Share News

విద్యార్హతల తుది గడువు మార్చాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:42 AM

రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం ఉపాధి అవకాశం మాత్రమే కాదు; అది వారి ఎన్నో ఏళ్ల శ్రమకు, తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలం. అయితే ప్రస్తుతం ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న...

విద్యార్హతల తుది గడువు మార్చాలి

రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం ఉపాధి అవకాశం మాత్రమే కాదు; అది వారి ఎన్నో ఏళ్ల శ్రమకు, తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలం. అయితే ప్రస్తుతం ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అనేక మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ అమలు చేస్తున్న విద్యార్హతల కటాఫ్ తేదీల విధానం వల్ల తమ ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు.

ప్రస్తుతం కొన్ని నోటిఫికేషన్లలో విద్యార్హతను నిర్ధారించే గడువు తేదీని నోటిఫికేషన్ విడుదలైన తేదీగా నిర్ణయించారు. అయితే దరఖాస్తుల స్వీకరణ మాత్రం ఆ తేదీ తర్వాత ప్రారంభమై, ఒక నెలకుపైగా కొనసాగుతోంది. ఫలితంగా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొద్ది రోజుల్లో డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఉదాహరణకు.. డైట్ లెక్చరర్స్ నియామక నోటిఫికేషన్‌లో విద్యార్హత కటాఫ్ తేదీని 18 జూన్ 2026గా నిర్ణయించారు. కానీ దరఖాస్తులు మాత్రం 24 జూన్ 2026 నుంచి ప్రారంభమై 29 జూలై 2026 వరకు స్వీకరిస్తున్నారు. అంటే జూలైలో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, జూన్ 18 తర్వాత అర్హత పొందిన అభ్యర్థులను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. డిప్యూటీ డీఈవో వంటి ఇతర ఉద్యోగ నోటిఫికేషన్‌లలోనూ ఇదే పరిస్థితి.

చాలా నియామక సంస్థలు అభ్యర్థుల విద్యార్హతను దరఖాస్తుల చివరి తేదీ వరకూ పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి ఈ గడువు తేదీ మార్పు గురించి పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కొత్తగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు తాజా పరిజ్ఞానంతో ఉంటారు. కేవలం కొన్ని రోజుల వ్యత్యాసం కారణంగా వారిని పోటీ నుంచి తప్పించడం సమంజసం కాదు. అనేక ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు కూడా కొన్నేళ్ల వ్యవధి తర్వాత వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిరోజుల వ్యత్యాసంతో అర్హత కోల్పోయిన అభ్యర్థులు మళ్లీ ఎన్నో ఏళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి. దేశంలో అత్యున్నత నియామక సంస్థ అయిన యూపీఎస్సీ కూడా, చివరి సంవత్సరం చదువుతున్న లేదా కోర్సు పూర్తై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొన్ని షరతులతో దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తోంది. కాబట్టి టీజీపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలి. అభ్యర్థుల విద్యార్హతల కటాఫ్ తేదీని నోటిఫికేషన్ తేదీకి బదులుగా, దరఖాస్తుల చివరి తేదీగా నిర్ణయించాలి.

ఉమాదేవి

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 12:42 AM