వేరు కథ అవసరమే!
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:30 AM
తె లంగాణ కథ పేరిట మరో సంకలనం ధరణికోట రమేష్ కుమార్ సంపాదకత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో వెలు వడింది. తెలంగాణ కథకులు రాసిన ఈ పదకొండు కథల సంకలనం ‘కందిలి’ పేరుతో...
తె లంగాణ కథ పేరిట మరో సంకలనం ధరణికోట రమేష్ కుమార్ సంపాదకత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో వెలు వడింది. తెలంగాణ కథకులు రాసిన ఈ పదకొండు కథల సంకలనం ‘కందిలి’ పేరుతో వచ్చింది. ఈ సందర్భంగా పుస్తక సంపాదకుడితో ముఖాముఖి.
విడిపోయాం, వేర్వేరుగా పాలించుకుంటున్నాం-. ‘తెలంగాణ కథ’ అనే వేర్పాటు ఇంకా అవసరమా?
రాజకీయంగా విభజన జరిగిపోయినా సాంస్కృతికంగా ఆధిపత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణకు తనదైన ప్రత్యేకత ఉంది. స్థానిక భాష, సాంప్రదాయాలు, సమస్యలు కథల్లో ప్రతిబింబిస్తాయి. ఈ స్వరమే తెలంగాణ కథగా నిలుస్తుంది. కాబట్టి వేరు కథ అవసరమే, అది భిన్నత్వాన్ని కాపాడుతుంది. ప్రస్తుతం వస్తున్న ఉమ్మడి సంకలనాలలో తెలంగాణాకు సరైన వాటా లభించకపోవడం బహుశా ఇంకో ప్రధాన కారణం.
విభజన అనంతరం తెలంగాణ కథకులకు ఇతివృత్తాల కొరత ఏర్పడినట్టుంది?
ఇది కొంత మేరకు నిజమే కావచ్చు. కానీ విభజన తరువాత కొత్త సవాళ్లు, కొత్త కలలు, పరిపాలనానుభవాలు ముందుకు వచ్చాయి. ఇవన్నీ రచయితలకు పచ్చి పదార్థం అవుతున్నాయి. ఆ కొరత లోనే కొత్త విషయాలు వెతుక్కుంటున్నాడు కథకుడు. కొరత పాక్షికమేననడానికి మా కందీలు సాక్ష్యం.
తెలంగాణ కథా సంకలనాలు ఇప్పటికే చాలా వస్తున్నాయి. ఇంకొకటి ఎందుకు?
మిగతా సంకలనాలలో వేరే వేరే చోట్ల అచ్చయిన కథలను తీసుకుంటున్నారు. మేం మా కోసమే ప్రత్యేకంగా రాయించుకుని సంకలనం వేస్తున్నాం. ప్రతి సంకలనం కాలానికి అద్దం వంటిది. పాతవి ఒక దశను చూపిస్తే, కొత్తవి మారిన వాస్తవాలను పట్టుకుంటాయి. కొత్త రచయితలు, కొత్త శైలులు ప్రదర్శించడానికి సంకలనాలు వేదిక అవుతాయి. అందుకే మరొక సంకలనం అవసరమే. ఇదే కాదు ఇంకా ఇంకా సంకలనాలు రావాలి.
కథ అంటే కథే కదా. ఆంధ్ర కథ, తెలంగాణ కథ అని వేర్వేరుగా ఉంటాయా?
ఉంటాయి. కథను ఉపరితలం నుంచి చూస్తే అందరికీ ఒకటే కానీ అనుభవాలు, భాషా శైలి ప్రాంతానుసారం వేరవుతాయి. ఆంధ్రలోని సామాజిక సమస్యలు ఒకవైపు, తెలంగాణలోని బతుకుబాట్లు మరోవైపు కనిపిస్తాయి. ఈ విభిన్నతే కథను ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి రెండు వేర్వేరుగా గుర్తింపు పొందుతాయి.
‘కథా తెలంగాణం’ పేరుతో మీరు చేస్తున్న ప్రయత్నం లక్ష్యం ఏమిటి?
‘కథా తెలంగాణం’ ఉద్దేశం తెలంగాణ జీవన వాస్తవాలు, భాషా వైవిధ్యాన్ని సాహిత్యంలో స్థిరపరచడం. గ్రామీణ, పట్టణ సమస్యలు, సంస్కృతి, చరిత్ర కథల ద్వారా ప్రతిబింబించాలనేది దీని ధ్యేయం. అంతేకాకుండా కొత్త, పాత రచయితలకు ఇంకొక వేదిక కల్పించడం, తెలంగాణ కథని కాపాడుకోవడం, కొత్త ఊపిరిలూదడం మా లక్ష్యం.
ఇంటర్వ్యూ : జయశ్రీ మువ్వా
90527 33822
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు
మీ బ్రెయిన్ రేంజ్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 21 సెకెన్లలో కనిపెట్టండి