పగ్గాలున్నా పరుగులు ఆపలేరు!
ABN , Publish Date - Jul 24 , 2026 | 01:43 AM
ఊహించినవీ ఉద్దేశించినవీ యథాతథంగా జరగటం మానవజీవితంలో చాలా అరుదు. ఉద్దేశాలు, ఊహలు లేకుండా వ్యక్తులూ ఉండరు. బృందాలూ ఉండవు. కానీ చాలా సందర్భాల్లో వారు ఊహించని, కోరుకోని ఫలితాలు...
ఊహించినవీ ఉద్దేశించినవీ యథాతథంగా జరగటం మానవజీవితంలో చాలా అరుదు. ఉద్దేశాలు, ఊహలు లేకుండా వ్యక్తులూ ఉండరు. బృందాలూ ఉండవు. కానీ చాలా సందర్భాల్లో వారు ఊహించని, కోరుకోని ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందుకే సంఘటనలను వ్యక్తుల సదుద్దేశాలు, దురుద్దేశాల ఆధారంగా అర్థంచేసుకోటానికి ప్రయత్నిస్తే మనముందు ఎప్పుడూ అసమగ్రచిత్రమే కనపడుతుంది. సోషల్ మీడియాను అభివృద్ధి చేసినవారు ఉద్దేశించింది ఒకటి. జరుగుతోంది మరొకటి. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వాలనూ నిరంకుశ ధోరణులను వ్యతిరేకించే వ్యక్తులకూ శక్తులకూ సోషల్‌మీడియా వేదిక అవుతుందని ఆ మీడియా రూపకర్తలు అనుకోలేదు. మన కళ్లెదుట తీవ్రమవుతున్న కాక్రోచ్ ఉద్యమమే దీనికి నిదర్శనం. ఇప్పటికీ సోషల్ మీడియా యాజమాన్యాల లక్ష్యాలు వేరు. వారి ప్రధాన ఉద్దేశం లాభాలను పొందటమే కావచ్చు. కానీ దానికి భిన్నమైన రాజకీయ లక్ష్యాలకు సోషల్ మీడియా ఆలంబనగా మారుతోంది. అననుకూల భావాలను, ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టే రాజకీయ లక్ష్యాలను సోషల్ మీడియా వేదికలపైకి రాకుండా చూడటానికి ఎన్ని వడపోతలూ, జల్లెడలూ పెట్టినా వాటిని నిరోధించలేని స్థాయికి పరిస్థితి వెళ్లింది. కోట్లాదిమందికి భావ భాగస్వామ్యం కల్పించే వేదికలను సృష్టించిన తర్వాత, వ్యాపారమంతా దాని చుట్టూ కేంద్రీకృతమైన తర్వాత అనుకున్నట్లుగా వాటిని నియంత్రించటం ఒకపట్టాన సాధ్యంకాదు. బహుశా మానవచరిత్రలోనే ఇంత విస్తృతస్థాయిలో భావాల మార్పిడికి, భావాల సంఘర్షణకు వందల కోట్ల మందికి అవకాశం కల్పించటం ఎప్పుడూ జరగలేదు. గనులు, భూములు, ఫ్యాక్టరీల మీద ఆధిపత్యం ఉన్నవాళ్లకు సమాజంలో ఉన్న భావాల మీద కూడా ఆధిపత్యం ఉంటుందని కారల్ మార్క్స్ ఎప్పుడో సూత్రీకరించారు. అంటే ఆ భావాలు సంపదపై ఆధిపత్యాన్ని కొనసాగించటానికి దోహదం చేస్తాయనీ ఆ ఆధిపత్యం సహజసిద్ధమైందన్న భ్రమలో అవి ఉంచుతాయనీ ఆయన చెప్పింది స్థూలంగా నిజమే కావచ్చు. కానీ సోషల్ మీడియా ఆ భావాల పట్టుని కొంతమేరకు కదిలేలా చేయగలుగుతోంది. కోట్లాది గొంతుకలను అనుకున్న రీతిలో నియంత్రించలేని విధంగా దాంట్లో ఏర్పాటు ఉండటమే దీనికి కారణం. దాని పునాదే కోట్లాది అభిరుచులు, ఆకాంక్షలు, భావాలు, ఉద్దేశాలపై ఆధారపడి ఉంది. గతంలో ఎప్పుడూ ఇంతటి వైవిధ్య, విశాల వేదిక ప్రజలకు అందుబాటులో లేదు. సార్వజనీన ఓటుహక్కులా భావవ్యక్తీకరణ సార్వజనీనం అయిపోతోంది.
