తెలుగు సాహిత్యంలో బంజారా కథా చైతన్యం!
ABN , Publish Date - Jul 13 , 2026 | 01:49 AM
తెలుగు కథ పరిణామ క్రమాన్ని చారిత్రక భౌతిక వాద దృక్పథంతో పరి శీలిస్తే, అది కేవలం రూప, శిల్పాలకు సంబం ధించిన చరిత్రగా మాత్రమే కనిపించదు. అది అణగా రిన వర్గాలు తమ ప్రాతి నిధ్యాన్ని సాధించుకున్న...
తెలుగు కథ పరిణామ క్రమాన్ని చారిత్రక భౌతిక వాద దృక్పథంతో పరి శీలిస్తే, అది కేవలం రూప, శిల్పాలకు సంబం ధించిన చరిత్రగా మాత్రమే కనిపించదు. అది అణగా రిన వర్గాలు తమ ప్రాతి నిధ్యాన్ని సాధించుకున్న ఒక సుదీర్ఘ సామాజిక ఘర్షణల చరిత్రగా సాక్షాత్కరిస్తుంది. సమాజంలో ఏ వర్గం ఉత్పత్తి సాధనాల మీద, అధికార కేంద్రాల మీద ఆధిపత్యం చెలాయిస్తుందో, సాహిత్య రంగంలోనూ అదే వర్గం తన భావజాలాన్ని చాలాకాలం పాటు ‘ప్రమాణం’గా చెలామణీ చేసింది. తెలుగు కథ ఈ ఆధి పత్యపు పొరలను ఒక్కొక్కటిగా బద్దలు కొట్టుకుంటూ వస్తున్న ప్రగతిశీల ప్రయాణమే నేటి మన సాహిత్య చరిత్ర.
ఒకప్పుడు జమీందారులు, అగ్రహారాలకే పరిమితమైన కథా వస్తువు క్రమంగా వ్యవసాయ కూలీలు, కార్మికులు, దళితులు, బహుజనులు, మైనా రిటీలు, స్త్రీల జీవితాల్లోకి ప్రవేశించింది. అయితే, ఈ ప్రజాస్వామికీకరణ ప్రక్రియలో అత్యంత ఆలస్యంగా గొంతును వినిపిస్తున్న సమూహం – గిరిజన సమాజం. అందులోనూ ముఖ్యంగా తండాలో నివసించే ‘బంజారా’ సమాజం. ఇతరుల చేత చిత్రించబడిన ఒక వస్తువుగా కాకుండా, తమ చరిత్రను తామే లిఖించుకునే ‘కర్త’గా బంజారా జీవితం కథలోకి రావడం తెలుగు సాహిత్య పరిణామంలో ఒక చారిత్రక ఘట్టం. ఈ నేపథ్యంలో ‘తండా నుంచి తెలుగు కథ దాకా’ జరిగిన ప్రయాణాన్ని ఒక సామాజిక, తాత్విక, అస్తిత్వ కోణం నుంచి విశ్లేషించుకోవాలి.
సాహిత్యం అంటే ఏమిటి, దాని ప్రమాణాలు ఎవరు నిర్ణయించారు? అనే ప్రాథమిక ప్రశ్నలు వేసుకుంటే, మన సాహిత్య చరిత్రలో జరిగిన ఒక పెద్ద అన్యాయం అర్థమవుతుంది. అక్షరాస్యత, ముద్రణా యంత్రాలు, పత్రికలు, విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాల చేతుల్లో ఉండటం వల్ల, ‘లిఖితమైనదే సాహిత్యం’ అనే ఒక సంకుచితమైన, ఆధిపత్య భావజాలం స్థిరపడిపోయింది. ఫలితంగా వేలాది సంవత్సరాలుగా ప్రకృతితో మమేకమై జీవించిన గిరిజన, సంచార, అర్ధసంచార జాతుల మౌఖిక సాహిత్య సంపద చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు.
