Share News

‘సర్‌’లో సర్వమూ నిరంకుశత్వమే

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:19 AM

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలో మొదలైన ‘సర్’ (ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ) కార్యక్రమం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఓటర్ కార్డు ఉంది కాబట్టి మా ఓటుకు ఏ ఢోకా లేదని...

 ‘సర్‌’లో సర్వమూ నిరంకుశత్వమే

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలో మొదలైన ‘సర్’ (ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ) కార్యక్రమం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఓటర్ కార్డు ఉంది కాబట్టి మా ఓటుకు ఏ ఢోకా లేదని చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు, ప్రతిసారీ జరిగినట్లే ఇప్పుడు కూడా ఓటర్ నమోదు జరిగిపోతుందని శ్రామికవర్గ ప్రజలు, అసలిందంతా ముస్లిం ఓటర్లను తీసెయ్యటానికి కాబట్టి మనకేం కాదని ముస్లిమేతరులు భావిస్తున్నారు. ఇప్పటికే బిహార్, బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలను గమనించిన ప్రజలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు భయాందోళనలో ఉన్నారు.

గత సంవత్సరం ఎన్నికల సంఘం– దేశం మొత్తం మీద ఈ ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ చేపడతామని, 2002లో ఇటువంటి ప్రత్యేక సవరణ జాబితా విడుదల చేశామనీ, దాని తర్వాత ఇప్పుడు చేస్తున్నామనీ ప్రకటించింది. వెనక్కి తొంగి చూస్తే, అప్పటి జాబితా తయారీకి ప్రచార ప్రయత్నం 1999లో ప్రారంభమైందని, 2003లో జాబితాను ప్రచురించారని తెలుస్తుంది. దీనివల్ల ఓటర్లు ఇబ్బందులు పడిన సమాచారం కానీ, అంతకు ముందు ఓటర్ల జాబితాతో లింకు చేసుకోవాలని, లేక తమ తల్లిదండ్రుల పేర్లతో లింకు చేసుకోవాలని, లేని వాళ్ళు సాక్ష్యాధారాలు ఇవ్వాలనే షరతులు కూడా మనకు అప్పటి వార్తల్లో కనిపించవు.

జరుగుతున్న ప్రత్యేక ‘సమగ్ర’ ఓటర్ల జాబితాలోని షరతులు, రెండు దశాబ్దాల ముందటి జాబితాతో తప్పనిసరిగా లింకు చేసుకోవాలనే నియమం, ఓటర్ల గుర్తింపు పత్రాల సమర్పణ మొదలైనవి మనకి ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950’లో కానీ, ‘ఓటర్ల నమోదు నియమాలు 1960’లో గానీ దొరకవు. ఇవన్నీ ‘అవస రానికి తగ్గట్లు ప్రమాణాలని పెట్టొచ్చు’ అని చట్టంలో ఉన్న నియమాన్ని ఎన్నికల సంఘం విస్తృతంగా, నిరంకుశంగా విస్తరించి తయారుచేసిన ఫలితం.

విదేశీ చొరబాటుదారులు ఓటర్ గుర్తింపు కార్డులు తెచ్చుకుని తమ ఓట్ల ద్వారా రాజకీయాలని శాసిస్తున్నారనే ప్రచారోద్యమం భారతీయ జనతా పార్టీ విపరీతంగా చేస్తూ వస్తోంది. 2018లో అస్సాంకున్న సంక్లిష్ట వలసల చరిత్ర నేపథ్యంలో, ఎప్పటి నుంచో ఒప్పుకున్న డిమాండ్‌ని అనుసరించి రాష్ట్ర పౌరుల జాబితా తయారు చేస్తే, ముస్లింల కన్నా హిందువులు ఎక్కువగా తొలగింపబడ్డారు. దాంతో అసలు ఇక్కడ కాదు, దేశమంతా చొరబడ్డారు అంటూ జాతీయ పౌరుల జాబితా తయారు చేస్తామని 2019లో ప్రకటించారు. పౌరసత్వ చట్టాల్లో మతపరమైన ప్రమాణాలని ప్రవేశపెడితే అంతర్జాతీయ నిరసనతో పాటు దేశవ్యాప్త ప్రతిఘటన రావటంతో కొంత కాలం వెనక్కి తగ్గారు. కానీ, ఈవీఎంలతో పాటు, ఓటర్ల జాబితాను ఎంత తారుమారు చేసినా 2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తినటంతో, 2025లో ఈ ఆయుధాన్ని కొత్త రూపంలో ప్రచారంలోకి తెచ్చారు. ఓటర్ల జాబితా నుంచి విదేశీ ఓటర్లని ఏరివేస్తామంటూ పౌరసత్వంతో దీన్ని జత చేశారు. ఒకప్పుడు అస్సాంకి మాత్రమే పరిమితమైన ఈ పౌరసత్వ పరీక్షని ఇప్పుడు అందరికీ వర్తింపజేస్తున్నారు.


