Share News

ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం దక్షిణాది ఏకమైతేనే సాధ్యం

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:46 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 20న మహాబలిపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన 2047 నాటికి దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను 10 ట్రిలియన్‌...

ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం దక్షిణాది ఏకమైతేనే సాధ్యం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 20న మహాబలిపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన 2047 నాటికి దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను 10 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని ప్రతిపాదించారు. జనాభా పెరుగుదలలో ఉన్న మార్పులను దృష్టిలో ఉంచుకుంటే ఈ లక్ష్యం సాధించటం అంత ఆషామాషీ కాదని అర్థమవుతుంది.

2021–36 సంవత్సరాల మధ్య– ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళం– ఈ ఐదు రాష్ట్రాల జనాభా వృద్ధి సుమారు 4.2 శాతంగా ఉండనుంది. ఇదే కాలంలో దేశ జనాభా సుమారు 11.6 శాతం పెరుగుతుందని అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి. పైగా కేరళం వంటి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే దేశ సగటుతో పోలిస్తే అధిక వృద్ధాప్య జనాభాను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే, కేవలం జనాభా పెరుగుదలపై ఆధారపడకుండా తలసరి ఉత్పాదకతను ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి గణనీయంగా పెంచుకోవాలి.

వింధ్యాచల శ్రేణులకు దక్షిణంగా విస్తరించిన ద్వీపకల్పం ఉత్పాదక రంగాల్లో వైవిధ్యానికి నెలవు. బెంగళూరు–సాంకేతికత, స్టార్టప్‌లు, పరిశోధనలకు; హైదరాబాద్‌–ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, వైద్యానికి; చెన్నై– తయారీ, ఆర్థిక సేవలు, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌కు బలమైన కేంద్రాలుగా ఎదిగాయి. అమరావతి రూపంలో సువిశాలమైన తీరప్రాంతం, పోర్టులు, వ్యవసాయ–ఆహార ప్రాసెసింగ్‌, ఖనిజ సంపద, పునరుత్పాదక ఇంధన అవకాశాలు, హస్తకళా కేంద్రాలతో కొత్త అభివృద్ధి కేంద్రం ఏర్పడింది. కేరళం రాష్ట్రానికి ఆరోగ్యం, సేవలు, పర్యాటకం, వెల్‌నెస్‌, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రవాస సమాజం ప్రధాన బలాలు.

స్వామి వివేకానందుడు 1892లో కన్యాకుమారి చేరుకుని, సముద్రంలోని శిలపై ధ్యానం చేస్తూ భారతదేశ గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచించారు. ఇన్నేళ్ల తర్వాత అదే వేదిక నుంచి దక్షిణాదిని ఆసాంతం వీక్షిస్తూ మరో ఆలోచన చేయవచ్చు. రాష్ట్రాలు విడివిడిగా కృషి చేస్తేనే ఇన్ని విజయాలు సాధించినప్పుడు, అవన్నీ కలివిడిగా కృషి చేస్తే ప్రగతి పథంలో మరింతగా దూసుకుపోగలవు కదా?


ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి మార్కెట్‌గా, పరిశోధనా భాగస్వామిగా, పర్యాటక ఆకర్షణగా లేదా అంతర్జాతీయ మార్కెట్‌కు ప్రవేశద్వారంగా మారగలదు. రాష్ట్రాల సరిహద్దులు పరిపాలనా పరిధులను నిర్దేశించినా, ఆర్థిక అవకాశాలకు అవి అడ్డుగోడలుగా మారాల్సిన అవసరం లేదు. రష్యా నుంచి భారతదేశానికి, మధ్య ఆసియా, ఇరాన్‌, అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ మీదుగా ఖండాంతర రైల్వే అనుసంధానం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న ప్రతిపాదన ఇటీవల వెలువడింది. దేశాల మధ్య ఇంతటి సమన్వయాన్ని ఆలోచించగలిగినప్పుడు, ఒకే దేశంలోని పొరుగు రాష్ట్రాలు తమ మధ్య భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను ఎందుకు నిర్మించకూడదు? దక్షిణాది మొత్తాన్ని అనుసంధానించే రైలు, రోడ్డు, పోర్టు, తీర రవాణా, లాజిస్టిక్స్‌ వ్యవస్థలను రాష్ట్రాల వారీ ప్రాజెక్టులుగా కాకుండా, ఒకే దీర్ఘకాలిక విస్తృత ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేయవచ్చు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే వాణిజ్య వాహనానికి పరిపాలనా పరమైన అడ్డంకులు ఉండకుండా చేయడం అసాధ్యం కాదు.

పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం– ఈ సముద్ర త్రయం మన దక్షిణ ద్వీపకల్పానికి ప్రత్యేక భౌగోళిక ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి. కేరళం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాలు, వాటి పోర్టులు హైదరాబాద్‌ వంటి లోతట్టు పారిశ్రామిక ప్రాంతాలతో అనుసంధానమైతే, ఇది పెద్ద వాణిజ్య వ్యవస్థగా మారవచ్చు. తీర రవాణా, ఎగుమతులు, మత్స్యరంగం, సముద్ర ఆధారిత ఇంధనం, పోర్టు ఆధారిత పరిశ్రమలు, క్రూయిజ్‌ పర్యాటకాన్ని పరస్పరం అనుసంధానించి, సముద్ర త్రయాన్ని ఉమ్మడి ఆర్థిక వ్యూహంగా చూడవచ్చు.

చెన్నై–బెంగళూరు–హైదరాబాద్–అమరావతి నగరాలను ఒక ఆర్థిక చతుర్భుజంగా అభివృద్ధి చేయవచ్చు. ఈ నగరాల ప్రత్యేకతలను విడివిడిగా వాడుకోవటం కంటే, వాటి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను ఆర్థిక బలంగా మార్చుకోవచ్చు. రవాణా, పారిశ్రామిక సరఫరా గొలుసులు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులను అనుసంధానిస్తే, ఒక్కో నగరం మరొక నగరానికి ఆర్థికంగా చేయూతను ఇవ్వగలదు. జనాభా ప్రయోజనం క్రమంగా తగ్గుతున్న దక్షిణాది ప్రాంతానికి చంద్రబాబు ప్రతిపాదించిన 10 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం ఉత్పాదకతను పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. దానిని సాధించాలంటే దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం పోటీ పడటంతో పాటు, కొన్ని రంగాల్లో సహకరించుకోవాలి కూడా.

కృష్ణబాలాజి పల్లపోతు

ఈ వార్తలనూ చదవండి:

రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు

హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్

Updated Date - Sep 24 , 2026 | 01:46 AM