Share News

ఉద్యమంలో భవిష్యత్తును ఒడ్డింది విద్యార్థులే!

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:09 AM

ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఉద్యమంలో అసలు ఉద్యమకారులెవరు? వారిని ఎలా గుర్తించాలి, గుర్తించినా అందులో ఎవరిని ఆదుకోవాలి? లక్షల్లో, కోట్లలో ప్రజలు...

ఉద్యమంలో భవిష్యత్తును ఒడ్డింది విద్యార్థులే!

ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఉద్యమంలో అసలు ఉద్యమకారులెవరు? వారిని ఎలా గుర్తించాలి, గుర్తించినా అందులో ఎవరిని ఆదుకోవాలి? లక్షల్లో, కోట్లలో ప్రజలు ఉద్యమించినప్పుడు ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకోవడం కష్టమే కావచ్చు. కానీ ఉద్యమం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం ఎంత ముఖ్యమో, 2009 నుంచి 2014 మధ్య కాలంలో కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదువుకుంటూ ఉద్యమం చేసిన విద్యార్థులను ఆదుకోవడమూ అంతే ముఖ్యం.

ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ తమ జీవితాలను లెక్కచేయకుండా భవిష్యత్తు బాగుంటుంది కదా అనే నమ్మకంతో ఉద్యమంలో పాల్గొన్న నాటి విద్యార్థులే, అవును 2009 నుంచి 2014 వరకు డిగ్రీ, పీజీ విద్యార్థులే ఉద్యమకారుల్లో ముందు వరుసలో ఉండాలి. ఎప్పుడు బంద్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు పరీక్షలు ఉంటాయో తెలియదు. ఆ ఐదేళ్లు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థులు నిత్యం బంద్‌లు పాటిస్తూ ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయ జేఏసీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా, ప్రజా విద్యార్థి సంఘాలైనా... ఎవరు పిలుపునిచ్చినా విద్యార్థులు రోడ్డెక్కారు. ఒకానొక సమయంలో పరీక్షలను సైతం బహిష్కరించి ఉద్యమించారు.

అందరి ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. ముందైతే తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటే చాలు, మనమెలాగైనా బతికేస్తాం అని ప్రతి సామాన్య విద్యార్థి ఉద్యమకారుడు అనుకునేవాడు. అయితే పన్నెండేళ్లుగా అమరవీరుల కుటుంబాల సంఖ్యను తేల్చలేదు. కొంతమంది ఉద్యమకారులకు రాజకీయ అవకాశాలు వచ్చాయి కానీ, అసలు ఉద్యమకారుడు ఇంకా గుర్తింపు పొందటం లేదు. నాడు ఉద్యమ హోరులో చదువును పక్కన పెట్టిన విద్యార్థులు నేటికీ స్థిరపడలేకపోతున్నారు.


ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఇంగ్లీష్ భాషపై, అసలు చదువులపైనే పట్టు కోల్పోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడ్డారు కానీ, పెరుగుతున్న పోటీని తట్టుకుని ముందుకు సాగే శక్తి అప్పటి విద్యార్థులకు ఉందా అంటే చాలా తక్కువనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలిచే ఐటీ రంగం అభివృద్ధి చెందింది కానీ అందులో ఉద్యమ విద్యార్థులు ఎంతమంది ఉంటారు? ఐటీ రంగంలో రాణించే శక్తి నాటి విద్యార్థులకు ఎక్కడిది? నిత్యం రోడ్డుపై ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ తిరిగిన పిడికిళ్లకు కంప్యూటర్ ముందు కూర్చుని కీబోర్డ్‌తో పనిచేసే అవకాశం ఉంటుందా? పరిమితికి మించి లేని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంతమంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు? ఇంకా చెప్పాలంటే అందరివి భూమి లేని బతుకులే! కొంతమంది జర్నలిజంలో, మరికొంతమంది రాజకీయాల్లో, ఇంకొంతమంది యూట్యూబర్లుగా రాణిస్తున్నారు.

ప్రభుత్వాలు ఉద్యమకారులకు ఏదైనా చేయాలనుకుంటే ముందు నాటి విద్యార్థి ఉద్యమకారులను గుర్తించాలి. 2009–14 మధ్య చదివిన ప్రతి విద్యార్థి ఉద్యమకారుడే. ప్రభుత్వం వీరిందరి వివరాలను ఆయా కాలేజీలు, యూనివర్సిటీల నుంచి తెప్పించుకుని, అందులో స్థిరపడనివారిని గుర్తించి వారికి అండగా నిలబడాలి. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవడానికి కమిటీ వేయాలని యోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ముందుగా ఉద్యమకారుల జాబితాలో విద్యార్థులను లెక్కలోకి తీసుకోవాలి. వారందరికీ హానరరీ పెన్షన్ కానీ, ఏదైనా వ్యాపారం చేసుకునే వెసులుబాటుగానీ కల్పించే విధంగా సబ్సిడీ రుణాలు అందించాలి. విద్యార్థుల జీవితాలకు ఒక భరోసా కల్పించి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినప్పుడే తెలంగాణ ఉద్యమానికి సార్థకత!

ఖాజా అఫ్రీది

ఇవి కూడా చదవండి..

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

Updated Date - Mar 26 , 2026 | 01:09 AM