భారత పౌరసత్వ చట్టం బ్రిటిష్‌ ఇండియా విభజన నేపథ్యంలో ఏర్పడటంతో మొదటి నుంచీ కొన్ని షరతులు ఉంటూ వచ్చాయి. అస్సాం ఒప్పందం తర్వాత, 1986లో తెచ్చిన పౌరసత్వ చట్ట సవరణలో... భారత పౌరులు కావాలంటే పుట్టుకతో పాటు, కనీసం తల్లి గానీ, తండ్రి గానీ పౌరులు అయ్యుండాలనే నిబంధన, ఆ తర్వాత 2003లో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పౌరులు అవటమే గాక, అక్రమ వలసదారులు అయ్యుండకూడదని, అటువంటి వారిని ‘విదేశీయులుగా’ పరిగణించి ‘నిర్బంధ శిబిరాలకు’ తరలించాలనే నిబంధన తెచ్చారు. ఈ సవరణలని కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల వాళ్ళు సమర్థించారు.

పౌరులు కాని వాళ్ళు ఓటర్ల జాబితాలో ఉండకూడదు అనే నియమం తప్ప, ఈ పౌరసత్వ చట్టాలకు, పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియకు, ఓటర్ల జాబితాతో, దాని సవరణతో ఏ చట్టపరమైన సంబంధం లేదు. అయితే, ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణలో ఈ ‘వంశ పారంపర్యత’ నిరూపణకు కేంద్ర స్థానం ఇచ్చారు. ప్రతి ఓటర్‌ని, 2002 జాబితాతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తమ సంబంధాన్ని నిరూపించుకోవాల్సిందిగా కొత్త నియమం తెచ్చారు. అంటే, తాము గానీ, తమ తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతలు 2002 ఓటర్ల జాబితాలో ఉన్నారని చూపెట్టాలి. దీన్నే మాపింగ్ అంటారు. మనం, మన చుట్టాలు 2002 జాబితాలో లేకపోతే మనకి ఎన్నికల సంఘం నుంచి ముసాయిదా జాబితా తయారీ తర్వాత నోటీసు వస్తుంది. అప్పుడు మన స్థానిక ఎన్నికల ఆఫీసర్ దగ్గరికెళ్లి మనం ఇక్కడే పుట్టామనీ, చదివామనీ, లేదా ప్రభుత్వం మనని గుర్తించిందని సరిపడే సాక్ష్యాలని ఎన్నికల సంఘం చెప్పిన 11 పత్రాలు, ఇతర సాక్ష్యాల ద్వారా చూపెట్టి మన అర్హతని నిరూపించుకోవాలి. అలా చెయ్యలేకపోతే, మనం పూర్తి ‘అనుమానా స్పదులు’గా మారతాం.

అందరికీ ఉండే రేషన్ కార్డు, వివిధ రకాల సంక్షేమ కార్డులని, ఎవరైనా డబ్బులిచ్చి సంపాదిస్తారన్న నెపం మీద ఈ 11 పత్రాలలో వాటిని చేర్చలేదు. ఈ పత్రాల్లో అస్సాం పౌరసత్వ జాబితా, ఫారెస్టు రైట్స్ పత్రం, 10వ క్లాస్ సర్టిఫికెట్ అతి తక్కువమందికి ఉంటే.. పర్మినెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్, ఫ్యామిలీ రిజిస్టర్ ఎవరికీ ఉండవు. అసలు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ఏమిటో ఇప్పటికీ చాలామంది అధికారులకే తెలియదు. రాజస్థాన్‌లో ఉన్నాయని వినికిడి. స్కూలు డ్రాప్ఔట్స్‌కి మిగిలిన ఆరింటిలో కుల ధ్రువీకరణ పత్రం కూడా ఉండదు. వీటన్నింటితో పాటు బెంగాల్ ఎన్నికల తర్వాత లాజికల్ డిస్క్రిపెన్సి పేరుతో కొత్త ‘తొలగింపు ప్రమాణాలు’ తెచ్చారు. మన పేరు, వివరాలు, ఓటర్ జాబితాలోనూ, అధికారిక పత్రాల్లోనూ ఏ తప్పులు లేకుండా సరిగ్గా సరిపోవాలి. తల్లులకు, పిల్లలకు మధ్య వయసులో తేడా 15ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. అన్ని కార్డులు, జాబితాల్లో తండ్రి పేరు సరిగ్గా ఒకలాగే ఉండాలి. ఇవి కాకుండా ఎన్నికల ముందు కూడా కొత్తవి తేవచ్చు.


అతి తక్కువ సమయంలో, శిక్షణ లేని వ్యక్తుల ద్వారా, తీవ్ర ఒత్తిడి కింద పని చేయించటంతో ఈ ప్రక్రియ అన్ని స్థాయిల్లో అనేక తప్పుల తడకలతో నడుస్తోందని సాక్ష్యాధారాలతో సహా ఉన్నత న్యాయస్థానికి వెళ్లగా... పర్లేదు, తప్పులు దిద్దుకుంటారులే అంటూ, సర్దుకుపొమ్మని చెప్పింది. ఈ గతాన్ని తవ్వి తీసే నియమాలన్నీ ఓటు హక్కుని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని అభ్యర్థిస్తే.. అర్హులు కాని వాళ్ళని తొలగించటానికి ఈ మాత్రం చెయ్యాలన్నది. లాజికల్ డిస్క్రిపెన్సి చాలా అన్యాయమని అంటే, నెమ్మదిగా ట్రిబ్యునల్స్ సమస్యలని పరిష్కరిస్తాయి, అప్పటి వరకూ మీరు ఓట్లు వెయ్యకండి, తర్వాత వేసుకోండి అని కోర్టు చెప్పింది. తానే పదేళ్లు సాగదీసి అందరినీ తీసుకునేలా చేసిన ఆధార్ కార్డుని షరతులతో 12వ గుర్తింపుపరంగా చేర్చటానికి ఆమోదించింది.

రూపంలోనే ఇంత సంకుచితంగా, నిరంకుశంగా ఉన్న ఈ సవరణ అమలులో ఎట్లా జరిగిందో చూద్దాం. ఈ ప్రక్రియలో అణగారిన, వలస వచ్చిన, సంచార జాతుల ప్రజలు, అన్ని వర్గాల అణగారిన ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలు అందరూ కలిపి దాదాపు ఆరు కోట్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. బెంగాల్‌లో కొన్ని జిల్లాల ఓటర్ల తొలగింపులో 65శాతానికి పైగా ముస్లిం స్త్రీలు ఉన్నారు. గత రెండు ఎన్నికల నుంచి ఉత్సాహంతో ఓటు వేస్తున్న స్త్రీల శాతం ఈ ‘సర్‌’లో పడిపోయింది. దానికి కారణం– పెళ్లి తర్వాత అత్తగారింటికి వలసలు, ఇంట్లోంచి గెంటివేయటం, ఇతర వలసలు, కుటుంబ హింస, చదువు లేకపోవటం వంటి కారణాలతో ధ్రువీకరణ పత్రాలు సరైన సమయంలో ఇవ్వలేకపోవటం. బిహార్‌లో ప్రయోగాత్మకంగా 2025 జూన్‌లో మొదలైనప్పుడు ఏవయితే సమస్యలని అనేకమంది క్రింది స్థాయి కార్యకర్తలు ఎత్తి చూపించారో, వాటిని సరిదిద్దుకోవటం బదులు, బెంగాల్‌కి వచ్చేసరికి కొత్త ప్రమాణాలని రంగంలోకి తీసుకొచ్చి ఇంకా సంక్లిష్టంగా తయారు చేశారు.

ఓటర్ల మీద బాధ్యత నెట్టెయ్యటం, ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రమాణాలను కావాల్సినట్లు మార్చుకునే నిరంకుశాధికారాన్ని పెట్టుకోవటం, దొడ్డిదారిన పౌరసత్వ నియమాలతో దీనికి ముడివెయ్యటం, అంతేగాక, ప్రజలను పెద్ద ఎత్తున జాబితా నుంచి తొలగించే ఉద్దేశాలతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా ఈ ‘సర్‌’ అనే దుర్మార్గాన్ని తెచ్చింది. దీన్ని ఎదుర్కోవటం, తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజకీయ పార్టీలకి, పౌర సమాజానికీ, అన్ని సామాజిక సంస్థలకి చాలా పెద్ద పరీక్షే!

ఎ. సునీత

ఈ వార్తలనూ చదవండి:

పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్‌

కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్‌ బలోచ్‌ సోదరుడిపై కాల్పులు

Updated Date - Aug 01 , 2026 | 01:19 AM