న్యాయస్థానం నోట కార్పొరేట్ మాట
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:15 AM
ఇటీవల సుప్రీంకోర్టు మహిళల ఋతుస్రావ సందర్భంలో నెలసరి సెలవు విధానం దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తే, మహిళల నియామకంలో కంపెనీలు వెనకడుగు వేయవచ్చని, తద్వారా...
ఇటీవల సుప్రీంకోర్టు మహిళల ఋతుస్రావ సందర్భంలో నెలసరి సెలవు విధానం దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తే, మహిళల నియామకంలో కంపెనీలు వెనకడుగు వేయవచ్చని, తద్వారా సమానత్వానికి హాని కలగవచ్చని ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. దానికి బదులుగా స్వచ్ఛంద లేదా యజమాని– నిర్దిష్ట చర్యలను సూచించింది. కేంద్ర ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సంప్రదించి విధానం రూపొందించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించినా, ఆ సెలవులను తప్పనిసరి చేయడాన్ని నిరాకరించింది. ఈ విధమైన వాదన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరిట కార్మిక హక్కులను అడ్డంకులుగా చూపించే నయా ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా ఉండి, కీలకమైన సామాజిక, ఆర్థిక చర్చను తెరపైకి తెచ్చింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు యజమాన్యాల దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మహిళలపై ఉన్న వివక్షను ఎదుర్కొనే బదులు, ఆ భారాన్ని మహిళలపైనే మోపుతున్నాయి. యాజమాన్యాలు వివక్ష చూపవచ్చనే కారణంతో మహిళల హక్కులను తగ్గించడం అంగీకారం కాదు. ఆ తర్కాన్ని అనుసరిస్తే ప్రసూతి సెలవులు, భద్రతా ప్రమాణాలు, సమాన అవకాశాల వంటి పురోగమన చట్టాలు ఎప్పటికీ అమలులోకి వచ్చేవి కావు. ఇప్పటికే నియామకం, పదోన్నతుల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారు. కాబట్టి రక్షణ చర్యలను తగ్గించడం కాకుండా వివక్ష వ్యతిరేక చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడతారు. అలాంటి సమయంలో సెలవు ఇవ్వడం ఒక ఆరోగ్య హక్కు. భారతదేశంలో నెలసరి సెలవు ఇప్పటికీ పట్టించుకోని అంశంగా ఉంది. దేశ జనాభాలో సుమారు 26శాతం అంటే దాదాపు 36 కోట్ల మంది ఋతుస్రావ ధర్మాన్ని అనుభవిస్తున్నారు. ఇది సహజమైన శారీరక ప్రక్రియ అయినా, 50–90శాతం మహిళలు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు, అధిక రక్తస్రావం, అలసట వంటి లక్షణాలను కలిగిస్తాయి. అలాంటి సమయంలో కూడా షాపులు, మాల్స్ వంటి సంస్థలలో 8 నుంచి 12 గంటల వరకు కేవలం నుంచుని మాత్రమే పనిచేయడం ఎంతో దుర్భరం.
ప్రస్తుతం దేశమంతా వర్తించేలా, అన్ని కంపెనీలకు తప్పనిసరి చేసేలా కేంద్ర చట్టం లేదు. కొన్ని రాష్ట్రాలు, సంస్థల్లో పరిమితంగా ఉంది. కర్ణాటక నెలకు ఒకరోజు నెలసరి సెలవును తప్పనిసరి చేసింది. బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి సెలవులు ఉన్నాయి. కేరళలో విద్యార్థులకు కూడా ఈ సౌకర్యం కల్పించారు. జపాన్, ఇండోనేసియా, జాంబియా, ఇటలీ, స్పెయిన్, ఐర్లాండ్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ విధానం అమలులో ఉంది. ఇది సానుకూల ఫలితాలను ఇస్తోంది.
ఇది కేవలం ఆరోగ్య హక్కు మాత్రమే కాదు. శ్రమ, ఉత్పత్తి వ్యవస్థ, లింగ అసమానతల మధ్య ఉన్న సంబంధాన్ని చూపించే అంశంగా కనిపిస్తుంది. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు కార్మికుడు తన శ్రమ శక్తిని అమ్ముకుంటాడు. కానీ ఆ శ్రమ శక్తి మానవ శరీరానికి సంబంధించినది. మహిళల విషయంలో నెలసరి ఒక సహజ శారీరక ప్రక్రియ. ఇది ఇక సామాజిక, మానవీయ దృక్పథం. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాలను, అందుకు అనుగుణంగా కార్మికుడు సృష్టించే ఉత్పాదకతను మాత్రమే విలువగా చూస్తారు. అయితే సమాజానికి ఉత్పత్తి ఎంత అవసరమో, సమాజ మనుగడకు పునరుత్పత్తీ అంతే అవసరం. అయితే పెట్టుబడిదారీ సామాజిక వ్యవస్థ ఫ్యాక్టరీ, ఆఫీస్ పనికి ఇచ్చే ప్రాధాన్యం పునరుత్పత్తి అంటే పిల్లల పెంపకం, గృహ పని, శారీరక ప్రక్రియలు వంటి వాటికి ఇవ్వదు.
