Share News

‘ప్రత్యేక’ చట్టాలపై హర్షించదగ్గ తీర్పు

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:00 AM

‘బెయిలు నియమం, జైలు మినహాయింపు’ ఇది న్యాయసిద్ధాంత ప్రాథమిక సూత్రాలలో ఒకటి. ఒక ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఇది తప్పక పాటించవలసిన సూత్రం. అయితే గత దశాబ్ద కాలంలో...

‘ప్రత్యేక’ చట్టాలపై  హర్షించదగ్గ తీర్పు

‘బెయిలు నియమం, జైలు మినహాయింపు’ ఇది న్యాయసిద్ధాంత ప్రాథమిక సూత్రాలలో ఒకటి. ఒక ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఇది తప్పక పాటించవలసిన సూత్రం. అయితే గత దశాబ్ద కాలంలో ఈ సూత్రానికి న్యాయస్థానాలే చెల్లుచీటీ పాడిన పరిస్థితి ఏర్పడింది. దానికి ఒక కారణం వివిధ ప్రత్యేక చట్టాలు. యూఏపీఏ, ఎన్‌డీపీఎస్, పీఎంఎల్ఏ లాంటి దేశ భద్రత, ఆర్థిక భద్రత పేరు మీద తీసుకువచ్చిన చట్టాలలో ‘జైలు నియమం, బెయిలు మినహాయింపు’ అనే తలక్రిందుల సూత్రం అంతర్భాగంగా ఉంది. న్యాయవ్యవస్థ మొత్తం ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ వచ్చింది. ఉన్నత న్యాయస్థానాలు అక్కడక్కడా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ వచ్చినా, మొత్తం మీద ఈ సూత్రం ఆధారంగా ఖైదీలు సంవత్సరాలకు సంవత్సరాలు విచారణ లేకుండా, బెయిలు రాకుండా కారాగారాలలో మగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. అలా మగ్గిపోతున్న వ్యక్తులలో ప్రముఖంగా వినిపించే పేర్లు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్. ట్రైల్ కోర్ట్, దిల్లీ హైకోర్ట్, అలాగే సుప్రీంకోర్ట్ కూడా యూఏపీఏ (ఉపా) చట్టాన్ని ఆధారం చేసుకుని వీరికి ఆరు సంవత్సరాలుగా పలుమార్లు బెయిలు నిరాకరించాయి. అయితే, మే 18న సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీ వర్సెస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జమ్మూ కేసులో ఇరువురు సభ్యుల ధర్మాసనం ఇటువంటి చట్టాల కింద పెట్టిన కేసులలో బెయిలు ఇవ్వకపోవటాన్ని తప్పుబడుతూ, సుప్రీంకోర్ట్ కూడా అలా నిరాకరించడాన్ని కఠినంగా విమర్శించింది. సుప్రీంకోర్ట్ కానీ హైకోర్ట్ కానీ తాము ఇచ్చిన తీర్పును తామే ఈ విధంగా తప్పుబట్టడం బహు అరుదుగా జరిగే విషయం.

సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీ అనే వ్యక్తి కశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగి, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ కార్యకర్త. అతను ఉగ్రవాద సంస్థ సభ్యుడనీ, వారికి నిధులు సమకూర్చడానికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడనీ ఆరోపిస్తూ జమ్మూ కశ్మీర్ పోలీసులు యూఏపీఏ, ఎన్‌డీపీఎస్‌ చట్టాల క్రింద 2020లో కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) పరిధిలోకి వెళ్ళింది. 2024లో ఈయన బెయిలు పిటిషన్‌ను ట్రైల్ కోర్ట్ కొట్టివేసింది, 2025లో హైకోర్ట్ ఆ తీర్పును సమర్థించింది. ఆ తరువాత ఈ కేసు సుప్రీంకోర్ట్‌కు వచ్చింది. సుప్రీంకోర్ట్‌కు వచ్చేనాటికి ఈ వ్యక్తి ఏ విచారణా లేకుండా ఐదేళ్ళుగా జైలులోనే ఉండిపోయాడు. సుప్రీంకోర్ట్ అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పులో ఇరువురు సభ్యుల ధర్మాసనం చెప్పిన ఒక ముఖ్య విషయం: ‘‘బెయిలు నియమం, జైలు మినహాయింపు’’ అనే సూత్రం యుఏపీఏ లాంటి ప్రత్యేక చట్టాలకు కూడా వర్తిస్తుంది అని. అది ఎంత ప్రత్యేకమైన చట్టమైనా రాజ్యాంగంలోని జీవించే హక్కుకు లోబడి ఉండాలని, ఇలా ఏళ్ల తరబడి విచారణ లేకుండా కారాగారంలో ఉంచడం ఆ జీవించే హక్కుకు, తద్వారా రాజ్యాంగానికి విరుద్ధం అని చాలా స్పష్టంగా తెలియజేసింది.


