ఆత్మకథ కాదు.. ఓ కట్టుకథ
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:04 AM
రాజకీయ నాయకుల ఆత్మకథలు కేవలం వారి వ్యక్తిగత జీవిత విశేషాలకు దర్పణం పట్టాలి. కానీ, భారతదేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన ఓ కుటుంబం నుంచి, ముఖ్యంగా...
రాజకీయ నాయకుల ఆత్మకథలు కేవలం వారి వ్యక్తిగత జీవిత విశేషాలకు దర్పణం పట్టాలి. కానీ, భారతదేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన ఓ కుటుంబం నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పీఠాన్ని సుదీర్ఘకాలం అధిష్ఠించిన సోనియాగాంధీ తన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ను ఒక జ్ఞాపకాల పుస్తకంలా కాకుండా, చరిత్రను తమ కుటుంబానికి అనుకూలంగా మలుచుకునే మరో రాజకీయ ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. తామేదో దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేశామని, దేశం మొత్తం తమ కుటుంబానికి రుణపడి ఉండాలనే ఒక రకమైన ఫ్యూడల్ భావజాలాన్ని మరోసారి సమాజంపై రుద్దే ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా జరుగుతోంది.
2004లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశానంటూ సోనియా చెప్పుకునే కథనంలో ఏ మాత్రం వాస్తవం లేదు. సుబ్రహ్మణ్యస్వామి గతంలోనే ఈ విషయంపై బలమైన ఆధారాలను దేశం ముందుంచారు. ఆయన వాదన ప్రకారం, సోనియా స్వచ్ఛందంగా ప్రధాని పదవిని తిరస్కరించలేదు. ఆయన దాఖలు చేసిన పిటిషన్, లేవనెత్తిన అభ్యంతరాలతో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆమెను ప్రధానమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఆహ్వానించడానికి న్యాయపరంగా అడ్డుకున్నారు. భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం సోనియాగాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి అర్హులు కారని 2004 మే 3న స్వామి స్పష్టం చేశారు. అనంతరం 2004 మే 15న రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు లేఖ రాసి ఈ రాజ్యాంగపరమైన అభ్యంతరాలను వివరించారు. అంతేకాకుండా, 2004 మే 17 మధ్యాహ్నం 3:30 గంటలకు సోనియాగాంధీకి కలాం పంపిన లేఖను బయటపెట్టాలని 2012లో స్వామి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టే విషయంలో చట్టపరమైన ఇబ్బందులు ఉండవచ్చని సోనియాకు రాసిన ఆ లేఖలో రాష్ట్రపతి సూచించినందువల్ల ఆమె వెనక్కితగ్గారే తప్ప, అది త్యాగం కాదని స్పష్టమవుతోంది.
సోనియాగాంధీ తన పుస్తకంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాస్తవ చరిత్రను ఎలా వక్రీకరించారో చెప్పడానికి మల్లికార్జున్ ఖర్గే కుటుంబ విషాదంపై ఆమె రాసిన రాతలే నిలువెత్తు నిదర్శనం. ఈ పుస్తకంలోని 484వ పేజీలో ఖర్గే కుటుంబం ఎదుర్కొన్న భీకర ఘటనను కుల ఘర్షణలు అనే పదాలతో సోనియా వివరించారు. వాస్తవానికి, 2026 జూన్‌లో రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ నిర్వహించిన దిల్ సే కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే స్వయంగా తన బాల్య విషాదాన్ని కన్నీటితో వివరించారు. 1948లో నిజాం పాలనలోని రజాకార్లు గుర్రాలపై వచ్చి తమ గ్రామంపై దాడి చేసి, ఇళ్లకు నిప్పు పెట్టారని, ఆ మారణహోమంలో తన తల్లి, సోదరి ప్రాణాలు కోల్పోయారని ఖర్గే స్పష్టంగా చెప్పారు. స్వయంగా బాధితుడే రజాకార్ల దాడి అని చెప్పినప్పటికీ, మైనారిటీ ఓటు బ్యాంకు దూరమవుతుందనే భయంతో ముస్లిం రజాకార్లు అనే పదాన్ని వాడలేక, సోనియాగాంధీ దాన్ని కుల ఘర్షణలుగా మార్చిరాయడం చరిత్రకు చేసిన తీరని ద్రోహం కాదా? 1975 ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, బాబ్రీ మసీదు, బోఫోర్స్ కుంభకోణం వంటి దేశాన్ని కుదిపేసిన కీలక ఘటనల్లో నెహ్రూ–గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తగ్గించిచూపే ప్రయత్నం ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎమర్జెన్సీ వల్ల దేశంలో ప్రజాస్వామ్య హక్కులకు, పౌర స్వేచ్ఛకు జరిగిన అపారనష్టం కంటే, అప్పట్లో ఇందిరాగాంధీ ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిడికే సోనియా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల తీవ్రతను కూడా తక్కువచేసి చూపారు. అంతేకాకుండా, నేటి కాంగ్రెస్ దుస్థితికి కారణమైన రాహుల్‌గాంధీ రాజకీయ వైఫల్యాల గురించి ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించారు.
