కీచకులైన ఖాకీలకు రెండింతల శిక్ష...
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:16 AM
సమాజం నేరపూరితం కాకుండా చూడడంతో పాటు, నేరాలు చేసిన వారిని విచారించి న్యాయస్థానానికి అప్పగించే బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది. కంచే చేను మేసిన చందంగా.. మరి అలాంటి రక్షకభటులే నేరాలకు...
సమాజం నేరపూరితం కాకుండా చూడడంతో పాటు, నేరాలు చేసిన వారిని విచారించి న్యాయస్థానానికి అప్పగించే బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది. కంచే చేను మేసిన చందంగా.. మరి అలాంటి రక్షకభటులే నేరాలకు పాల్పడితే? కీచకులై స్ర్తీలను చెరపడితే? వారికి మామూలు శిక్ష సరిపోతుందా? లేదు, సాధారణ నేరస్థులకు వేసే శిక్షకు రెండింతలు ఎక్కువగా వారికి శిక్ష పడేలా చట్టంలో సవరణలు చేయాలి.
ఈ మధ్య వెలుగు చూసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం సమాజాన్ని నివ్వెరపరచింది. ఉదయ్ కృష్ణారెడ్డి తన తోటి ట్రైనీని ప్రేమ పేరిట మానసికంగా, శారీరకంగా వేధించాడు. ఆమె లాప్‌టాప్‌ను విసిరి పారేయడం, ఆమె జుట్టు పట్టుకుని తన గదిలోకి ఈడ్చుకెళ్లి, మెడపై కత్తి పెట్టి చంపుతానని బెదిరించడం, ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపడం.. వంటి ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. ఆమెనే కాకుండా పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మరికొందరు మహిళా ఐపీఎస్ అధికారులను, అతని స్వగ్రామానికి చెందిన మరికొందరు అమ్మాయిలను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి చట్టాలు బాగా తెలిసినవాడు కాబట్టి తాను అరెస్టు కాకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేసుకున్నాడు! మహిళల పట్ల ఇన్ని అరాచకాలకు పాల్పడడమేగాక, తప్పించుకోజూసిన ఈయన ఒక ఐపీఎస్ అధికారిగా మారితే... బాధిత మహిళలకు న్యాయం చేయకపోగా, నిందితుల వైపే ఉంటాడనేది ఆయన చరిత్రను బట్టి అర్థమవుతోంది.
ఈ మధ్యనే ఒక సీఐ.. ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితురాలితో పరిచయం పెంచుకొని, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, ఆమె నుంచి బలవంతంగా రూ.2 కోట్లు వసూలు చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దేశవ్యాప్తంగానూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో అభిషేక్ యాదవ్ అనే కానిస్టేబుల్ ఓ పదేళ్ల అమ్మాయిని అపహరించి, అత్యాచారానికి పాల్పడడమేగాక, ఆమెను హత్య చేశాడు. ఆ బాలిక శవం బావిలో దొరికింది.
2023లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన నేరాలలో పావువంతు పోలీసులు పాల్పడినవే! ఖాకీలు చేసిన నేరాలను మహిళలు ఫిర్యాదు చేయటానికి ఇష్టపడరు. కొందరు భయంతో బయటపెట్టరు. మరికొన్ని నేరాలు ఒత్తిడి వల్ల బయటపడవు. అందువల్ల వాళ్లు చేసిన నేరాలన్నీ బయటికి రావడంలేదు. మొత్తంగా, మహిళలంటే సమాజంలో ఉన్న చిన్నచూపు, పితృస్వామిక భావజాలం... వీటన్నిటి వల్ల స్ర్తీలపై నేరం చేయడం తమ హక్కుగా వీరు భావిస్తున్నారు.
ఎంతోమంది పోలీసులు మహిళలతో అనైతిక సంబంధాలు, అనుచిత ప్రవర్తనలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. బాధిత మహిళల కుటుంబ సభ్యులకు వారి వీడియోలు పంపుతామని బెదిరించి, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా గాడి తప్పుతున్న ఖాకీలపై ఉన్నతాధికారులు తీసుకునే పైపై చర్యలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు. నేర ప్రవర్తన కలిగినవారిని పోలీసు ఉద్యోగాల్లోకి తీసుకోకూడదు. ఒకవేళ పోలీసులే నేరాలకు పాల్పడితే వారిని తక్షణం విధుల నుంచి తప్పించాలి. వృత్తి శిక్షణలో భాగంగా పోలీసులకు జెండర్ సెన్సిటివ్ ట్రైనింగ్ కచ్చితంగా ఇవ్వాలి.
బి. జ్యోతి (చైతన్య మహిళా సంఘం)
ఈ వార్తలనూ చదవండి:
పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్
కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్ బలోచ్ సోదరుడిపై కాల్పులు