సామాజిక, ధార్మిక విప్లవకారుడు శివాజీ
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:39 AM
ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే ఓ గొప్ప పోరాట యోధుడు గుర్తుకువస్తారు. శక్తిమంతులైన మొగలాయి రాజులను తన యుద్ధ తంత్రాలతో వణికించిన అద్వితీయమైన యుద్ధ నైపుణ్యమే గుర్తుకొస్తుంది. అయితే, ఆయన భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని...
ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే ఓ గొప్ప పోరాట యోధుడు గుర్తుకువస్తారు. శక్తిమంతులైన మొగలాయి రాజులను తన యుద్ధ తంత్రాలతో వణికించిన అద్వితీయమైన యుద్ధ నైపుణ్యమే గుర్తుకొస్తుంది. అయితే, ఆయన భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన ఓ గొప్ప విప్లవకారుడిగా కూడా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన పాలనలో నెలకొన్న సామాజిక సమానత్వం, రైతు సంక్షేమం, పారదర్శకతను మహాత్మా జ్యోతిబాఫూలే, డా. బి.ఆర్.అంబేడ్కర్ వంటి మహనీయులు అత్యంత లోతుగా విశ్లేషించారు. శివాజీ మహారాజ్‌లోని బహుముఖ ప్రజ్ఞ, సామాజిక దృక్పథం నేటికీ ఆదర్శంగా ఉంది. చరిత్రను కేవలం యుద్ధాల కోణంలో చూస్తే శివాజీ ఒక వీరుడు. సామాజిక న్యాయం కోణంలో చూస్తే ఆయన ఒక యుగపురుషుడు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, రైతుల శ్రేయస్సు కోసం ఆయన నిర్మించిన ‘స్వరాజ్యం’ నేటి ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాది.
19వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ అసలు చరిత్ర మరుగున పడిపోతున్న తరుణంలో, మహాత్మా జ్యోతిబాఫూలే దానిని వెలుగులోకి తెచ్చారు. శివాజీ వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మొదటిసారిగా జయంత్యుత్సవాలను నిర్వహించారు. రైతులను దోపిడీ చేసే దళారులను (జమీందార్లు) శివాజీ నిర్మూలించారు. వారికి ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వ విధి విధానాలు రూపొందించి పాలకులకు, దుక్కి దున్నే వారికి అనుసంధానంగా నిలిచారు. రైతులకు విత్తనాలు, ఎద్దులు, రుణాలు అందించారు. కరువు సమయంలో పన్నులను నిలిపివేశారు. అలాగే వ్యవసాయ కార్మికులను, రైతులను ఏకం చేసి, భూస్వామ్య వ్యవస్థను (వతందారీ) వ్యతిరేకించి, సామాన్యుల రాజ్యాన్ని శివాజీ స్థాపించారని ఫూలే విశ్లేషించారు.
శివాజీని ఒక ఆదర్శ పాలకుడిగా, అణగారిన వర్గాల విముక్తి ప్రదాతగా బాబాసాహెబ్ అంబేడ్కర్ గౌరవించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా 1927లో జరిగిన చరిత్రాత్మక మహద్ సత్యాగ్రహ వేదికపై శివాజీ చిత్రపటాన్ని ఉంచడం ద్వారా, ఈ పోరాటం శివాజీ ఆశయాల కొనసాగింపు అని అంబేడ్కర్ చాటి చెప్పారు. తన ‘జనతా’ పత్రికలో (1930–40 మధ్య) అంబేడ్కర్ రాసిన వ్యాసాల ప్రకారం శివాజీ సైన్యంలో కులవివక్షకు తావు లేదు. మహర్, మాంగ్ వంటి అణగారిన వర్గాలవారు సైన్యంలో, కోటల రక్షణలో కీలక బాధ్యతలు నిర్వహించారని అంబేడ్కర్ ఉదాహరణలతో వివరించారు. సైన్యం కోసం కఠినమైన నైతిక నియమాలను శివాజీ ఏర్పాటు చేశారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించేటట్టు నిబంధనలు రూపొందించారు. అవినీతికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైతులపై భారం పడకుండా శివాజీ అమలుచేసే పన్నుల విధానం ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాది అని అంబేడ్కర్ భావించారు.
అత్యంత శక్తిమంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని శివాజీ ఎదుర్కొన్న తీరు ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అద్భుతం. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా, భౌగోళిక పరిస్థితులను (కొండలు, అడవులు) ఆయుధాలుగా మార్చుకుని గెరిల్లా యుద్ధ తంత్రంతో మెరుపు దాడులు చేయడం ద్వారా మొఘల్ సైన్యాన్ని బెంబేలెత్తించారు. సుమారు 300 కోటలను నిర్మించి, వాటిని రక్షణ కవచాలుగా మార్చారు. మొఘలుల ఆర్థిక మూలమైన సూరత్ నగరాన్ని రెండుసార్లు ముట్టడించి, ఆ సంపదను స్వరాజ్య నిర్మాణానికి ఉపయోగించారు. విదేశీయుల ముప్పును ముందుగానే పసిగట్టిన శివాజీ, బలమైన నౌకాదళాన్ని నిర్మించి భారత తీర ప్రాంతాన్ని రక్షించారు.
ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి పర్షియన్ భాషకు బదులుగా మరాఠీ, సంస్కృతం వాడకాన్ని శివాజీ ప్రోత్సహించారు. శత్రువుల మహిళలను కూడా తల్లులుగా గౌరవించిన ఉన్నత సంస్కృతి శివాజీది. 1677లో శివాజీ మహారాజ్ హైదరాబాద్‌ను సందర్శించి అబుల్ హసన్ తానాషాతో సమావేశమయ్యారు. ఇది ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం. పుట్టుక కంటే ప్రతిభ ఆధారంగా వ్యక్తులను ప్రోత్సహించడం, ప్రతిభకు ఉద్యోగ అవకాశాలను అందించడం ద్వారా శివాజీ కుల అడ్డంకులను బద్దలుకొట్టారు. ఆయన పరిపాలన నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండేది. మూర్తీభవించిన హిందూ ధర్మానికి, సంస్కృతికి శివాజీ మహారాజ్ ఒక గొప్ప ప్రతీక.
సామాజిక పురోగతిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని అర్థం చేసుకున్న శివాజీ అభ్యాసం, జ్ఞాన వ్యాప్తిని ప్రోత్సహించారు. విద్యా సంస్థలను స్థాపించారు, పండితులను పోషించారు, మేధో వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలలో సమాజాల చురుకైన ప్రమేయాన్ని శివాజీ విశ్వసించారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. తద్వారా పౌరులలో యాజమాన్యం, బాధ్యతాభావాన్ని పెంపొందించారు.
టి.ఎన్.వంశతిలక్
సామాజిక సమరసత వేదిక
(నేడు శివాజీ మహారాజ్ జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి...
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత
మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..