Share News

ఉచితమే సముచితం

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:43 AM

దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు మారుపేరుగా మారిన యూపీఐ లావాదేవీల విషయంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన వివరణ సామాన్యుల అనుమానాలనూ భయాలనూ పూర్తిగా తొలగించలేకపోయింది....

ఉచితమే సముచితం

దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు మారుపేరుగా మారిన యూపీఐ లావాదేవీల విషయంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన వివరణ సామాన్యుల అనుమానాలనూ భయాలనూ పూర్తిగా తొలగించలేకపోయింది. ‘పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌–2007’ను సవరించి, యూపీఐ లావాదేవీలపై చార్జీలు వసూలు చేసుకొనే అధికారం బ్యాంకులకు, పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లకు కేంద్రం కట్టబెట్టిన తరువాత సర్వత్రా విమర్శలు రేగడంతో, వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలన్నీ ఎప్పటిలాగానే ఉచితంగానే ఉంటాయని, వినియోగదారులనుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్‌ చార్జీలు వసూలు చేయబోమంటూ కేంద్ర ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది. వ్యాపారలావాదేవీల్లో, అందునా కొన్ని పరిమిత లావాదేవీల్లో మాత్రమే చిన్న మొత్తంలో చార్జీలు విధించే అవకాశం ఉందని, ఇది కూడా భవిష్యత్తులోనేనని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకూ యూపీఐ లావాదేవీలకు లేని మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)ను రేపటిరోజుల్లో నిర్దిష్ట పరిమితి దాటిన కొన్నింటిపై అమలు చేసినప్పటికీ, అది నామమాత్రంగానే ఉంటుంది తప్ప ప్రజలకు భారంగా పరిణమించదన్నది ఆ వివరణ సారాంశం. ఈ ప్రకటనను స్వాగతించవలసిందే కానీ, ఒక పద్ధతి ప్రకారం డిజిటల్‌ పేమెంట్స్‌ను అదేపనిగా ప్రోత్సహించి, ప్రజలకు వాటిని పూర్తిగా అలవాటు చేసిన తరువాత, ఇప్పుడు చార్జీల వసూళ్ళకు ప్రభుత్వం గేట్లు తెరిచిందన్న విమర్శ కొట్టిపారేయలేనిది.

ప్రజలసొమ్ముతో కట్టిన ఒక హైవేమీద పదేళ్ళుగా జనం అటూ ఇటూ ఉచితంగా తిరుగుతూంటే, ఎప్పటిలాగానే ఆ మార్గాన ప్రయాణం ఉచితమే కానీ, ఏవో కొన్ని వాహనాలు, కొందరు వ్యక్తులనుంచి మాత్రం ఇకపై నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే? ఒకసారి రోడ్డు చార్జీలంటూ వసూలు మొదలైతే, ఆ ప్రక్రియ ఎప్పటికీ ఆ కొందరికే పరిమితమవుతుందని, ఇతరులకు విస్తరించదని ఎలా నమ్మాలి? ఇప్పుడు ఇచ్చిన వెసులుబాటుతో భవిష్యత్తులో ఎండీఆర్‌ చార్జీలు చెల్లించబోయేది కొందరు వ్యాపారస్తులే కావచ్చు, కొన్ని లావాదేవీలకే అవి వర్తించవచ్చు. కానీ, అది అంతం కాదనీ, అరంభమేనన్నది వాస్తవం. మొన్న జూన్‌ నాటికి యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై యాభైఐదుకోట్ల పై చిలుకు వినియోగదారులు నమోదైనారు. గత ఆర్థికసంవత్సరంలో 314లక్షలకోట్ల విలువైన 24వేలకోట్ల లావాదేవీలు జరిగాయి. మే ఒక్కనెలలోనే ముప్పైలక్షలకోట్ల సొమ్ము యూపీఐ ద్వారా చేతులు మారింది. ఇంత భారీస్థాయిలో వ్యవహారాలు నడుస్తున్నప్పుడు, బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, ఫిన్‌టెక్‌ సంస్థలు తమ ఆదాయాలు, మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చుల గురించి ప్రశ్నించడం, ఈ వ్యవస్థను సవ్యంగా నడిపించడానికీ, బలంగా పరుగులెత్తించడానికీ కొంత సొమ్ము డిమాండ్‌ చేయడం సహజం. యూపీఐ విధానం తన కాళ్ళమీద తాను నిలదొక్కుకొని, సుస్థిరంగా సమర్థవంతంగా కొనసాగడానికే ఈ సరికొత్త చర్య చేపట్టినట్టు ప్రభుత్వమూ చెబుతోంది కనుక, ఏకమాటగా మొదలైన ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగదు.


బ్యాంకులు, పేమెంట్‌ ప్రాసెసింగ్‌ సంస్థలూ ఒత్తిడి తెచ్చిన మేరకు వార్షికటర్నోవర్‌ అధికంగా ఉన్న వ్యాపార లావాదేవీలపై ఒక చిన్నస్థాయి ఫీజు వసూలు చేయడంతో ఇది సమీప భవిష్యత్తులోనే మొదలవుతుంది. చార్జీలవసూలుకు ఇంతకాలం లేని అవకాశాన్ని కల్పించి, ఆదాయం పెంచుకొనే వీలు దక్కాక, విస్తరణకు ఇక అడ్డుండదు. అన్నింటికీ మించి, తమపై రుద్దే ఆ చార్జీలను వ్యాపారులు కుక్కినపేనుల్లాగా భరిస్తారని ఎవరూ నమ్మరు. ప్రత్యక్షంగా సాధ్యపడకపోయినా, పరోక్షంగా, ఇతరత్రా రూపాల్లో ఆ భారాన్ని పైనుంచి దిగువవరకూ దించి, అంతిమంగా వినియోగదారుకు బదలాయించకుండా ప్రభుత్వం నియంత్రణలు విధించడం కూడా సాధ్యమయ్యే పనికాదు. యూపీఐ లావాదేవీలు పెరిగాక, సిబ్బందిని తగ్గించుకోవడం సహా బ్యాంకులు ఎన్నిరకాలుగా లబ్ధిపొందాయో తెలియనిదేమీ కాదు. పైగా, సర్వీసు చార్జీలు, యూజర్‌చార్జీలు, పెనాల్టీలంటూ సవాలక్ష పేర్లతో అవి తమ ఖాతాదారులనుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్ము తక్కువేమీ కాదు. వీసా, మాస్టర్‌కార్డ్‌ వంటివి ఒకటినుంచి మూడుశాతం వరకూ ఎండీఆర్‌ వసూలు చేస్తూంటే, యూపీఐ పూర్తి ఉచితంగా సాగడం విదేశీ సంస్థలకు, వాటి ప్రభుత్వాలకు నచ్చడం లేదట. యూపీఐను పెంచి పోషించి, ఆర్థికంగా బాగుపడిన కేంద్రప్రభుత్వమే, దాని నిర్వహణఖర్చును పూర్తిగా భరించి, ఎప్పటిలాగానే ఉచితంగా కొనసాగించడం మంచిది. డిజిటల్‌ లావాదేవీలకు అలవాటుపడుతున్న జనాన్ని మళ్ళీ జేబులో నగదువైపు మళ్ళించేలా చేయటం సరికాదు.

ఈ వార్తలు కూడా చదవండి

ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు బిగుస్తోన్న ఉచ్చు

Updated Date - Aug 11 , 2026 | 01:43 AM