ఉద్యోగుల ఆరోగ్యాన్ని ‘సిస్టమ్’కు వదిలేయొద్దు
ABN , Publish Date - Sep 24 , 2026 | 01:49 AM
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఉద్యోగి తన వేతనం నుంచి ప్రతి నెలా...
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఉద్యోగి తన వేతనం నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నప్పుడు అవసరమైన సమయంలో తనకు, తన కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయనే నమ్మకం ఉండాలి. ప్రస్తుతం ఆరోగ్య కార్డుల జారీ, కుటుంబ సభ్యుల వివరాల నమోదు, కార్డుల డౌన్‌లోడ్ వంటి అంశాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది కేవలం ఒక వెబ్‌సైట్‌లోని సాంకేతిక లోపంగా పరిగణించాల్సిన విషయం కాదు. ఆరోగ్య భద్రతకు సంబంధించిన పరిపాలనా సమస్యగా చూడాలి.
ఆరోగ్య కార్డును డౌన్‌లోడ్ చేసుకోలేకపోవడం, ఎన్.ఇ.హెచ్.ఎస్ వెబ్‌సైట్‌లో కుటుంబసభ్యుల వివరాలు పూర్తిగా కనిపించకపోవడం, కొంతమంది ఆధారితుల పేర్లు మాత్రమే కనిపించడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగి లేదా పెన్షనర్‌తో పాటు ఆధారితుల కార్డులు కూడా కనిపించకపోవడం, ఫొటోలు సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆమోదించిన తర్వాత మార్పులకు అవకాశం లేకపోవడం మరో సమస్య. ఒక కుటుంబంలో అర్హులైన నలుగురు ఆధారితులు ఉంటే, పోర్టల్‌లో ఇద్దరి పేర్లు మాత్రమే కనిపిస్తే మిగిలిన ఇద్దరి వైద్య హక్కుల పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా అనారోగ్యానికి గురయ్యే వ్యక్తి... పోర్టల్‌లో కనిపించని ఆధారితుడే అయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది. చందా మాత్రం సక్రమంగా తీసుకుంటూ సేవ పొందే సమయంలో ‘సాంకేతిక సమస్య’ అని చెప్పడం సమర్థనీయం కాదు.
మరో ముఖ్యమైన సమస్య– డీడీఓలు, ఎస్టీవోలకు ఎదురవుతోంది. ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు సమర్పించిన కుటుంబ సభ్యుల వివరాలను సంబంధిత అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. అయితే ఒకసారి ఆమోదం పూర్తయిన తర్వాత అందులో తప్పు ఉన్నా, అదనపు ఆధారితుడి పేరు నమోదు చేయాల్సి ఉన్నా, వివరాలు సరిచేయాల్సి ఉన్నా సంబంధిత స్థాయిలో తగిన ఎడిట్ ఆప్షన్ లేదు. డిజిటల్ వ్యవస్థలో తప్పులు జరగడం సాధారణం. ఆ తప్పును సరిచేసే అవకాశం లేకపోవడమే అసలు పరిపాలనా లోపం. దీనికి ప్రత్యామ్నాయంగా స్పష్టమైన సరిదిద్దే యంత్రాంగం ఉండాలి.
ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఉమ్మడి జిల్లా స్థాయిలో అధికారులు, మేనేజర్లు, కో–ఆర్డినేటర్లను నియమించింది. ఇది మంచి చర్యే. అయితే ఉమ్మడి జిల్లా స్థాయిలో కేవలం ఒక్కరిని బాధ్యులుగా నియమించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మాత్రం సరిపోదు.
1. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ తన ఎంప్లాయీ ఐడీ/ పెన్షనర్ ఐడీతో సమస్యను నమోదు చేసుకునే ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థ ఎన్.ఇ.హెచ్.ఎస్‌లో ఉండాలి. ఫిర్యాదుకు ప్రత్యేక టికెట్ నెంబరు ఇవ్వాలి. 2. కార్డు డౌన్‌లోడ్ కాకపోవడం, ఆధారితుల పేరు కనిపించకపోవడం, తప్పు వివరాలు, డూప్లికేట్ వివరాలు వంటి సమస్యలకు 3–4 పని దినాల్లో పరిష్కారం కల్పించే విధానం ఉండాలి. 3. ప్రతి ఉద్యోగి/పెన్షనర్ తన కుటుంబ సభ్యుల జాబితాను చూసుకుని, ఎవరి పేరు నమోదు కాలేదో, ఎవరి వివరాలు తప్పుగా ఉన్నాయో ఆన్‌లైన్‌లో గుర్తించే అవకాశం కల్పించాలి. ఎడిట్ అవకాశం కూడా ఇవ్వాలి. 4. డీడీవో/ఎస్టీవోలకు పరిమితంగా ఎడిట్ అవకాశం ఇవ్వాలి. ముఖ్యమైన మార్పులకు మాత్రమే జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి అధికారి అనుమతి ఉండేలా వ్యవస్థ రూపొందించాలి. 5. ఆధారితుల పేర్లు లేకపోతే, తిరిగి నమోదుకు ఒక కాలపరిమితితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. 6. గతంలో చందా చెల్లింపు వద్దని కోరుకున్న ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా తిరిగి ఈ పథకంలో చేరేందుకు అవకాశం కల్పించాలి. 7. సర్వర్ లేదా పోర్టల్ సమస్యల వల్ల డిజిటల్ కార్డు డౌన్‌లోడ్ కాకపోతే, ఎంప్లాయీ ఐడీ/పెన్షనర్ ఐడీ ఆధారంగా తాత్కాలిక డిజిటల్ హెల్త్ కార్డు అందుబాటులోకి తేవాలి. 8. డీడీవో, ఎస్టీవో, జిల్లా మేనేజరు–రాష్ట్ర సాంకేతిక బృందం మధ్య సమన్వయ వ్యవస్థ ఉండాలి. సమస్య పరిష్కార స్థితిని ఉద్యోగి తన మొబైల్ నుంచే తెలుసుకునే విధానం ఉండాలి. 9. ఎన్ని కార్డులు జారీ అయ్యాయి, ఎన్ని డౌన్‌లోడ్ అయ్యాయి, ఎన్ని కుటుంబాల్లో ఆధారితుల వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి అనే వివరాలను అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించే డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలి. 10. హెల్ప్‌లైన్‌ను మరింత సమర్థవంతం చేయాలి. ప్రతి ఫిర్యాదుకు టికెట్ నెంబరు, ప్రస్తుత స్థితి, పరిష్కార గడువు ఇవ్వాలి.
ఉద్యోగి తన వంతు చందాను చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అదే విధంగా ప్రభుత్వం అందించాల్సిన ఆరోగ్య సేవలను పొందడంలో సాంకేతిక లోపం ఏర్పడితే దానినీ ప్రభుత్వం అంతే తీవ్రంగా పరిగణించి, వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ‘సిస్టమ్’కు వదిలేయకూడదు. ఉత్తమ ‘సిస్టమ్’ రూపొందించి, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఆరోగ్యాన్ని కాపాడాలి.
డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు
ఈ వార్తలనూ చదవండి:
రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు
హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్