపడుతుంది

వెన్నెల

పైన అదే చంద్రుడు... కింద అదే రాతిరి

ప్రకృతి వైపరీత్యం లాంటి

వికృత మనస్తత్వాల్ని చూసి

దడుచుకున్న మిణుగురు పురుగులకు

ధైర్యం చెప్పి వీపు నిమురుతుంది

పున్నమి

కింద అదే రాతిరి... పైన అదే చంద్రుడు

‘పిల్లల కళ్ళల్లోంచి

ఇంద్రధనస్సులు క్రమంగా మాయమవుతున్నాయెందుకని?

యువతీ యువకుల పెదవుల్లో కాలక్రమేణా

ఎన్ని అపురూపమైన నదులు ఎండిపోతున్నాయో గమనించావా?

ముఖం చిన్నబుచ్చుకున్న

వృద్ధుల మౌనంలోంచి

కెరటాలు విరిగిపడుతున్న చప్పుడు

అంతరిక్షందాకా వినిపిస్తున్న విషయం నీకు తెలుస్తోందా?’

అని భూగోళాన్ని అడుగుతుంది

వెన్నెల

lll

పైన అదే చంద్రుడు.. కింద అదే రాతిరి

‘ఎప్పటిలాగే

మన అతి పురాతన భాషలో

మనం గాఢంగా ప్రేమించుకుందాం-

జీవితం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు

ఏదో ఒక రోజు మన ప్రేమను

వాళ్ళ భాషలోకి అనువదించుకోకపోరు’

అనుకుంటాయి

అదే చంద్రుడు

అదే చీకటి

భగవంతం

ఇవి కూడా చదవండి:

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

Updated Date - Aug 03 , 2026 | 03:00 AM