విదేశీ విరాళాలను క్రమబద్ధీకరించే పేరిట దేశంలో స్వచ్ఛంద సంస్థలన్నిటినీ ఏదోవిధంగా నియంత్రించి, అవి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేని పరిస్థితిని సృష్టించిన తర్వాత సోషల్ మీడియానే అసమ్మతులకూ, అసంతృప్తులకూ వేదికగా మారక తప్పటంలేదు. టీవీలూ, పత్రికలూ తమ గొంతుకలకు పాక్షికంగానే అవకాశం కల్పిస్తున్నాయన్న భావనకు వచ్చిన తర్వాత అన్ని దేశాల్లోనూ యువత సోషల్ మీడియానే ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలను ప్రశ్నించటం ప్రారంభమైంది. పాలకులు చేస్తున్న తప్పులకు జవాబుదారీతనం కోసం డిమాండు చేస్తూ పదవుల నుంచి దిగిపోవాలని కోరటమూ ఎక్కువైంది. పనీపాటాలేని కొందరు యువత సోషల్‌మీడియా ద్వారా అనవసరంగా యాగీ చేస్తున్నారనీ, సమాజ జీవనానికి వారు బొద్దింకలుగా మారారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేసినట్లుగా వచ్చిన వార్తలు దావానలంగా మారి ఒక ఉద్యమరూపాన్ని సంతరించుకోవటం మన దేశంలో ఎన్నడూ జరగలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు సంఘటితమవ్వటం కొద్దికాలమే ఉండొచ్చు. అన్యాయాలనూ, అక్రమాలనూ ప్రశ్నించే భావాల వేడి కొద్దికాలం తర్వాత చల్లబడనూ వచ్చు. కాక్రోచ్ ఉద్యమం ఉధృతీ తగ్గొచ్చు. కానీ సంప్రదాయ ప్రతిపక్షాలకు విశ్వసనీయత అంతంతమాత్రంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఉద్యమాలు సైతం ప్రజాస్వామ్యాన్ని ఎంతోకొంత మేరకు నిలబెడతాయి. పాలకులను జవాబుదారీ పీఠం ఎక్కేలా చేయగలుగుతాయి. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అవ్వటానికి పరిహారంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరటాన్ని ఈ కోణం నుంచే చూడాలి. నైతిక బాధ్యతే లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు.
సమాజంలో అన్ని వ్యవస్థలను ఒకే భావజాలానికి అనుగుణంగా మార్చివేసి, అసమ్మతిలేకుండా చేయటానికి గట్టిగా ప్రయత్నాలు జరిగిన చోట వాటిని వ్యతిరేకించటానికి సోషల్ మీడియానే ప్రధాన వాహికగా పనిచేసింది. అరబ్ స్ర్పింగ్ (2010–2012) పేరిట ట్యునీషియా, ఈజిప్టు, లిబియా, యెమెన్‌ల్లో జరిగిన ఆందోళనల్లో సోషల్‌మీడియా నిర్వహించిన పాత్రపై ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం కోసమే యువత అక్కడ వీధులకు ఎక్కింది. హాంకాంగ్‌లో 2019 నాటి ప్రజాస్వామ్య ఉద్యమం, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో వాతావరణ మార్పులపై 150కి పైగా దేశాల్లో జరిగిన ఆందోళనలు, 2011 నాటి అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా సాగిన నిరసనలు, బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళనలు, నేపాల్‌లో తిరుగుబాటు, కెన్యాలో జెన్–జీ ఉద్యమం లాంటివన్నీ సోషల్ మీడియానే అధికంగా ఉపయోగించుకున్నాయి. సోషల్ మీడియా వల్ల అంతా మంచే జరుగుతోందా? చెడు జరగటం లేదా? అని తర్కించుకుంటే వచ్చే సమాధానం