లాయర్లకు ఉక్కు కవచంగా కొత్త చట్టం
ABN , Publish Date - Apr 08 , 2026 | 02:04 AM
న్యాయవాద వృత్తి ఉన్నతమైనది, అత్యంత పవిత్రమైనది. మన దేశాన్నీ రాష్ట్రాన్నీ ఒకప్పుడు ఏలిన, ఇప్పుడు ఏలుతున్న నేతల్లో నూటికి 90శాతం న్యాయవాదులుగా ఉండటం ఆ వృత్తి గొప్పతనాన్ని...
న్యాయవాద వృత్తి ఉన్నతమైనది, అత్యంత పవిత్రమైనది. మన దేశాన్నీ రాష్ట్రాన్నీ ఒకప్పుడు ఏలిన, ఇప్పుడు ఏలుతున్న నేతల్లో నూటికి 90శాతం న్యాయవాదులుగా ఉండటం ఆ వృత్తి గొప్పతనాన్ని తెలియజేస్తోంది. కేంద్ర న్యాయశాఖ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 21 లక్షల మంది న్యాయవాదులు ఆయా రాష్ట్రాల బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా నమోదయ్యారు. వీరి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి చట్టాలూ చేయలేదు. 2023లో న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. ఆ తర్వాత రెండవ రాష్ట్రంగా కర్ణాటక 2024లో న్యాయవాదుల రక్షణకు చట్టం చేసింది. ఇప్పుడు మూడవ రాష్ట్రంగా తెలంగాణ న్యాయవాదుల రక్షణ సంక్షేమ చట్టం–2026ను రూపొందించి, ఆమోదించి, అమలుపరచనున్నది.
న్యాయవాదులపై గత పదేళ్ళలో దాడులు పెరిగిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వ వ్యవస్థలను శాసించే స్థాయికి ఎదిగింది. బాధితుల తరఫున హైకోర్టులో కేసు వేసి వాదిస్తున్న న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతులు 2021 ఫిబ్రవరి 17న మంథని జాతీయ రహదారిపై కారులో వెళ్తుండగా.. వారిపై కక్షగట్టిన కొందరు బీఆర్ఎస్ గూండాలు కాపు కాసి, పట్టపగలు కత్తులతో పొడిచి ఆ దంపతులను హత్య చేశారు. ఈ ఘటన మరువక ముందే 2022 ఆగస్టు 1 సాయంత్రం మూలగండ్ల మల్లారెడ్డి అనే హన్మకొండ న్యాయవాది ములుగు కోర్టు విచారణకు హాజరై తిరిగి హన్మకొండకు కారులో వస్తుండగా ములుగు వరంగల్ జాతీయ రహదారి 163పై దుండగులు అతన్ని కారు నుంచి లాగి, కత్తులతో పొడిచి చంపారు. తర్వాత కొద్దిరోజులకే నల్గొండలో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న గాడే విజయ్‌రెడ్డిని 2022 ఆగస్టు 13న నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం గ్రామ శివారులో దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు.
ఇలాంటి పలు ఆటవిక చర్యలతో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో నమోదైన మొత్తం 62 వేలమంది న్యాయవాదులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ హత్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆయా న్యాయస్థానాల పరిధిలోని న్యాయవాద సంఘాలు, ప్రధానంగా హైకోర్టు, నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అయినా గత కేసీఆర్ ప్రభుత్వం న్యాయవాదుల పోరాటాలను పరిగణనలోకి తీసుకోలేదు.
నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి న్యాయవాదుల పోరాటానికి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక న్యాయవాదుల రక్షణకు చట్టం చేస్తామని 2023లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి చట్టం చేసేలోగానే ముగ్గురు న్యాయవాదులు హత్యకు గురయ్యారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జరిగిన శాసనసభలో మార్చి 30న అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును ఆమోదించింది.
ఈ చట్టం న్యాయవాదుల రక్షణతోపాటు, వారి సంక్షేమానికి పెద్దపీట వేసింది. న్యాయవాదులపై ఎటువంటి దాడులు, బెదిరింపులు, వేధింపులు జరిగినా, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించినా ఈ చట్టం దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తుంది. మొదటిసారి న్యాయవాదులపై స్వల్ప నేరానికి పాల్పడితే 6 నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తారు. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు నేరాలకు పాల్పడితే, వారిని తీవ్రంగా గాయపరిస్తే ఏడాది నుంచి ఏడు సంవత్సరాల వరకూ జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారు. అంతేగాక ఈ చట్టం న్యాయవాదులకు అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం, న్యాయవాదులను పోలీసులు ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడం కుదరదు. చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆర్డర్ ఉంటేనే న్యాయవాదులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాలి. ప్రాణహాని ఉన్న న్యాయవాదులు కోర్టుల ద్వారా పోలీసు రక్షణ పొందవచ్చు. న్యాయవాదుల సంక్షేమం కోసం అర్హులైన న్యాయవాదులకు హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పిస్తారు.
న్యాయ నిర్మాణం కింద న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా బార్ అసోసియేషన్‌లకు భవనాలు, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక వసతులు కల్పిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ ప్లీడర్స్, స్టాండింగ్ కౌన్సిల్‌లో ఎస్సీ/ఎస్టీలకు, బీసీ/మైనారిటీ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తారు. న్యాయవాదుల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడానికి రాష్ట్ర, జిల్లా మండల గ్రీవెన్స్ రిడ్సెల్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేదా వారు సూచించిన వ్యక్తి అధ్యక్షత వహిస్తారు. తప్పుడు ఫిర్యాదుతో ఇతరులను ఇబ్బంది పెట్టటానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే వారికి రెండేళ్ళ వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి, న్యాయవాదుల భద్రతకు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును తెచ్చి, రాష్ట్రవ్యాప్త న్యాయవాదులకు రక్షణను ప్రసాదించింది.
డాక్టర్ కోటూరి మానవతారాయ్
తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం శాశ్వత సభ్యులు
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్