బంజారా తండాల్లో రాత్రి పూట మంట చుట్టూ అల్లబడిన సామూహిక కథనాలు, ఆ జాతి వీరత్వాన్ని చాటే గాథలు, పండుగ పాటలు, పెళ్లి పాటలు, శోక గీతాలు, వ్యవసాయ, పశుపాలన అనుభవాల నుంచి పుట్టిన సామెతలు, పొడుపు కథలు... ఇవన్నీ ఒక అద్భుతమైన సృజనాత్మక సంపద. కానీ ‘ముద్రిత సాహిత్యం’ అనే అధికారిక గడపను ఇవి దాటలేకపో యాయి. అకడమిక్ వర్గాలు వీటిని జానపద విజ్ఞానంగా, పరిశోధనా వస్తువులుగా చూశాయే తప్ప, సజీవ సాహిత్యంగా అంగీకరించలేదు. కానీ ఆ సంకుచిత దృష్టిని అధిగమించి చూసినప్పుడు బంజారా కథ తెలుగు సాహిత్యం లోకి రాకముందే, బంజారాలకు ఒక గొప్ప సాహిత్య వారసత్వం ఉందన్న చారిత్రక సత్యం మనకు అర్థమవుతుంది.
గిరిజన జీవితం తెలుగు కథలో ఇంతకుముందు లేనే లేదా? అంటే ఉంది. కానీ అది ఎలా ఉందన్నది ముఖ్యం. ప్రధాన స్రవంతి రచయితలు గిరిజన జీవితాన్ని చిత్రించినప్పుడు, వారి చూపులో ఒక రకమైన ‘రొమాంటిసిజం’, లేదా ‘ఎక్సోటిక్’ భావనలు వ్యక్తమయ్యేవి. కొండలు, సెలయేళ్లు, రంగురంగుల దుస్తులు, గిరిజన నృత్యాలు, అటవీ సౌందర్యం... ఇవే కథా వస్తువులుగా కనిపించేవి. నిజానికి ఇది గిరిజన జీవితాన్ని ఒక పర్యాటక దృశ్యం గానో, లేదా ఒక ప్రదర్శన వస్తువుగానో కుదించివేయడమే. కానీ, ఆ మట్టిలో పుట్టి పెరిగిన ఒక బంజారా రచయిత తన తండా గురించి రాస్తే ఆ కథనంలో నెత్తురు ఉంటుంది, చెమట ఉంటుంది. వర్షం వస్తే కాలు బయటపెట్టలేని బురద దారులు; రోగం వస్తే డాక్టరు దగ్గరకు పోవడానికి పడే ప్రాణ సంకటం; తన కులం పేరూ భాష పేరూ చెప్పి నవ్వే మైదాన ప్రాంతపు వివక్ష; రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే దీనస్థితి; అప్పుల భారంతో కుంగిపోయే తండ్రి, కూలికి వెళ్లే తల్లి... ఇవి బయటి వ్యక్తికి కనిపించని లోపలి గాయాలు. ఆధునిక బంజారా కథలో ఈ ‘స్వీయానుభవ చైతన్యం’ బలంగా వ్యక్తమవుతోంది. ఇది కేవలం వస్తువులో వచ్చిన మార్పు కాదు; కథ భాషలో, వాక్య నిర్మాణంలో, పాత్రల చిత్రణలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు.