భిన్నంగానే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను ఆధారంచేసుకుని హిట్లర్, ముసోలినీ లాంటి నియంతలు రాజ్యాధిపతులయ్యారు. మత, తెగ ఉద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల ఊచకోతకు కారణమైన సంకుచితత్వ నేతలూ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకునే అధికార పీఠాలను ఎక్కారు. నిరంతరం ఒక మతాన్ని బూచీగా చూపించి ఆ మతానికి చెందిన ప్రజలను అభద్రతతో జీవించేలా చేస్తున్న నేతలూ ప్రజాస్వామ్యం ఆసరాతోనే వరుసగా ఎన్నికవుతున్నారు. ఈ విపరీతాలూ అనర్థాలూ ఉన్నంత మాత్రాన మొత్తం ప్రజాస్వామ్యాన్నే పక్కన పెట్టలేం. ప్రజాస్వామ్య రాజకీయాలతోనే వాటిని ఎదుర్కొనటానికీ, ఓడించటానికీ ప్రయత్నాలూ, ఉద్యమాలూ జరిగాయి. సోషల్ మీడియాకూ ఇదే వర్తిస్తుంది. చక్రవర్తులూ రాజులూ పాదుషాలూ నవాబులూ అధికారం చలాయిస్తున్న కాలంలో పన్నులు కట్టే వ్యాపారులు.. మాకూ ప్రభుత్వ పాలనలో ప్రాతినిధ్యం ఉండాలని డిమాండు చేయటంతో ప్రజాస్వామ్యానికి బీజాలు పడ్డాయి. పన్నులు కట్టే వారికి ఓటు హక్కుని కల్పించాలన్న భావనతోనే ప్రాతినిధ్యపాలనా పద్ధతి మొదలైంది. భారత రాజ్యాంగ పరిషత్తుకు జరిగిన పరోక్ష ఎన్నికల్లో కూడా ఓటువేసే హక్కు ఆనాడు పన్నులు కట్టే వారికే దక్కింది. ఆనాటికి వాళ్ల సంఖ్య జనాభాలో 10 నుంచి 15 శాతం లోపే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఇంత పరిమితంగా మొదలైన ప్రజాస్వామ్యం అనుకోని విధంగా అందరికీ ఓటుహక్కు కల్పించటానికి కారణమైంది. వ్యాపారవర్గం ఉద్దేశం ఒకటి, వివిధ పరిణామాల కలయికతో జరిగింది మరొకటి. పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చి, వాటితో పాటు కార్మికులు పెరిగిన తర్వాత వాళ్ల పోరాటాలతో ఓటుహక్కుని విస్తరించక తప్పలేదు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల కోసమూ, ఫొటోలను, సందేశాలను, వ్యక్తిగత వివరాలను పంచుకోటానికీ, ఆన్‌లైన్ ద్వారా అభిరుచుల కలబోతల కోసం మొదలైన సోషల్‌మీడియా... రాజకీయ బల సమీకరణలకూ, పౌరుల విస్తృత కార్యాచరణకూ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకూ వేదికై ప్రభుత్వాలను గద్దె దింపే స్థాయికి చేరుకుంటుందని ఒకప్పుడు ఊహించలేదు. అందుకే ప్రాచీన చరిత్రలోనైనా, ఆధునిక చరిత్రలోనైనా ఊహించని, ఉద్దేశించని ఫలితాలను విశ్లేషించటమే చాలా కీలకం. రష్యన్ మహారచయిత టాల్‌స్టాయ్ తన మహోన్నత రచనైన యుద్ధం–శాంతి నవలలో కూడా దీన్నే ప్రధానంగా చెబుతారు. టాల్‌స్టాయ్ ప్రకారం.. వ్యక్తులు ఒక ఉద్దేశంతో చర్యలు చేపడతారు. కానీ ఆ చర్యల తుదిఫలితాలు వారి నియంత్రణలో ఉండవు. లక్షలాది మంది చర్యలు పరస్పరం కలిసిపోయి, పరస్పరం ప్రభావితమై ఎవరూ ఊహించని ఫలితాలను సృష్టిస్తాయి. వ్యక్తుల సంకల్పాలు చాలా ముఖ్యమైనా వాటిని బట్టే పూర్తిగా చరిత్రను వివరించలేం. సోషల్ మీడియాను ఈ దృష్టి నుంచి చూస్తేనే దాని పాత్ర అర్థం అవుతుంది. దాని సృష్టికర్తలు ఊహించని పరిణామాలకే అది ఊతం ఇస్తోంది.
