Share News

సామాజిక తెలంగాణకే నా ధర్మపోరాటం

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:48 AM

స్వతంత్ర భారతం 79వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకోబోతున్నది. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి దొరికి 79 ఏళ్లు కాగా, నిజాం ఏలుబడి నుంచి బయటపడి స్వతంత్ర భారతదేశంలో...

సామాజిక తెలంగాణకే నా ధర్మపోరాటం

స్వతంత్ర భారతం 79వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకోబోతున్నది. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి దొరికి 79 ఏళ్లు కాగా, నిజాం ఏలుబడి నుంచి బయటపడి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనమై 78 ఏళ్లు అవుతున్నది. ఈ ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్య భారతదేశంలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక వివక్ష కొనసాగుతుండటం అత్యంత దురదృష్టకరం. ‘సాంఘిక అసమానతలు లేని సమసమాజాన్ని సాధించుకుందాం’ అంటూ ఈ రోజుకు కూడా పిలుపునివ్వాల్సి రావడానికి కారణాలెన్నో.

రాజ్యాధికారమే పరమావధిగా రాజకీయాలు చేయడం వేరు, ప్రజల జీవితాల్లో గుణాత్మక విప్లవాత్మక మార్పులు తెచ్చేలా రాజకీయాలను ఒక అస్త్రంగా మలచుకోవడం వేరు. ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ రెండో పంథాను ఎంచుకొని ప్రజల మధ్యకు వెళ్తున్నది. ప్రజలకు దూరంగా విధానాలను రూపకల్పన చేయడం కాదు, నిత్యం వారి మధ్యనే ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని మేము నిశ్చయించుకున్నాం. తరాలు మారుతున్నా మారని అసమానతలు, వివక్ష, పీడన, కంటికి కనిపించని శత్రువుగా కొందరిని వెంటాడుతున్న అస్పృశ్యత... ఈ సమాజం ఎంతో పురోగమిస్తున్నట్టు కనిపిస్తున్నా దాని క్రీనీడలా దర్శనమిస్తున్నాయి. అంతరాలు, అసమానతలు, అవహేళనలు లేని సమాజాన్ని నిర్మించడం రాత్రికి రాత్రే సాధ్యం కాకపోవచ్చు. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న వాస్తవాన్ని గ్రహించి తెలంగాణ రక్షణ పార్టీ అధ్యక్షురాలిగా నేను మొదటి అడుగు వేశాను.

గతంలో ఎందరో సామాజిక న్యాయం పేరుతో రాజకీయ తెర పైకి వచ్చి, తర్వాత ఆ మూల సూత్రాన్ని వదిలేశారు. సామాజిక న్యాయం పేరుతో పిడికిలి ఎత్తిన నాలాంటి వాళ్ల కాళ్లకు ఆ అనుభవాలు పోటురాయిలా తగలవచ్చు. కానీ నేను తూలిపడిపోతే సామాజిక న్యాయం అనే అజెండాను శాశ్వతంగా కాలగర్భంలో కలిపేసేందుకు శక్తులెన్నో కాచుకు కూర్చున్నాయన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

మీ బిడ్డగా, మహిళగా, ఒక అమ్మగా తెలంగాణలోని సకల జనులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పార్టీ ఏర్పాటు చేసిన రోజే హామీ ఇచ్చాను. పార్టీ ఏర్పాటు చేసిన వంద రోజుల్లో ‘సామాజిక న్యాయ తెలంగాణ’ సాధన కోసం ప్రతిజ్ఞ చేశాను. నాతో పాటు మా పార్టీ క్యాడర్‌తో ప్రతిజ్ఞ చేయించి మా పార్టీ మూల సిద్ధాంతమే సామాజిక న్యాయ తెలంగాణ అని విస్పష్టంగా తెలియజేశాం. సామాజిక న్యాయం అనగానే అది అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనే భావనను కొందరు ప్రచారం చేశారు. కానీ భారతీయ సమాజంలో అనేక విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన వాళ్లలో చాలామంది అగ్రవర్ణాలకు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. ఏదైనా ఆచరించి చూపే చిత్తశుద్ధి ఉండాలే తప్ప, వాళ్లు పుట్టిన కులం ఏమిటి, పెరిగిన నేపథ్యం ఏమిటి అన్నది ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.


భారతదేశం అనేక రంగాల్లో ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తున్నదని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష నన్ను కలచివేశాయి. సబ్బండ వర్గాల సర్వతోముఖాభివృద్ధి, సాధికారతే ధ్యేయంగా సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం సంకల్పం తీసుకున్నాను.

సామాజిక న్యాయం పేరుతో కొన్ని ప్రయోజనాలు ఇస్తే ఆయా వర్గాల వాళ్లు ఓట్లు గుమ్మరిస్తారనే తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే రాజకీయాల మధ్య మనం ఉన్నాం. సంక్షేమ పథకాలు తాత్కాలిక ఆసరానే ఇస్తాయి. జీవితాలలో శాశ్వత మార్పులు తేలేవు. అందుకే సంక్షేమ పథకాలతో పాటు రాజ్యాధికారంలో వాటా అడగడం, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఆ వర్గాలను సమాజంలో ఉన్నతంగా నిలపడం మా పార్టీ విధానం. రాజ్యాధికారం సాధించడం ప్రతి రాజకీయ పార్టీకీ లక్ష్యమే. అయితే ఆ రాజ్యాధికారంలో సబ్బండ వర్గాలను సమ్మిళితం చేయాలనేది నా అభిమతం. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ గడప తొక్కని కులాలను అసెంబ్లీలోను, పార్లమెంట్‌లోను చూడాలనేది నా డ్రీమ్. ఆ కల సాకారం కావాలంటే నా ఆచరణ కూడా అదే స్థాయిలో ఉండాలి. అందుకోసమే సామాజిక న్యాయం సాధించడం కాదు, సాకారం చేస్తామని చెప్తున్నాను. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు అనేవి దానంగానో ధర్మంగానో ఇచ్చేవి కావనీ, వారి రాజ్యాంగ హక్కు అనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. పెరుగుతోన్న ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాల్లో సరైన అవకాశాలు దక్కడం లేదు. దేశవ్యాప్తంగా లక్షలాది ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మైక్ దొరికితే ఉపన్యాసాల్లో కమ్మటి ముచ్చట్లు చెప్పడం తప్ప బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇద్దామన్న సోయి పాలకులకు లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాళీ అయ్యే ఉద్యోగాలకు అదే ఏడాది నోటిఫికేషన్‌లు ఇచ్చి, పోస్టు ఖాళీ అయిన మరుసటి రోజే కొత్త వారికి ఉద్యోగం ఇచ్చేలా వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలి.


ఉద్యోగాలు, స్వయం ఉపాధితోనే అసమానతలు రూపుమాపుతాం అనుకోవడం పూర్తిగా నిజం కాదు. అదే నిజమైతే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీల సామాజిక హోదాలో మార్పులు రావాలి. కానీ అది ఆ కుటుంబాలకే పరిమితం అయింది. అది కూడా తాత్కాలికంగా. మూడు తరాలుగా రాజకీయాల్లో ఉండి ఉన్నత పదవులు పొందిన కుటుంబంలోని వాళ్లు సైతం కుల వివక్షను ఎదుర్కోవాల్సిన దుస్థితి మన చుట్టే ఉన్నది. ఈ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు రావాలి. అంటే పరిపాలించే స్థానంలో ఉన్నవాళ్ల మైండ్ సెట్‌లో మార్పులు రావాలి. సమాజంలోని ప్రతి ఒక్కరినీ సమదృష్టితో గౌరవించుకునే విశాల దృక్పథం నాకు ఉన్నది. అందుకే ఈ సమాజానికి అమ్మలా పరిణతి చెందాలని అనుకుంటున్నానని పార్టీ ప్రకటన రోజే చెప్పాను. సామాజిక తెలంగాణ కోసం నా జీవితాన్ని అంకితం చేయాలని, అందుకోసం అవసరమైన ధర్మపోరాటం చేయడానికి సిద్ధమని ప్రకటించిన తర్వాత ప్రతి అడుగులోనూ ఆ స్ఫూర్తిని నింపుకుంటానని మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాటలు కాదు, ఆచరణాత్మక రాజకీయాలను తెలంగాణకు పరిచయం చేయడమే కాదు... మహాత్మా పూలే, సాహు మహారాజ్, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ల బాటలో నడుస్తూ, భారత రాజ్యాంగ లక్ష్యం వైపుగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత కోసం సమరం చేస్తాం. అదే క్రమంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడడం ఒక చారిత్రక అవసరం. దీనిని పార్లమెంటులో చట్టం చేసేవరకు మా పోరాటం ఆపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్థానిక సంస్థలలో వాటా కోసం ప్రారంభమైన బీసీ కొట్లాట పార్లమెంట్‌లో సగం వాటా సాధించే దాకా ఆపబోం. పాలితులకు పాలకవర్గంలో సమ ప్రాతినిధ్యం దొరకడమే నిజమైన రాజ్యాధికారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలతో సహా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను ఇచ్చే దిశగా మా ప్రయాణం కొనసాగుతుంది. భూమ్యాకాశాలను ఒక్కటి చేసైనా రాజీలేని పోరాటం చేస్తాం. మహనీయులు కలలు కన్న సమ సమాజాన్ని సాధించి చూపుతాం.

l కల్వకుంట్ల కవిత

అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన

ఈ వార్తలు కూడా చదవండి

ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు బిగుస్తోన్న ఉచ్చు

Updated Date - Aug 11 , 2026 | 01:49 AM