Share News

పటిష్ఠ ప్రజాస్వామ్యానికి విశిష్ట మార్గం ‘సర్’

ABN , Publish Date - Oct 07 , 2026 | 02:14 AM

దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని, తొలగించిన 13.30 కోట్ల పేర్లను...

పటిష్ఠ ప్రజాస్వామ్యానికి విశిష్ట మార్గం ‘సర్’

దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని, తొలగించిన 13.30 కోట్ల పేర్లను ఓటర్ల జాబితాలో పునరుద్ధరించాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్లపై కాంగ్రెస్‌తో సహా ఇండీ కూటమి పక్షాలు ఆందోళనలకు దిగుతున్నాయి. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, పునఃపరిశీలన, నిరంతర నవీకరణ ద్వారా అర్హులైనవారు తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉన్నా, ఇండీ కూటమి పక్షాలు ఎన్నికల సంఘంపై దాడికి దిగడం ద్వారా దేశ ఎన్నికల వ్యవస్థ పునాదుల్ని బలహీనపరుస్తున్నాయని బీజేపీతో సహా ఎన్డీయే పక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి.

మృతిచెందిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారి పేర్లను తొలగించడం ‘సర్’ అసలు ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే... తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో గెలిచే అవకాశం పోతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని, ఎవరెంత వ్యతిరేకించినా చొరబాటుదారులను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం, వారిని బయటకు పంపించడం తథ్యమని... ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చిచెప్పడం అందరికీ తెలిసిందే. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు సర్ ప్రక్రియ గురించి అపోహలు వద్దని చెప్పినా, వివరణ ఇచ్చినా కాంగ్రెస్, ఇతర పక్షాలు మాత్రం దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందంటూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

నిజానికి దశాబ్దాలుగా ఓటర్ల లిస్టులు తప్పులతడకలుగానే ఉన్నాయి. జాబితాల్లోంచి అర్హుల పేర్లు అదృశ్యమై, బోగస్ ఓట్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. మరణించిన వారి ఓట్లను ఎప్పటికప్పుడు తీసేయలేకపోవడం ఒక సమస్య అయితే... ఊరూపేరూ లేని వారు ఓట్లు కలిగి ఉండడం... ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఒక వ్యవస్థాగత లోపం. ప్రస్తుతం ఈ లోపాలను సరిచేసే ప్రయత్నం ఎన్నికల సంఘం చేస్తోంది. తమిళనాడు, కేరళంలలో తమకు అనుకూలంగా ఓటు వస్తే సర్ ప్రక్రియ మంచిదని, బిహార్, బెంగాల్‌లలో ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే అక్కడ సర్ ప్రక్రియ సరైనది కాదని కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపించడం ఎంతవరకు సబబు?


ఒక నివేదిక ప్రకారం 1.8 కోట్ల నుంచి 2.2 కోట్ల మంది వరకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అస్సాం, బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళం వరకు విస్తరించి ఉన్నారని తెలుస్తోంది. మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు దాదాపు 70 వేల మందికి పైగా ఉంటారని అంచనా. వీరు జమ్మూ, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నారని అధికారులే చెపుతున్నారు. వీరంతా దేశంలో చొరబడి, మన వ్యవస్థలోని లోపాలను ఆసరాగా తీసుకుని అక్రమంగా అన్ని ప్రభుత్వ సదుపాయాలూ పొందుతుంటే... కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండిపోవాలా? వారిని దేశం నుంచి బయటకు పంపించే ప్రక్రియ చేపట్టడం నేరమా?

సర్ ప్రక్రియ కొత్తగా చేపట్టింది కాదు. దేశంలో మొట్టమొదటి ఎస్ఐఆర్‌ను నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1952లో నిర్వహించారు. అలాగే 1957లో, 1961లో నెహ్రూ హయాంలోనే ఎస్ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్ హయాంలో కూడా నిర్వహించారు. అప్పట్లో దీనిని ఏ పార్టీ వ్యతిరేకించలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, వామపక్షాలు ఎందుకు గొంతు చించుకుంటున్నాయి?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో భారత ఎన్నికల సంఘం పాత్ర అనిర్వచనీయం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలో సాంకేతిక మార్పులు తీసుకురావడం, నకిలీ ఓట్లను తొలగించడం లాంటి అనేక వినూత్న సంస్కరణలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే ‘సర్‌’ను కూడా చేపట్టింది. అయినా కూడా ఎన్నికల వ్యవస్థలో ఇంకా లోపాలు లేకపోలేదు. ఆ లోపాలను సరిచేసుకుంటూ ముందుకు సాగాలి తప్ప, మొత్తం ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించడం సరికాదు. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలుగా చేసే కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసాన్ని పెంచేలా ఉండాలి.


ఎన్నికల సంఘం కూడా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. ఇప్పుడు చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలి. ఆధార్‌తో ఓటరు కార్డును అనుసంధానం చేయాలి. వలస కార్మికులు, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులు తమ నియోజకవర్గాల్లో భౌతికంగా హాజరై ఓటు వేయాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక కేంద్రాల్లో లేదా డిజిటల్‌గా ఓటు హక్కు వినియోగించుకునే విధానం అమల్లోకి తేవాలి. వలస కార్మికులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఐటీ, ఇండస్ట్రియల్ హబ్స్‌లో మొబైల్ ఎన్‌రోల్‌మెంట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ఓటర్ల జాబితాలో చేరికలు, తీసివేతలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ రియల్ టైం డ్యాష్ బోర్డును తీసుకురావాలి. ఓటర్ రిజిస్ట్రేషన్, తప్పులు సరిదిద్దుకునే ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. జాబితాలను ఏటా థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ చేయించాలి. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన ఉద్యోగులను గుర్తించి, చర్యలు తీసుకోవాలి.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

ఈ వార్తలు కూడా చదవండి

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు..

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Updated Date - Oct 07 , 2026 | 02:14 AM