సుందరాచారిని స్మరించుకుందాం
ABN , Publish Date - Apr 08 , 2026 | 01:59 AM
‘మా తెలుగుతల్లికి మల్లె పూదండ’ గీతం 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార గీతంగా ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఇది ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యింది. సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతిలో...
‘మా తెలుగుతల్లికి మల్లె పూదండ’ గీతం 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార గీతంగా ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఇది ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యింది. సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతిలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు. ప్రాచీన సంప్రదాయాలు పాటించకపోవడంతో ఆయన తండ్రి తరచుగా కోప్పడేవారు. దాంతో ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయారు. సుందరాచారి కవిత్వాన్ని ప్రచారం చేసింది వై.కె.వి.ఎన్.ఆచార్య. సుందరాచారి ‘తేటగీతి’ పద్యానికి ప్రసిద్ధుడు. బాపూజీ మరణాన్ని ‘బలిదానం’ పేరుతో సుందరాచారి ఒక గేయం రాసారు. భారతదేశంలో జన్మించిన అనేకమంది కవులు, గొప్ప వ్యక్తుల గురించి ‘మా దేశం మా దేశం మహ మంచిదిరా మా దేశం’ అనే గేయంలో ప్రస్తావించారు.
సుందరాచారి 1942లో దీనబంధు అనే సినిమాకి ‘మా తెలుగుతల్లికి మల్లె పూదండ’ గీతం రాశారు. దీనిని ఆ సినిమాలో పెట్టలేదు. ఈ గీతాన్ని ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమారి గానం చేశారు. 1975లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ఎంపికైంది. బుద్ధ గీత, సుందర రామాయణం, సుందర భారతం వంటి రచనలు కూడా ఆయన చేశారు. ఆయనకి ప్రసన్నకవి, సుందరకవి అనే బిరుదులున్నాయి. ‘ఏళ్ళు మీరిన ముదుసలి నీళ్లు త్రావి/ ప్రస్తు గొలిచిన యస్తుల పంజరమ్ము/ పేదలకు పేద తిరిపాల బిచ్చగాడు/ మాలలకి మాల మా గాంధీ జోలీ యోలా?’ అంటూ గాడ్సేని నిలదీసి అడిగారు సుందరాచారి. 1977 ఏప్రిల్ 8న ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కవి పింగళి లక్ష్మీకాంతం అన్నట్లు ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అనే పాట రాసి తెలుగుతల్లిని, తెలుగు కవిత్వాన్ని వాసింప చేసిన కవికి, ఏటేటా, ఊరూర సన్మానాలు జరగాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలి.
యమ్. రామ్‌ప్రదీప్
(నేడు శంకరంబాడి సుందరాచారి వర్ధంతి)
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్