తెలుగు కథకు ‘గ్రామం’ ఎంతో కాలంగా ఒక ప్రధాన సామాజిక క్షేత్రం. అగ్రహారం, దళితవాడ, రచ్చబండ, చెరువు కట్ట, పొలం గట్లు – ఈ భౌగోళిక నిర్మాణమే అనేక సామాజిక ఘర్షణలకు వేదికైంది. అయితే, తండాను మనం గ్రామానికి ఒక చిన్న నమూనాగా చూడలేం. తండా సామాజిక నిర్మాణం, అంతర్గత సంబంధాలు, నాయకత్వ వ్యవస్థ (నాయక్), ఆచార వ్యవ హారాలు, సామూహిక జీవనం పూర్తిగా భిన్నం. నేడు ఆధునిక రాజ్య వ్యవస్థ విస్తరిస్తున్న క్రమంలో, తండాకు రాజ్యానికి మధ్య తీవ్రమైన ఘర్షణ మొదలైంది. ఒకప్పుడు అడవిలో క్రూరమృగాల నుంచి పొంచి ఉన్న ప్రమాదం, నేడు ప్రభుత్వ ఫైళ్ల రూపంలో, అభివృద్ధి ప్రాజెక్టుల రూపంలో వస్తోంది. రోడ్డు ఉందా? కరెంట్ ఉందా? అనే ప్రాథమిక ప్రశ్నల నుంచి, మైనింగ్ పేరుతో, రిజర్వాయర్ల పేరుతో భూసేకరణ నోటీసులు రావడం దాకా తండా ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
నేటి బంజారా కథలో విలన్ ఒక జమీందారో, ఒక వడ్డీ వ్యాపారో కాదు. అది ఒక జీవో, ఒక సర్వే నంబర్, ఆన్‌లైన్ దరఖాస్తులో వేలిముద్ర పడక పోవడం వల్ల రేషన్ ఆగిపోయిన వ్యవస్థీకృత క్రూరత్వం... ఇవన్నీ విలన్లే! డిజిటల్ ఇండియాలో ఒక వృద్ధురాలు రేషన్ కోసం పడే ఆవేదన నేటి తండా వాస్తవికత. రాజ్యహింసను సామాన్యుడి కోణం నుంచి ప్రశ్నిస్తున్న బంజారా కథలు నయా ఉదారవాద విధానాలపై వేస్తున్న బలమైన దెబ్బలు.
మార్క్సిస్టు ఆర్థిక శాస్త్రం భూమిని ప్రధాన ఉత్పత్తి సాధనంగా చెప్తుంది. అయితే గిరిజన సమాజంలో భూమికి కేవలం ఆర్థికపరమైన విలువే కాదు, లోతైన సాంస్కృతిక, తాత్విక విలువ ఉంది. మైదాన ప్రాంతపు మనుషులకు భూమి అంటే కొనగలిగేది, అమ్మగలిగేది, బ్యాంకులో తనఖా పెట్టగలిగేది. కానీ, బంజారాలకు భూమి అంటే ఒక జ్ఞాపకం, ఒక జీవనాధారం. అందుకే గిరిజన కథల్లో ‘భూమి కోల్పోవడం’ అంటే కేవలం కొన్ని ఎకరాల విస్తీర్ణాన్ని కోల్పోవడం కాదు. ఒక జీవన విధానం, ఒక సామూహిక అస్తిత్వం విచ్ఛిన్నం కావడం. సెజ్‌ల కోసం, ప్రాజెక్టుల కోసం తండాలను ఖాళీ చేయిస్తున్నప్పుడు ప్రభుత్వం పునరావాస కాలనీల్లో రేకుల షెడ్లో ఇళ్లో ఇస్తుంది. కానీ, తండా దేవుళ్ల స్థలాలను, పూర్వీకుల సమాధులను, పశువులు నడిచే దారులను, ప్రకృతితో వారి అనుబంధాన్ని తిరిగి ఇవ్వగలదా? గణాంకాల భాషలో ప్రభు త్వాలు పరిహారం గురించి మాట్లాడతాయి. కానీ, పునరావాస కాలనీలో తొలి రాత్రి నిద్రపట్టక పాత తండా వైపు చూస్తూ కన్నీరు కార్చే వృద్ధురాలి ఆవేదనను సాహిత్యమే నమోదు చేయాలి. బంజారా కథలు నేడు అభివృద్ధి నమూనాల్లోని ఈ డొల్లతనాన్ని తీవ్రంగా నిలదీస్తున్నాయి.
