అవకాశాలు అందిపుచ్చుకోలేని జెన్‌కో
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:50 AM
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే విద్యుదుత్పత్తి, అనుబంధ రంగాలకు విస్తరించి బలోపేతం కావల్సిన టీజీ జెన్‌కో అందుకు భిన్నంగా అపసవ్య దిశలో...
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే విద్యుదుత్పత్తి, అనుబంధ రంగాలకు విస్తరించి బలోపేతం కావల్సిన టీజీ జెన్‌కో అందుకు భిన్నంగా అపసవ్య దిశలో పయనిస్తున్నది. సంప్రదాయిక థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పత్తి రంగాలకు తోడుగా శిలాజేతర పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి దిశగా ఎలాంటి అడుగులూ ముందుకు పడడం లేదు. 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రాధికార సంస్థ బ్యాటరీ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జెన్‌కో తన వ్యాపార నమూనాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
డిమాండ్ లేని సమయాల్లో చౌకగా లభించే కరెంటును ఉపయోగించుకొని పీక్ డిమాండ్ వేళల్లో ఉత్పత్తి చేసుకునే లాభసాటి వ్యవహారంగా ఉన్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పి విద్యుదుత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించే అవకాశాలు అందిపుచ్చుకోకపోవడం విచారించదగిన విషయం. ఓ పక్క థర్మల్ విద్యుత్ కేంద్రాలు నాణ్యమైన బొగ్గులేక, బొగ్గు కొరత తదితర సమస్యలతో సామర్థ్యం మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో వెనుకబడిపోతున్నాయి. దీనికితోడు నాలుగువేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం పూర్తిచేసుకున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్, యాష్ హ్యాండ్లింగు ప్లాంట్లను ప్రైవేట్‌పరం చేస్తూ ఇటీవల టెండర్లను పిలవడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. నాణ్యమైన బొగ్గును సేకరించి ప్లాంటుకు అందించడంలో విఫలమైన యాజమాన్యం భవిష్యత్తులో పాక్షిక, పూర్తి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయవచ్చునని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సింగరేణికి బకాయిలు చెల్లించి, నాణ్యమైన బొగ్గును అందుబాటులో ఉంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును పూర్తిస్థాయిలో జెన్‌కో ఆధ్వర్యంలో నడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. యాదాద్రి థర్మల్ ప్లాంట్ బాయిలర్లకు జీ5 నుంచి జీ9 గ్రేడ్ బొగ్గు కావల్సివుండగా జీ15 నుంచి జీ17 గ్రేడ్ నాసిరకం బొగ్గుతో నడపడం వల్ల 800 మెగావాట్ల సామర్థ్యమున్న ఒక్కో యూనిట్ నుంచి 600 మెగావాట్లకు మించి ఉత్పత్తి రావడం లేదనే ఆరోపణలున్నాయి.
ఒకవైపు సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా విద్యుదుత్పత్తి రంగంలోకి కూడా ప్రవేశించి, థర్మల్ విద్యుత్తు, సోలార్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతూ తమ సంస్థను బలోపేతం చేసుకుంటున్నది. అదే సమయంలో టీజీ జెన్‌కో ఎలాంటి కృషి చేయకపోగా, ప్రైవేట్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నది. తెలంగాణ అవసరాలకు విద్యుదుత్పత్తి చేసే ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగాలా? లేక క్రమంగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేసే సంస్థగా పరిమితమవ్వాలా? అనే ప్రశ్నకు జెన్‌కో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.
ఇటీవల జరిగిన మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్ వేలం నుంచి టీజీ జెన్‌కో అర్ధాంతరంగా తప్పుకోవడంతో సదరు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారు. ఈ బ్లాక్‌ను వదులుకోవడం టీజీ జెన్‌కో చేసిన భారీ తప్పిదం. సుమారు ఎనిమిది వేల మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన టీజీ జెన్‌కోకు ఏడాదికి సుమారు 25 నుంచి 30 మిలియన్ టన్నుల బొగ్గు అవసరముంటుంది. తన బొగ్గు నిల్వలను ఆధారం చేసుకొని విద్యుదుత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా ప్రధానమైన ముడిసరుకు అయిన బొగ్గు ఉత్పత్తి రంగంలోకి టీజీ జెన్‌కో ప్రవేశించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం విద్యుదుత్పత్తికే పరిమితం కాకుండా భవిష్యత్తులో జెన్‌కో– గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, కార్బన్ క్రెడిట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేషన్, గ్రిడ్ బ్యాలెన్సింగ్ లాంటి రంగాల్లోకి అడుగుపెట్టాల్సిన అవసరముంది.
ఇబ్బడిముబ్బడిగా పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో పెట్టుబడులు ప్రవహిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో పీక్ డిమాండును తట్టుకొని గ్రిడ్ సామర్థ్యంలో సమతుల్యత సాధించడానికి థర్మల్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ కొనుగోలు ఒప్పందాలు ఇటీవల సారస్ ఇన్‌ఫ్రా, కోల్ ఇండియా లిమిటెడ్‌లతో జరిగాయి. అంతేకాకుండా మరొక ప్రైవేట్ కంపెనీతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను కొనుగోలు యూనిట్ ధర మార్కెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నట్లు అభ్యంతరాలు ఉన్నాయి.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలోనే కాకుండా, సోలార్, పంప్డ్ స్టోరేజ్ పవర్‌లో కూడా మన రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు సరిపోను విద్యుదుత్పత్తి చేసుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు జెన్‌కో ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సౌరవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కేవలం మూడు మెగావాట్లు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, కాలువల మీదుగా వేల మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్యానెళ్లను నెలకొల్పి జెన్‌కో ఆధీనంలో వేల మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అంతే కాకుండా పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో విద్యుదుత్పత్తికి అనువుగా, లాభదాయకంగా ఉండే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను నెలకొల్పడానికి కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను వాడుకొనే అవకాశం ఉంది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ సూచనల మేరకు దేశంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ అత్యంత అనుకూల ప్రాంతం.
అభివృద్ధి చెందిన చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బ్యాటరీ ఎనర్జీ సిస్టం, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు విద్యుత్ వ్యవస్థలో కీలకంగా మారుతున్నాయి. కాలానుగుణంగా మార్పులను అంగీకరించి అన్ని రంగాల్లో విస్తరించినప్పుడే టీజీ జెన్‌కో భవిష్యత్తులో పోటీని తట్టుకొని ప్రభుత్వ రంగంలో అగ్రగామిగా నిలుస్తుంది. లేనిపక్షంలో కేవలం విద్యుత్ కొనుగోలు చేసే సంస్థగా మిగిలిపోతుంది.
తుల్జారాంసింగ్ ఠాకూర్
విద్యుత్ రంగ నిపుణులు
ఈ వార్తలనూ చదవండి:
ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..