అసమానతలు నిండిన సమాజంలో సమానత్వం అంటే అందరికీ ఒకే నియమం సరిపోదు. అవసరాల ప్రకారం సహాయం అవసరం అన్నారు బాబా సాహెబ్ అంబేడ్కర్. ఇది కేవలం సెలవు ఇవ్వాలా లేదా అనే ప్రశ్న కాదు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అనే కోణం నుంచి చూడాలి. దీనికనుగుణంగానే అంబేడ్కర్ రాజ్యాంగంలో Dignity of the Individualకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. నెలసరి సమయంలో మహిళలు ఇబ్బందులు పడినా పని చేయాల్సి వస్తే అది వారి గౌరవానికి భంగం. ఈ దృక్పథం నుంచి చూస్తే ‘హక్కులు ఇస్తే ఉద్యోగాలు తగ్గుతాయి’ అని చెప్పడం సామాజిక న్యాయానికి విరుద్ధం. ఎందుకంటే వివక్షతను నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత, హక్కులను తగ్గించడం కాదు. అందువల్ల నెలసరి సెలవు ఒక సౌకర్యం కాదు. ఇది సామాజిక న్యాయం, గౌరవం, కార్మిక హక్కు.
మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 సమానత్వ హక్కు కల్పిస్తోంది. దీని సాధనకై ఆర్టికల్ 15(3) అవసరాల ప్రకారం మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక చట్టాలు చేయడానికి అనుమతి ఇస్తోంది. ఆర్టికల్ 21 జీవన హక్కును కల్పిస్తోంది. అందువల్ల ఋతుస్రావ కోణంలో ఆరోగ్యం, శారీరక సౌకర్యం వంటివి ఆర్టికల్ 21లో భాగం. అన్నింటికీ మించి ఆరోగ్య హక్కు రాజ్యాంగంలో ప్రత్యేకంగా లేకపోయినా సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఆర్టికల్ 21లో భాగంగా గుర్తించారు. నెలసరి సెలవు కూడా ఇందులోకి వస్తుంది. అలాగే ఆర్టికల్ 16 ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పిస్తోంది. ఋతుస్రావం కారణంగా మహిళలను నియమించకపోతే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది.
అందువల్ల నెలసరి సెలవు– ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అవసరమైన హక్కు. మహిళలు శారీరకంగా ఇబ్బంది పడుతున్నప్పుడు పని చేయమని ఒత్తిడి చేయడం శ్రమ దోపిడీయే. కానీ నేటి సమాజంలో అమానవీయంగా కార్మికుల శ్రమను దోచుకోవడమే కార్పొరేట్ కంపెనీల విధానం. దీనికనుగుణంగానే కార్మిక హక్కులను కబళిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన లేబర్ కోడ్లు. వాస్తవంగా నేడు అసంఘటిత రంగాలలో ఉన్న చట్టాలే సరిగా అమలుకావడం లేదు. అటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక పటిష్ఠ చట్టం అవసరాన్ని తెలపవలసిన సమయంలో అసలు దీన్ని ఒక భారంగా చూడడం కార్పొరేట్ ప్రయోజనాల రక్షణకే ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు చెప్పినట్లు యాజమాన్యాలు స్వచ్ఛందంగా అమలు చేయాలనడం హాస్యాస్పదమే కాక, వారి దయాదాక్షిణ్యాలకు వదిలివేయడమే. అందువల్ల మార్కెట్ అవసరాల కోణం నుంచి కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, గౌరవం, సామాజిక అభివృద్ధి వంటి కోణాల నుంచి ఈ అంశాన్ని చూడాలి. దేశవ్యాప్తంగా అన్నిరంగాలకు వర్తించేలా ఒక చట్టాన్ని చేయవలసిన అవసరం ఉంది.
ఎ. అజశర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
ఇవీ చదవండి:
చిన్నారుల కోసం 'తొలి ముద్ద' పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
మెట్రో స్వాధీన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం