Share News

టికెట్‌ సర్వీస్‌ బస్సులనూ నడపాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:25 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ తదితర...

టికెట్‌ సర్వీస్‌ బస్సులనూ నడపాలి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ తదితర బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో టికెట్‌ కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులతోపాటు వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్‌స్టాండ్లు, బస్‌స్టాపుల్లో బస్సులు ఆగగానే పెద్ద సంఖ్యలో మహిళలు ఎక్కడానికి ప్రయత్నిస్తుండటంతో తోపులాటలు జరుగుతున్నాయి. బస్సుల్లో నిలబడి ప్రయాణించడానికి కూడా స్థలం లేకపోవడంతో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు గెంటుకోవడం, కిందపడటం, గాయాలపాలవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల కోసం మహిళల మధ్య ఘర్షణలు, రద్దీ కారణంగా దొంగతనాలూ జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, మండల, జిల్లా కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు వెళ్లే ప్రయాణికులు రద్దీ కారణంగా సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. బస్సుల్లో చోటు దొరకక కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు, రద్దీ కారణంగా కండక్టర్లు ఆధార్‌ కార్డులు పరిశీలించి టికెట్లు జారీ చేయడంలో, డ్రైవర్లు బస్సులు నడపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే, టికెట్‌ కొనుగోలు చేసే పురుషులు, ఇతర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం కొన్ని టికెట్‌ సర్వీస్‌ బస్సులను నడపాలి. దీంతో ఉచిత సర్వీస్‌ బస్సులపై రద్దీ తగ్గి ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుంది. టికెట్‌ సర్వీసుల ద్వారా ఏపీఎస్‌ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. తద్వారా స్త్రీ శక్తి పథకానికి ప్రభుత్వం అందిస్తున్న నిధులపై కొంతమేర భారం తగ్గుతుంది. కాబట్టి ఈ అంశంపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపట్టాలి.

నల్లా సత్య పళ్లంరాజు

ఈ వార్తలనూ చదవండి:

రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు

హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్

Updated Date - Sep 24 , 2026 | 01:25 AM