సోషల్‌మీడియాలో వివిధ వయస్సుల వాళ్లు క్రియాశీలకంగా ఉన్నా అవసరమైనప్పుడు కార్యాచరణకు అడుగులు వేసేది యువతే. 30 కోట్ల మంది ఉన్న జెన్–జీ (1997–2012 మధ్య జన్మించిన వాళ్లు) యువత ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వీళ్లల్లో 41.7 శాతం మంది యువకులు ఇంకా విద్యను కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే యువతుల్లో 38.4 శాతం అదే చేస్తున్నారు. చదువు పూర్తయిన ఆ వయస్సు యువకుల్లో 14.8 శాతానికి మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు వస్తున్నాయి. యువతుల్లో అయితే 4.7 శాతం మందికి మించి అవి రావటం లేదు. మిగిలిన వాళ్లందరూ తాత్కాలిక ఉద్యోగాల్లోనూ, సామాజిక భద్రతలేని కొలువుల్లోనూ కుదురుకోవాల్సి వస్తోంది. మొత్తంగా జెన్–జీ తరంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువకుల్లో 29 శాతం నిరుద్యోగం ఉంది. యువతుల్లో అది 36.9 శాతానికి చేరుకుంది. ఇదొక తీవ్రమైన సంక్షోభం. గౌరవప్రదమైన జీవనోపాధి దొరకనప్పుడు అసంతృప్తులు తప్పవు. పాలకుల అపసవ్య విధానాలపై ప్రశ్నలు తలెత్తకా మానవు. వీటికి జవాబులు ఇవ్వకుండా, సరైన విధానాలను రూపొందించకుండా సోషల్ మీడియా యుగంలో కాలాన్ని నెట్టుకురావటం కష్టం. మన గతమంతా ఘనమైందనీ ఎంత ఊదరగొట్టినా, మైనారిటీలను బూచీగా చూపించి రాజకీయంగా నెగ్గుకొస్తున్నా కోట్లమంది పదునైన భావాలతో క్రియాశీలకంగా ఉండే సోషల్‌మీడియా నుంచి వెల్లువెత్తే హేతుబద్ధ విమర్శలను తట్టుకుని వ్యవహారాలను నడపటం అంతతేలిక కాదు. పార్టీలు సొంత సైన్యాలను ఏర్పాటు చేసుకుని సోషల్‌మీడియాలో ప్రచార ఉధృతితో చాలా రాజకీయాలనే చేయొచ్చు. ప్రతి పార్టీ వాటిని చేస్తోంది కూడా. ఎంతచేసినా కోట్ల గళాలను, భావాలను నిరోధించి, తామనుకున్న భావహోరులో అందరినీ కొట్టుకుపోయేలా చేయటం అసాధ్యం. సోషల్ మీడియాలో చెడు ఎంత ఉన్నా మంచి ఏదైనా ఉంటే అది ఇదే. ఆ మంచే ప్రజాస్వామ్యానికి రక్షణకవచంగా మారుతోంది. పాలకులు తమకు తిరుగులేదనుకున్నచోట తిరుగుబాటు గొంతుకలు ఏదో మూలనుంచీ, కొత్తరూపంలో, కొత్త వ్యక్తీకరణలో వినపడటానికి మించి ఈనాటి ప్రజాస్వామ్యానికి కావాల్సింది ఏం ఉంటుంది?
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు