Share News

ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కాలి

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:00 AM

1969 నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రజాసంఘాలు పనిచేశాయి. అవి ప్రజలను కూడగట్టి, ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టాయి. త్యాగాలు చేశాయి. నెత్తురు ధారపోశాయి. ఈ పునాదిపై నిర్మాణమైన...

ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కాలి

1969 నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రజాసంఘాలు పనిచేశాయి. అవి ప్రజలను కూడగట్టి, ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టాయి. త్యాగాలు చేశాయి. నెత్తురు ధారపోశాయి. ఈ పునాదిపై నిర్మాణమైన రాజకీయ పార్టీలు ఓట్లు దండుకుంటున్నాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇంతటి పాత్ర నిర్వహించిన ప్రజా సంఘాల చరిత్రను విస్మరించి దశాబ్దకాలం పాలించిన కేసీఆర్ గానీ, రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గానీ ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఇంకా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ వారిని అవమానపరచటం శోచనీయం.

ప్రతి సందర్భంలో పోరాడే శక్తులు కనుమరుగైనట్లే తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమకారులకు పార్లమెంటరీ పార్టీలు అన్యాయం చేశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కూడా అవే పరిస్థితులు నికార్సయిన ఉద్యమకారులకు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాలతో తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర కనుమరుగు చేసే ప్రమాదం ఉంది. తెలంగాణ ఉద్యమకారులు అప్రమత్తంగా ఉంటూ సమగ్ర తెలంగాణ చరిత్రను నిర్మాణం చేసే బాధ్యతను తీసుకోవాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ముందు తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కమిటీ పలు న్యాయమైన డిమాండ్లను ఉంచుతున్నది. అవి– 1) తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, మూడు దశల తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేయాలి. 2) ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షతో అమరత్వం పొందిన ఉద్యమ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేయాలి. 3) తెలంగాణ ప్రజాఫ్రంట్ మాజీ అధ్యక్షులు ఆకుల భూమయ్య హత్యకు కారణమైన వారిని గుర్తించి, శిక్షించాలి. 4) ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు బలమైన ఊతం అందించిన వరంగల్ డిక్లరేషన్ సభలో ప్రవేశపెట్టిన అంశాలు అమలయ్యేలా చూడాలి. 5) ఉద్యమంలో అమరత్వం పొందిన వారి స్మారక స్థూపాలను ప్రభుత్వమే అధికారికంగా నెలకొల్పాలి. 6) తెలంగాణ పోరాటంలో విద్యార్థి, ఉద్యమకారులపై నమోదైన ‘ఊపా’ తదితర కేసులను వెంటనే ఎత్తివేయాలి. ‘ఎన్‌ఐఏ’ తరహా దాడులను అరికట్టి రాజకీయ ఖైదీల విడుదలకు ప్రభుత్వం పూనుకోవాలి. 7) తొలితరం ఉద్యమ శిఖరం, తెలంగాణకు దీపస్తంభం వంటి వరవరరావుని తెలంగాణకు తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. 8) అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో అమరవీరుల స్మారక స్థూపాలను నిర్మించి అధికారికంగా శ్రద్ధాంజలి ఘటించాలి.

9) విభజనను వ్యతిరేకించిన వ్యక్తుల గుర్తులను తెలంగాణలో తొలగించాలి.

10) తెలంగాణ భాషను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి. తెలంగాణ అస్తిత్వానికి భంగం వాటిల్లకుండా చూడాలి.

రాచమోని నాగభూషణం

(రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ప్రజాఫ్రంట్)

ఈ వార్తలనూ చదవండి:

పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్‌

కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్‌ బలోచ్‌ సోదరుడిపై కాల్పులు

Updated Date - Aug 01 , 2026 | 01:00 AM