న్యాయస్థానాలలో త్వరితగతిన విచారణ అనేది జీవించే హక్కులో భాగం అని సుప్రీంకోర్ట్ సూత్రీకరించి ఐదు దశాబ్దాలు అవుతున్నది. అయితే ఇప్పటికీ అదే విషయాన్ని మళ్లీ పునరుద్ఘాటించాల్సి రావడం, ఆ లోపల ఎంతోమంది జీవితాలు కారాగారాల్లోనే మగ్గిపోవటంలో ఏపాటి రాజ్యాంగబద్ధత ఉంది? ఒక పక్క విచారణ త్వరితగతిన అవ్వదు, మరొకపక్క ఇటువంటి ప్రత్యేక చట్టాల కారణంగా బెయిలు రాదు. వీటి మధ్యలో బలి అయ్యేది ప్రజలు, వారి ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ సూత్రాలు.

ఈ తీర్పులో ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించిన మరొక విషయం.. పెద్ద బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును చిన్న బెంచ్ ధర్మాసనం పాటించకపోవడం, వాటికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం. 2021లోనే ముగ్గురు సభ్యుల ధర్మాసనం ‘న్యాయస్థానంలో విచారణ జరగకపోయినా లేదా విచారణ పూర్తి అవ్వడానికి చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నా కూడా నేరంతో, చట్టంతో సంబంధం లేకుండా బెయిల్ పొందే హక్కు ఉంది’ అనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ‘అది ఒక హక్కుగా దఖలుపడుతుంది’ అని తేల్చి చెప్పింది. దానికి అనుగుణంగా తరువాత కొన్ని కేసులలో ప్రత్యేక చట్టాల కింద అరెస్ట్ అయినవారికి బెయిల్ ఇచ్చారు కూడా. అయితే అదే హక్కును ఇరువురు సభ్యుల ధర్మాసనం ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు నిరాకరించింది. అంటే సుప్రీంకోర్ట్ నిర్ణయాన్ని ఏ అధికారం లేకపోయినా కూడా సుప్రీంకోర్టే తిరగదోడింది. ఇది చట్టబద్ధం కాదు, న్యాయం అసలే కాదు. ఇదే విషయాన్ని ఈ తీర్పులో కూడా న్యాయమూర్తులు గట్టిగా వెల్లడించారు.

ఇటువంటి ప్రత్యేక చట్టాల కింద న్యాయస్థానాలలో దోష నిర్ధారణ శాతం ఎంత తక్కువగా ఉన్నదో అన్న విషయాన్ని ఇదే తీర్పు సంఖ్యలతో సహా వెల్లడించింది. యూఏపీఏ చట్టాన్ని ఉదాహరణగా తీసుకున్న ధర్మాసనం 2019–2024 మధ్యలో ఈ చట్టం కింద దోష నిర్ధారణ శాతం దేశవ్యాప్తంగా ఏనాడూ 6శాతాన్ని దాటలేదని, అదే జమ్మూ కశ్మీర్‌లో అయితే ఈ ఐదు సంవత్సరాలలో ఏనాడూ 1శాతం కూడా దాటలేదని తెలియజేసింది. అంటే ఈ చట్టం ప్రకారం శిక్ష పడటం అనేది అత్యంత అరుదు. అటువంటప్పుడు ఖైదీలు ఎందుకు అనేక సంవత్సరాలు జైళ్లలో మగ్గిపోవాలి?


నిజానికి ఈ చట్టం ఆధారంగా విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలన్న నియమం ఉంది. ఆ న్యాయస్థానాలను నేటి వరకూ ఏర్పాటు చేసింది లేదు. ఉదాహరణకు ఎన్ఐఏ కేసులకు ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలని ఆ చట్టం చెబుతోంది. అయితే ఆ చట్టం వచ్చి 18 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఆ ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు కాలేదు. సాధారణ న్యాయస్థానాలకే ఈ కేసులు అప్పగిస్తున్నారు. దాని కారణంగా విచారణ నత్తనడకన సాగుతుంది. ఇటువంటి ప్రభుత్వ, న్యాయవ్యవస్థ వైఫల్యాలకు మూల్యం చెల్లిస్తున్నది మాత్రం ఈ చట్టం కింద నేరస్థులుగా ముద్ర పడినవారు. తమ నేరం నిరూపణ అవ్వకుండానే నేరం నిరూపణ అయితే ఎంత కాలం శిక్ష పడుతుందో అంత కాలం కారాగారంలో ఉండవలసిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ తీర్పులో కూడా ధర్మాసనం ఇదే విషయాన్ని ఎత్తిచూపింది. విచారణ పేరుతో సుదీర్ఘకాలం జైలులో ఉంచటం అంటే వారి నేరం రుజువు కాకముందే వారికి శిక్ష విధించడంతో సమానమని చెప్పింది.

ఒక ప్రజాస్వామిక సమాజంలో యూఏపీఏ వంటి ప్రత్యేక చట్టాలకు చోటే ఉండకూడదు. ఇవి అనాగరికమైనవి, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి, జవాబుదారీతనం లేనివి. అయితే అవి అమలులో ఉన్నన్ని రోజులు కూడా వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ అడపాదడపా ఇచ్చే తీర్పులను స్వాగతించాలి. అలాగే ఈ సుప్రీంకోర్టు తీర్పును కూడా హర్షించాలి.

గుత్తా రోహిత్

మానవ హక్కుల వేదిక (HRF)

ఇవి కూడా చదవండి..

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

Updated Date - Jun 04 , 2026 | 01:00 AM