Share News

సూఫీ బసంత్‌.. గంగా జమునా తెహజీబ్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:38 AM

కుతుబ్‌ షాహీల కాలం నుంచి నేటి వరకు హిందూ ముస్లింలు మత సామరస్యంతో సూఫీ బసంత్‌ వేడుకలు నిర్వహించుకోవటం ఒక ఆనవాయితీగా ఉంది. మాఘ శుక్ల పంచమి నాడు వసంత పంచమి వేడుకలు...

సూఫీ బసంత్‌.. గంగా జమునా తెహజీబ్‌

కుతుబ్‌ షాహీల కాలం నుంచి నేటి వరకు హిందూ ముస్లింలు మత సామరస్యంతో సూఫీ బసంత్‌ వేడుకలు నిర్వహించుకోవటం ఒక ఆనవాయితీగా ఉంది. మాఘ శుక్ల పంచమి నాడు వసంత పంచమి వేడుకలు నిర్వహించటం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. 13వ శతాబ్దంలో సుప్రసిద్ధ కవి, సంగీత కళాకారుడు అబుల్‌ హసన్‌ యమిన్‌ ఉద్దీన్‌ ఖుస్రో (అమీర్‌ ఖుస్రో) వసంత పంచమి రోజున అనేక మంది భక్తులు పసుపు పచ్చని దుస్తులు, పసుపు పచ్చని పుష్పాలు, పూలహారాలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లడాన్ని గమనించారు. తాను కూడా అవే దుస్తులు ధరించి ఆనంద పారవశ్యంతో పాటలు పాడుతూ తన గురువు హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఔలియా వద్దకు వెళ్లారు. మేనల్లుడు మౌలానా ఖ్వాజా సయ్యద్‌ తఖీయుద్దీన్‌ ఆకస్మిక మరణంతో ఔలియా దుఃఖసాగరంలో మునిగివున్నారు. సంగీతాన్ని ఆలపిస్తూ తన దగ్గరికి వచ్చిన శిష్యుడు ఖుస్రోని చూడగానే ఔలియా బాధ నుంచి బయటపడి, మునుపటి ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ఖుస్రోతో కలిసి నృత్యం చేశారు. ఆనాటి నుంచి సూఫీ ఆధ్యాత్మిక సంగీతంతో బసంత్‌ వేడుకలకు ఖుస్రో శ్రీకారం చుట్టారు. తదాది ఏడు శతాబ్దాలుగా ఏటా మాఘ శుక్ల పంచమి నాడు ఆ ఉత్సవాలు నిర్వహించటం ఒక సంప్రదాయంగా మారింది.

గోల్కొండ నాల్గవ పాదుషా ఇబ్రహీం కుతుబ్‌ షా కాలంలో కూడా బసంత్‌ వేడుకలను నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌ నగర వ్యవస్థాపకులు మొహమ్మద్‌ కులి కూడా ఈ ఉత్సవాలను ఘనంగా జరిపించారు. అదే సంప్రదాయాన్ని అసఫ్‌ జాహీల కాలంలోనూ కొనసాగించారు. నిజాం కాలంలో పయిగా నవాబ్‌ సర్‌ అస్మాన్‌ ఝా బహదూర్‌ (బషీరుద్దౌలా) (1838–1898) హైదరాబాద్‌ ప్రధానమంత్రిగా సూఫీ బసంత్‌ వేడుకలను ప్రోత్సహించి, స్వయంగా పాల్గొన్నారు. ముస్లింలు, హిందువులే కాకుండా సిక్కులు, జైనులు క్రైస్తవులు, బౌద్ధులు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆల్‌ ఇండియా మర్కజి మజ్లిస్‌ ఇ చిస్తీ–తెలంగాణ రాష్ట్ర కళా సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో పత్తర్‌ఘట్టిలోని ఉర్దూ షరీఫ్‌లో సూఫీ బసంత్‌ వేడుకలు నేడు నిర్వహిస్తున్నారు.

వరకాల యాదగిరి

Also Read:

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 01:39 AM