చమురు విపత్తు
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:04 AM
రష్యా, ఇరాన్‌ల నుంచి ముడిచమురు దిగుమతికి ఇచ్చిన ఆ వెసులుబాటును ఇకపై కొనసాగించేది లేదని అమెరికా ప్రకటించింది. తాను విధించిన ఆంక్షలమీద తానే ఇచ్చిన మినహాయింపులను...
రష్యా, ఇరాన్‌ల నుంచి ముడిచమురు దిగుమతికి ఇచ్చిన ఆ వెసులుబాటును ఇకపై కొనసాగించేది లేదని అమెరికా ప్రకటించింది. తాను విధించిన ఆంక్షలమీద తానే ఇచ్చిన మినహాయింపులను మళ్ళీ తానే రద్దుచేయబోతోంది. అమెరికా నిర్ణయం మిగతా దేశాలతో పాటు, ప్రధానంగా దిగుమతుల మీదే ఆధారపడిన భారత్‌పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. యుద్ధంతో తాను సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అమెరికా ఇలా కొత్త విపత్తుకు తెరదీస్తోంది. గత నెలలో ట్రంప్ మినహాయింపులు ఇచ్చినందుకు ఎగిరిగంతేసి, రష్యా నుంచి భారీ చమురు దిగుమతులతో ఈ యుద్ధకాలాన్ని జాగ్రత్తగా నెట్టుకొచ్చిన మనకు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఇంధన ధరలను, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలిగిన మనకు ఇకపై డిమాండ్‌కు తగినంత సరఫరాలు లేకపోతే ఆ ప్రభావం నిత్యావసరాల మీద తీవ్రంగా ఉంటుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారంటూ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకుండా భారత్‌ను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు, తాను ఆరంభించిన మరో యుద్ధం కారణంగా తాత్కాలిక వెసులుబాటు ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ తలుపులు మూసేస్తున్నారు.
ఇరాన్ మీద మరింత ఒత్తిడిపెంచడం ఈ నిర్ణయానికి కారణం కావచ్చును కానీ, ఆంక్షల మినహాయింపు నుంచి భారతదేశం బాగానే లబ్ధిపొందింది. భారత రిఫైనరీలు ముప్పై మిలియన్ బ్యారెళ్ళ చమురు దిగుమతి చేసుకున్నాయి. దాదాపు ఏడేళ్ళ తరువాత ఇరాన్ నుంచి ముడిచమురుతో భారీ ట్యాంకర్లు భారత ఓడరేవులకు చేరుకున్న దృశ్యాలు కూడా చూశాం. 2019 మే నెలలో ఆంక్షలు కఠినతరం కాకముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా దాదాపు పన్నెండుశాతం. అమెరికా–ఇరాన్ మలి విడత చర్చలకు మార్గం సుగమం చేయడానికి టెహ్రాన్‌లో మళ్ళీ కాలూనిన పాకిస్థాన్ ఫీల్డ్‌మార్షల్ ఏమి ఉద్ధరిస్తారో తెలియదు కానీ, అమెరికా నిర్ణయం భారత్ ఆర్థికవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపబోతోంది. తొలివిడత చర్చలు విఫలం కావడంతో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించాలన్న ట్రంప్ ప్రయత్నం మళ్ళీ ఉద్రిక్తతలను పెంచడమే కాక, పరస్పరాధారిత ప్రపంచ ఆర్థికవ్యవస్థకు అనేక సమస్యలు తెచ్చింది. చైనా హెచ్చరికలతో ఘర్షణ విస్తరిస్తుందన్న అనుమానాలు, భయాలూ మరోపక్క ఉండనే ఉన్నాయి. అమెరికా శక్తిసామర్థ్యాలనీ, ఓర్పునీ ఎంతకాలమైనా పరీక్షించగలిగే శక్తియుక్తులు, ఆత్మస్థైర్యం ఇరాన్‌కు ఉండవచ్చునేమో కానీ, యుద్ధం ముగిసేంతవరకూ ఇంధనం కొరతను తట్టుకొని నిలబడగలిగే శక్తి మిగతాదేశాలకు ఉండదు. నలభైనిముషాల పాటు డోనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి, ఆయనను మంచి మిత్రుడుగా అభివర్ణించి, నూటనలభైకోట్లమంది భారతీయుల పక్షాన ఆయనకు నరేంద్రమోదీ ప్రేమసందేశం పంపిన వెంటనే, అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని మళ్ళీ ఇంధన సంక్షోభంలోకి నెట్టివేసే నిర్ణయం తీసుకున్నారు. మనదేశానికి చమురు మోసుకొస్తున్న నలభై ట్యాంకర్లు ఇంకా హార్ముజ్‌లో చిక్కుబడివున్న సంగతి తెలిసిందే.
ఇరాన్‌ను సులువుగా లొంగదీయగలననుకొని యుద్ధరంగంలోకి దిగిన ట్రంప్‌కు, అది ఆయుధాలకు లొంగకుండా, జలసంధిని గుప్పిట్లో పెట్టుకుంటూ యుద్ధం ప్రభావాలను ప్రపంచమంతటికీ చుట్టేయడంతో ఏమీ పాలుపోలేదు. దీనితో పాతశత్రువు రష్యా నుంచీ, తాను యుద్ధం చేస్తున్న ఇరాన్ నుంచీ మళ్ళీ చమురు దిగుమతులు చేసుకోనిచ్చాడు. అమెరికా హెచ్చరికలు, అదనపు సుంకాల దెబ్బతో గత ఏడాది నవంబరులో ఆగిపోయిన రష్యా ముడిచమురు దిగుమతులు మళ్ళీ మార్చిలో మొదలై, ఒక్కనెలలోనే రెట్టింపు జరిగాయి. రాబోయే కాలంలో మనం ఎంత భారీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నా కూడా, లోటు తీవ్రంగా ఎదుర్కోబోతున్నామని దీని అర్థం. రిజర్వుబ్యాంకు ప్రమాణాల రీత్యా ద్రవ్యోల్బణం ప్రమాదస్థాయిలో లేకున్నా, మార్చినాటికి అది ఏడాది గరిష్ఠస్థాయిని చేరింది. రవాణా, కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరల వేడి సామాన్యుడిని ఇప్పటికే తాకింది. ప్రభుత్వం ఎన్ని చెప్పినా జనం గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు విక్రయించే చమురుమీద లక్షన్నర కోట్ల ఎక్సైజ్ సుంకాన్ని వదులుకోవడం ద్వారా బంకుల దగ్గర ధరలు భగ్గుమనకుండా మోదీ ప్రభుత్వం జాగ్రత్తపడింది. అయితే, ఇదంతా అసెంబ్లీ ఎన్నికల మహత్యమే కనుక, ఏప్రిల్ 29న పోలింగ్ ముగిసిన వెంటనే గతంలో మాదిరిగా జనానికి వాతలు తప్పవు. దీనికి తోడు ట్రంప్ మహాశయుడి సరికొత్త నిర్ణయం పర్యవసానాలను ఊహించడానికే భయంగా ఉంది.
ఇవీ చదవండి:
మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ
డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి