సర్ విపరీతానికి మరో సరిజోడు!
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:58 AM
అంకెలు ఉన్నప్పుడు గారడీలూ ఉంటాయి. ఆ గారడీల వెనుక రాజకీయ ప్రయోజనాలూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో గారడీలు శ్రుతి మించితే అంకెలపై...
అంకెలు ఉన్నప్పుడు గారడీలూ ఉంటాయి. ఆ గారడీల వెనుక రాజకీయ ప్రయోజనాలూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో గారడీలు శ్రుతి మించితే అంకెలపై పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోతాం. సర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) పేరుతో ఓటర్ల జాబితాల ప్రక్షాళన జరుగుతున్న తీరుని చూస్తుంటే మన అంకెల చక్కదనం స్పష్టంగా వెల్లడవుతోంది. కోట్ల మంది ఓటర్లు జాబితాల నుంచి తొలగిపోతున్నారు. సర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తయితే పదమూడున్నర కోట్ల మంది ఓటర్ల జాబితా నుంచి వైదొలగే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు వచ్చిన తర్వాత, పోలింగ్ ప్రక్రియ మొత్తాన్నీ లైవ్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్న తర్వాత, ఓటువేయటానికి వచ్చిన వారు అసలా నకిలీయా అని నఖశిఖ పర్యంతం నలుగురైదుగురు ఉద్యోగులూ, పోలింగు ఏజెంట్లూ పరిశీలించటం సర్వసాధారణమైన చోట దొంగ ఓట్లకు ఆస్కారం చాలా తక్కువ. గతంలో లాగా పోలింగ్ బూత్‌ల ఆక్రమణలూ లేవు. కొన్ని చోట్ల ఉన్నా సామాజిక మీడియా సర్వవ్యాప్తమైన తర్వాత రీపోలింగ్‌లూ తప్పటం లేదు. ఇవన్నీ అందరికీ అనుభవంలో ఉన్న విషయాలు. వీటికి తోడు ఏడాదికి ఒకసారి ఓటరు జాబితాల్లో దేశవ్యాప్తంగా సవరణలూ జరుగుతూ ఉంటాయి. అయినా ఇవేమీ చాలవన్నట్లు సర్‌ను చేపట్టి పెద్దఎత్తున ఓటర్లను తొలగించటమే లక్ష్యంగా పెట్టుకుని కోట్లమందిని ఆఫీసుల చుట్టూ తిరిగేటట్లు చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట చేపట్టిన సర్ జాబితాలో పేరు లేని వారందరూ తమను తాము ఓటర్లుగా నిరూపించుకోవాల్సిన బాధ్యతను పౌరులపైనే పెట్టి ప్రజాస్వామ్యానికి ఎనలేని సేవ చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటనలు గుప్పించింది. సర్ పేరుతో ఓట్ల తొలగింపులో తప్పులు ఒక్కొక్కటీ బయటపడి ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠే సర్వభ్రష్టత్వం పొందటం మొదలైన తర్వాత ఇప్పుడు నివారణ చర్యలు మొదలుపెట్టారు. బిహార్, బెంగాల్ ఎన్నికల్లో సర్ నిర్వాకంతో ప్రజాస్వామ్యానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సర్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూస్తున్న వారికి బాధితులు ఎవరో తేలికగానే అర్థం అవుతోంది. చదువులు అంతంతమాత్రంగా ఉన్నవారూ, అధికార పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోలేని వారూ, నిరుపేదలూ, మధ్యతరగతిలో అట్టడుగున ఉండే వారే ఆ కోవలోకి వస్తారు. సరిహద్దు జిల్లాల్లో అక్రమంగా వచ్చిన ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటే అక్కడ సర్‌ను చేపట్టినా ఒక అర్థం ఉండేది. మరణించిన వారిని ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగించటానికీ, రెండుమూడు చోట్ల ఓట్లు కలిగి ఉండటాన్ని అరికట్టటానికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోలేని ఎన్నికల కమిషన్ తన అసమర్థతకు.. కోట్ల మందిని బోనులో నిలబెట్టి పౌరులేనని నిరూపించుకోవాలని ఆదేశించటం కంటే అసంబద్ధత మరొకటి ఉండదు. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు సర్ ప్రక్రియకు పనికిరావనటంతోనే మన డేటా నాణ్యతపైనా, వాటిని జారీచేసిన అధికారుల నిజాయితీపైనా నీలినీడలు అలుముకున్నాయి. ఒకనాడు ఒక చేతికి చట్టబద్ధమైనవి ఇప్పుడు మరో చేతికి చట్టవిరుద్ధంగా మారాయి. మన వ్యవస్థల ద్వంద్వ ప్రమాణాలకు ఇంతకంటే నిదర్శనం ఇంకోటి కనపడదు.
సరిహద్దు జిల్లాల్లో అక్రమంగా ప్రవేశించిన వలసదారులను ఓటర్ల జాబితా నుంచి ఏరివేయటం పేరుతో మొదలైన సర్ ప్రక్రియకు ఇప్పుడు మరొకటి తోడవుతోంది. మన జనాభా కూర్పులో మార్పులను పరిశీలించటానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్రాలకు ఇటీవల పంపిన 35 ప్రశ్నలను చూస్తే మతానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తేలికగా అర్థం అవుతుంది. అటువంటి సమాచారాన్ని సేకరించటం ద్వారా ఏం చేయబోతున్నారో ఇప్పుడే చెప్పలేం. మనది లౌకిక రాజ్యాంగం అవ్వటం వల్ల ఒక్క జనాభా లెక్కల్లో తప్ప ప్రత్యేకంగా మతాల వారీగా వివిధ అంశాలపై సమాచారాన్ని సేకరించటం సాధ్యంకాదు. జనాభా సేకరణలో కులాల వారీ లెక్కలు సేకరిస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చిన కేంద్రం.. చివరికి ప్రజలు స్వచ్ఛందంగా చెప్పే కులాల పేర్లను మాత్రమే నమోదుచేస్తామని ప్రకటించింది. రాజ్యాంగంలో వెనుకబడిన తరగతులు అని మాత్రమే ఉందనీ వెనుకబడిన కులాలు అనే ప్రస్తావనే లేదనీ.. కాబట్టి కులాల జాబితాలను ఖాయం చేసుకుని అందరినీ వాటిల్లోకి ఇమడ్చలేమనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా సిద్ధంగా ఉన్న బీసీ కులాల జాబితాలను ప్రామాణికంగా తీసుకోవాలని కోరిన డిమాండ్లనూ తిరస్కరించింది. వెనుకబడిన తరగతులు అని మాత్రమే రాజ్యాంగంలో ఉంటే కులాల ఆధారంగా రిజర్వేషన్లను ఎలా కల్పిస్తున్నారన్న ప్రశ్నకు జవాబును ఇవ్వటం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాకూడదు. కానీ రాజకీయ అవసరాల కోసం ఏదైనా సాధ్యమవుతుందని చెప్పటానికి ఇంతకు మించిన తార్కాణం ఉండదు. ఉన్నతస్థాయి కమిటీ పంపిన కొన్ని ప్రశ్నలను చూస్తే మతాలవారీ సమాచారం ఏ స్థాయిలో సేకరించదలుచుకున్నారో తేలికగా అర్థమవుతుంది. గత 15 ఏళ్లుగా వాహనాలను ఏ మతం వారు కొనుగోలు చేశారో వివరాలు కావాలని కమిటీ అడిగింది. అంటే జిల్లాల్లోని రవాణాశాఖలు వాహన కొనుగోలుదారులను మతాలపరంగా వర్గీకరించి సమాచారాన్ని అందచేయాలి. అలాగే సరిహద్దు జిల్లాల్లో వాణిజ్య వాహనాల సంఖ్యలో అనూహ్య పెరుగుదల ఉంటే తెలియచేయాలనీ కోరింది. మతాల వారీగా పాఠశాల విద్యార్థుల నమోదు కావాలనీ అడిగింది. గిరిజన ప్రాంతాల్లో ఏర్పడిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు మతసంస్థలు ఏర్పాటుచేసిన వాటి వివరాలు అందివ్వాలనీ అడిగింది. గడచిన 15 సంవత్సరాల్లో జిల్లాల్లో ఏర్పాటైన దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర మతపరమైన నిర్మాణాల వివరాలు కావాలని కూడా కోరింది. ఇంతటితో అయిపోలేదు. ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమాచారం కూడా మతాలవారీగా కావాలని పేర్కొంది. ఇప్పటివరకూ కమిటీ పంపిన అన్ని ప్రశ్నలనూ అధికారికంగా వెల్లడించలేదు. అవి వెల్లడైతే గానీ పూర్తి చిత్రం అర్థంకాదు. గతంలో ఎన్నడూ మనదేశంలో ఇలా ఆస్తులు, వాహనాలు, విద్యార్థుల గురించి మతపరమైన సమాచారాన్ని జిల్లాల వారీగా ఈ రీతిలో అడగలేదు. నిజానికి మత, కులపరంగా ప్రజలందరూ ఏ సామాజిక, ఆర్థిక స్థాయిల్లో ఉన్నారో పక్కాగా సమాచారాన్ని తెలుసుకుంటే వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ ఆ సమాచారాన్ని దేనికి ఉపయోగిస్తారన్నదే కీలకం.
రాజ్యాంగం ప్రకారం అటువంటి సమాచారాన్ని సేకరించటం సబబా? కాదా? అన్న దానిపై ఏకాభిప్రాయం రాదు. విషయం కోర్టులకు ఎక్కి వాదోపవాదాలు జరిగితేనే దాని చట్టబద్ధతపై స్పష్టత వస్తుంది. కులాల వెనుకబాటుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించటానికి కోర్టులు ఎప్పుడో అంగీకరించాయి. కానీ మతపరమైన సమాచారాన్ని అలా సేకరించటంపై ప్రత్యేక తీర్పులు వచ్చినట్లు స్పష్టంగా కనపడదు. కులపరంగా సమాచారాన్ని సేకరించటానికి రిజర్వేషన్ల కల్పన అనేది బలమైన ఆధారంగా ఉంది. మతాలపరంగా రిజర్వేషన్లు ఉండకూడదని గట్టి వాదనలు ఉన్న నేపథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ తలపెట్టిన సమాచార సేకరణ వివాదాలకు దారితీయకుండా ఉండదు. ముస్లింల సామాజిక, విద్యా, ఉద్యోగాల పరిస్థితిపై సచార్ కమిటీ (2005) ఏర్పాటైనప్పుడు బీజేపీ తీవ్రంగా విమర్శించింది. దాన్నొక జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. మతమార్పిడులతో జనాభాలో వస్తున్న మార్పులను పరిశీలించటం ఇప్పటి కమిటీ లక్ష్యమైతే, సచార్ కమిటీ ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకోటానికి ఏర్పాటైంది. సచార్ కమిటీకి ముందు ముస్లింల గురించి సమగ్ర అధ్యయనం ఏదీ జరగలేదు. రాష్ట్రాల వారీగా కొన్నిచోట్ల జరిగినా కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యంపై సరైన సమాచారం లేదు.
ఇప్పటి లక్ష్యం ఏదైనా, రాజకీయ అజెండా భిన్నమైందైనా జిల్లాల వారీ మతపరమైన సమాచారాన్ని నిజాయితీగా, సమగ్రంగా తెలుసుకుంటే ముస్లింలు అభివృద్ధిపరంగా ఎక్కడున్నారో స్పష్టమవుతుంది. అప్పుడు రాజకీయ లబ్ధికోసం చేసే ప్రచారాల్లోని అసలు బండారం బయటపడుతుంది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4.9శాతం మాత్రమే ముస్లింలు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో వారి సంఖ్య 3.2శాతం కూడా దాటలేదు. పరిశ్రమలు, భూములు, మంచి ఇళ్లు, శాశ్వత ఉద్యోగాలు, ఉన్నత చదువులు.. ఇలా దేన్ని తీసుకున్నా ముస్లింలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలతో ఇతర ప్రజలకు ఉపాధి పోతున్నదన్నది కూడా పాక్షిక సత్యమే. చౌక కూలికి వచ్చే వాళ్లతో ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న స్థానిక శ్రమజీవులపైనే ఉపాధిపరంగా మొదటి దెబ్బపడుతుంది. సరిహద్దు జిల్లాల్లో ముస్లింలే అధికంగా ఉంటారు కాబట్టి వాళ్లే ప్రధానంగా ప్రభావితం అవుతారు.
మరణాలతో పోల్చితే జననాల రేటు పడిపోతున్న స్థితికి దేశం క్రమేపీ జారుకుంటోంది. ముస్లింల్లో కూడా ఇదే కనపడబోతోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముస్లింల వల్ల భారత్ జనాభా కూర్పుకు వచ్చే ప్రమాదం అసాధ్యంగానే భావించాలి. ధనిక దేశంగా మారకుండానే వృద్ధాప్యదేశంగా భారత్ మారే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలూ మొదలయ్యాయి. అందుకే ముస్లింల జనాభా ఇబ్బందికర స్థాయిలో పెరగటం ఏ రకంగా చూసినా వాస్తవరూపం దాల్చదు. అసలు ప్రమాదం వారిని అన్నివిధాలుగా అభద్రతలోకి నెట్టివేయటంలోనే ఉంది. వాళ్లతో ముడిపడిన ప్రతి సాంస్కృతిక అంశాన్నీ, కళనీ, భాషనీ, సాహిత్యాన్నీ, చరిత్రనీ దేశానికి అరిష్టంగా చూడటమే సమస్యకు కారణమవుతోంది. ఒకప్పుడు జిన్నా హిందువులూ, ముస్లింలూ వేర్వేరు జాతులనీ, భిన్న నాగరికతలకు చెందినవారనీ, వారి మధ్య సహజీవనం పొసగదనీ విస్తృతంగా చేసిన ప్రచారం దేశవిభజనకు దారితీసింది. అలాగే భారతదేశంలో కులాలూ, మతాలూ విడివిడి జాతుల్లా వ్యవహరిస్తాయనీ ఎప్పటికీ ఇక్కడి ప్రజల్లో ఏకదేశ భావన రాదనీ బ్రిటన్ పాలకులూ విశ్వసించారు. ఇప్పటికీ కొన్ని మార్పులతో ఆ ఆలోచనలనే పదిలపరచుకుని రాజకీయాలను చేస్తున్న వారితోనే నిజమైన ముప్పు పొంచి ఉంది. ఈ రాజకీయాలకు మెజారిటీ, మైనారిటీల్లో ఎవరు తీవ్రంగా ప్రభావితమైనా జరిగే నష్టం అపారంగా ఉంటుంది. ఇప్పటికే ఇది కొంత స్పష్టంగా కనపడుతోంది. దేశానికి ఈ విభజన భావజాలమే విపత్తుగా మారుతోంది. దీనికి ఎన్నికల కమిషన్ పరోక్ష పాత్రధారిగా మారుతోందన్న గట్టి ఆరోపణలు రావటం కంటే మన ప్రజాస్వామ్యానికి మరొక విషాదం ఉండదు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు రాజ్యాంగంపై దాడిచేయటమేనని సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ విషాదాన్ని సూచిస్తోన్నవి కావా?
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..