ఇక అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో గాంధీ కుటుంబం వ్యవహరించిన తీరు భారత రాజకీయ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం. పీవీతో ఎలాంటి విభేదాలూ లేవని సోనియా తన ఆత్మకథలో పేర్కొన్నది పచ్చి అబద్ధం. పీవీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ కుటుంబం ఆయనను ఏ విధంగా వేధించిందో దేశం చూసింది. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన ‘హాఫ్ లయన్’ పుస్తకం చదివితే, పీవీ పట్ల కాంగ్రెస్ హైకమాండ్, గాంధీ కుటుంబం ప్రదర్శించిన కక్షపూరిత వైఖరి అర్థమవుతుంది. దేశ ప్రధానిగా ఉండి కూడా పార్టీలో ఎదురైన అంతర్గత కుట్రలను, ప్రతిక్షణం ఎదురైన మానసిక క్షోభను పీవీ ఏ విధంగా మౌనంగా భరించాల్సి వచ్చిందో ఆ పుస్తకం కళ్లకు కట్టింది. పార్టీ ఓటమికి నరసింహారావును బాధ్యుడిని చేస్తూ, ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన తీరు ఆ కుటుంబపు అహంకార ధోరణికి నిదర్శనం. పీవీ మరణానంతరం ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి కూడా రానివ్వకుండా గేట్లు మూయించిన అవమానకర చరిత్ర దేనికి సంకేతం? దేశానికి దశాబ్దాల పాటు సేవ చేసి, ప్రధానమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా అసాధారణ సేవలందించిన ఒక మహా నాయకుడి భౌతికకాయానికి దక్కాల్సిన కనీస మర్యాదను కూడా రాజకీయ కక్షల కారణంగా నిరాకరించడం ఎంతవరకు సమంజసం?
కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఈ కుటుంబం ఏ స్థాయిలో ఖూనీ చేసిందో చెప్పడానికి సీతారాం కేసరి ఉదంతం ఒక నిలువెత్తు సాక్ష్యం. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఒక సీనియర్ దళిత నాయకుడిని అకస్మాత్తుగా అర్ధరాత్రి ఎమర్జెన్సీ తరహా వాతావరణంలో ఏఐసీసీ కార్యాలయం నుంచి బయటకు గెంటేయించిన ఘటన భారత రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఇక డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశాన్ని తెరవెనుక నుంచి ఎవరు నడిపించారనేది జగద్విదితం. ప్రముఖ జర్నలిస్ట్ సంజయ్‌బారు రాసిన సంచలన పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మిస్టర్’ ఈ నిజాన్ని కుండబద్దలు కొట్టింది. మన్మోహన్‌సింగ్‌ను ఒక రిమోట్ ప్రధానిగా మార్చి, అసలు అధికార కేంద్రం అంతా ‘10 జన్‌పథ్’ చేతిలోనే ఉండేలా చక్రం తిప్పిన వైనాన్ని ఆ పుస్తకం ఆధారాలతో సహా వివరించింది. దేశ ప్రధాని కార్యాలయం కంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిలే ఎక్కువ అధికారాలు చలాయించేలా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, రాజ్యాంగేతర శక్తిగా సోనియాగాంధీ వ్యవహరించిన చరిత్ర అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఎన్నో చారిత్రక వాస్తవాలకు మసిపూరి మారేడుకాయ చేశారు. తొమ్మిది మంది హిందూ కరసేవకులు సజీవ దహనమైన గోద్రా రైలు దహన ఘటనలో 33 మందిని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అలాంటప్పుడు ఈ ఘటనకు కారణం ఇంకా ‘వివాదాస్పదం’ అని ఎలా అంటారు?
నేడు కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికిని పూర్తిగా కోల్పోయింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు. వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కృత్రిమ ప్రాణం పోసేందుకు సోనియా ఈ పుస్తకాన్ని ఒక రాజకీయ అస్త్రంగా తెరపైకి తెచ్చారు. వ్యక్తి పూజలను, వంశపారంపర్య రాజకీయాలను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు కాబట్టి, ఎంతటి ప్రచార ఆర్భాటాలు చేసినా పతనమవుతున్న కాంగ్రెస్ పాతాళంలోకి పడిపోవడాన్ని ఆపడం ఏ శక్తివల్లా సాధ్యం కాదు.
యస్. విష్ణువర్ధన్‌రెడ్డి
బీజేపీ నేషనల్ ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..