అలాగే సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ బంజారా స్త్రీ చిత్రణ వక్రీకరణకు గురైంది. ఆమె రంగుల దుస్తులు, అద్దాల కుట్టు పని, చేతులకు ఉండే వెండి, దంతపు గాజులు, నృత్యం... వీటిని ఒక ‘కమోడిటీ’గా మార్చి పెట్టుబడిదారీ మార్కెట్ సొమ్ము చేసుకుంది. ఆమె సౌందర్యాన్ని ప్రదర్శించినంతగా, ఆమె శ్రమను ఏ ప్రధాన స్రవంతి సాహిత్యమూ పట్టించుకోలేదు. నిజానికి బంజారా కుటుంబ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక స్త్రీయే. ఉదయం లేచినప్పటి నుంచి ఇంటి పని, పిల్లలు, పశువుల, వ్యవసాయం, వంట చెరకు, తాగునీరు తేవడం, కూలికి వెళ్లడం – ఇలా నిరంతర శ్రమజీవి ఆమె. అంతేకాదు, ఆమె ఒక సజీవ సాంస్కృతిక గ్రంథం. తండా ఆచారాలు, బంధుత్వాలు, పాటలు అన్నీ ఆమె జ్ఞాపకాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి.
ఆధునికీకరణ నేపథ్యంలో బంజారా యువతుల్లో వస్తున్న మార్పులను కూడా మనం గతితార్కిక పద్ధతిలో చూడాలి. కొత్త తరం అమ్మాయికి సంప్ర దాయ పాట తెలియకపోవచ్చు, గిరిజన దుస్తులు ధరించడానికి ఇష్టపడక పోవచ్చు. దీన్ని కేవలం ‘సంస్కృతి నాశనంగా’ పితృస్వామ్య కోణంలో విమ ర్శించడం సరికాదు. ఆ అమ్మాయి చదువుకోవాలనుకుంటోంది, బాల్య వివా హాన్ని తిరస్కరిస్తోంది, ఉద్యోగం చేయాలనుకుంటోంది. ఒకవైపు తన జాతి సాంస్కృతిక అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే తపన, మరోవైపు పితృస్వామ్య కట్టుబాట్ల నుంచి విముక్తి పొందాలనే ఆకాంక్ష.. ఈ రెండు వైరుధ్యాల మధ్య నలిగే బంజారా స్త్రీ జీవితం సంక్లిష్టమైన, శక్తివంతమైన కథా వస్తువు.
విద్య అనేది విముక్తికి మార్గం కావాలి. కానీ, బంజారా విద్యార్థులకు విద్యా వ్యవస్థే ఒక పెద్ద సాంస్కృతిక హింసా కేంద్రంగా మారుతోంది. ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడే ‘గోర్ బోలి’ (బంజారా భాష) బడిలో ఉండదు. బడిలో ఉండే ప్రామాణిక తెలుగు వారికి అర్థం కాదు. పాఠ్యపుస్తకాల్లో వారి తండా పేరు ఉండదు, వాళ్ళ పండుగలకు సెలవులు ఉండవు, వాళ్ళ చరిత్రకు స్థానం ఉండదు. దీనివల్ల ఆ విద్యార్థిలో తన సంస్కృతి, తన భాష ‘తక్కువది’ అనే న్యూనతా భావం ఏర్పడుతుంది. బడిలో ఎదురయ్యే ఈ సాంస్కృతిక పరాయీకరణను కథలుగా మలచడం అంటే, విద్యా వ్యవస్థలోని ఆధిపత్య వర్గాల మూలాలను ప్రశ్నించడమే.
కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరిన మొదటి తరం బంజారా విద్యావంతుడి పరిస్థితి ఒక సామాజిక విషాదం. అతడు పట్టణంలో పూర్తిగా ఇమడలేడు. తిరిగి తండాలోనూ జీవించలేడు. పట్టణ సౌకర్యాలకు అలవాటు పడి, తండా వెనుకబాటుతనాన్ని చూసి అసహనానికి గురవుతాడు. చదువు తన మూలాల నుంచి తనను దూరం చేసిందా? అనే ఈ తాత్విక, సామాజిక సంఘర్షణ నేటి బంజారా కథల్లో అత్యంత సూక్ష్మంగా వ్యక్తమవుతోంది. తన సమాజాన్ని అర్థం చేసుకోలేని, తన తండాను ప్రేమించలేని అభివృద్ధి ఏ రకమైన అభివృద్ధి? అనే మౌలిక ప్రశ్నను బంజారా రచయితలు లేవనెత్తు తున్నారు. ఇదేగాక, నగరాలకు వలసపోయి గిగ్ కార్మికులుగా శ్రమదోపిడీకి గురవటం, గిరిజన నియోజక వర్గం నుంచి గిరిజన నాయకుడిగా గెలిచినా నిజమైన ప్రాతినిధ్యం దక్కక అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మగా మిగలటం... ఇలాంటి ఇతివృత్తాలన్నిటికీ ఆధు గిరిజన కథలో చోటు ఉన్నది.
కొత్త జీవితం, కొత్త అనుభవం సాహిత్య రంగానికి వచ్చినప్పుడు, దాన్ని పాత మూసలో పోయలేం. మధ్యతరగతి కథల నిర్మాణం, ముగింపుల పద్ధతుల్లో బంజారా జీవితాన్ని ఇరికించడం కృత్రిమంగా ఉంటుంది. గిరిజన కథకు తనదైన ఒక స్వతంత్ర శిల్పం అవసరం. మౌఖిక సంప్రదాయంలోని కథన శైలిని, పాటలను, సామెతలను ఆధునిక కథా శిల్పంలోకి చొప్పించాలి. వ్యక్తిగత గొంతుక కన్నా, సామూహిక గొంతుకను నెరేషన్‌లోకి తెచ్చే ప్రయోగాలు జరగాలి. ‘గోర్ బోలి’ (బంజారా భాష)ను కేవలం పాత్రలను విచిత్రంగా లేదా హాస్యంగా చూపించే ‘లోకల్ కలర్’ కోసం కాకుండా, వారి ఆలోచనా ప్రపంచాన్ని, వేదనను ఆవిష్కరించే సహజ భాషగా వాడాలి. అప్పుడే భాషకు ఒక అస్తిత్వ గౌరవం దక్కుతుంది.
అదే సమయంలో, గిరిజన కథ అంటే కేవలం దుఃఖం, పేదరికం, ఆకలి మాత్రమే అనే మూస అభిప్రాయం నుంచి బయటపడాలి. తండాలోనూ నవ్వులు, ప్రేమలు, చిలిపితనాలు, పిల్లల ఆటలు, భార్యాభర్తల అలకలు ఉంటాయి. గిరిజనుడిని ఎప్పుడూ ఒక ‘బాధితుడి’గా మాత్రమే గాక, పోరాడే, ప్రేమించే, తప్పులు చేసే, గెలిచే ఒక సంపూర్ణ మానవుడిగా చిత్రించినప్పుడే అది జీవన సాహిత్యంగా విరాజిల్లుతుంది. తన మట్టిని కోల్పోతున్న ఒక బంజారా ఆవేదన, లాటిన్ అమెరికాలోని లేదా ఆఫ్రికాలోని నిర్వాసిత ఆదివాసీ ఆవేదనతో మమేకమవుతుంది. తన తండాను, తన అమ్మ భాషను, తాతల జ్ఞాపకాలను నిజాయితీగా చిత్రించగలిగితే అది ప్రపంచ కథ అవుతుంది. వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితుల్లో, కనుమరుగవుతున్న తండా సంస్కృతిని, రూపురేఖలు మారుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అక్షరాల్లో భద్రపరచడం నేటి బంజారా కథకుల చారిత్రక బాధ్యత. అవార్డుల కోసం దుఃఖాన్ని ప్రదర్శన వస్తువుగా మార్చే ప్రమాదాలను, అస్తిత్వాన్ని పలుచన చేసుకునే మోసాలను అధిగమించి, తమ మట్టి వాసనలతో, తమ భాషతో, తమ పేర్లతో సగర్వంగా రాస్తున్న కొత్త తరం బంజారా రచయితలకు తెలుగు సాహిత్యం స్వాగతం పలుకుతోంది.
భూక్యా గోపినాయక్
99891 59196
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు