ఎండల్లో వానలు..!
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:05 AM
ఈ మండే ఎండల కాలంలో ఓ మూడునాలుగు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందనీ, జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఈదురుగాలులకు...
ఈ మండే ఎండల కాలంలో ఓ మూడునాలుగు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందనీ, జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఈదురుగాలులకు, అకాలవర్షాలకు రైతులు ఇప్పటికే పలు రకాల పంట నష్టంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. వస్తూవస్తూనే మండిపోయే ఎండలతో, మార్చి మొదటివారంలోనే ముప్పైఐదు డిగ్రీలను తాకిన వాతావరణం, అంతలోనే చల్లబడి, జల్లున కురిసి, తిరిగి మళ్ళీ భానుడు భగ్గుమనే రోజులను చూడబోతున్నాం. ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వస్తున్న మార్పులు ఆహారభద్రతని సవాలు చేస్తున్నాయి, సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
అధిక ఉష్ణోగ్రతల మధ్య ఈ అసాధారణ వర్షాలు ఈ ఏడాది ఆహారోత్పత్తుల విషయంలో ఒక హెచ్చరిక. వడగాలులకు దేశం సిద్ధంగా ఉండాలని వాతావరణశాఖ ముందుగానే చెప్పింది. చలి నుంచి నేరుగా అతివేడి వాతావరణంలోకి దేశం ప్రవేశించింది. వసంతరుతువు మాయమైందని, చలికాలం ఎండాకాలంలో కలిసిపోతోందని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే కష్టకాలానికి కొన్ని ముందస్తు సూచనలు కూడా ఇప్పటికే ఉన్నాయి. శీతాకాలంలో తగినంత మంచు కురవక హిమాలయ సానువులు పొడిబారిపోవడంతో, సాధారణంగా ఉండాల్సినకంటే ఎక్కువ ఉష్ణోగ్రతల నమోదువల్ల ఆపిల్, పియర్ వంటి పండ్ల దిగుబడి ప్రభావితమవుతుందని వార్తలు వింటున్నాం. ఇక, ఉత్తర, మధ్యభారతంలోని మైదాన ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ళతో పలు పంటలు దెబ్బతిన్న సంగతీ తెలిసిందే. దేశవ్యాప్తంగా, మామిడి సాగు ప్రాంతాలన్నీ గాలి దుమారానికి ఈ మారు బాగా దొరికిపోయాయి. అస్తవ్యస్త వర్షపాతం మామిడి, జీడి రైతులను అధికంగా దెబ్బతీస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా, నాలుగేళ్ళుగా గోధుమ ఉత్పత్తి మందగించి, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో దాదాపు ఐదోవంతు ఉత్పత్తి దెబ్బతింటున్నది. ఆహారసంక్షోభాన్ని నివారించేందుకు గోధుమ ఎగుమతులను ప్రభుత్వం నిషేధించవలసి వచ్చింది. ఈ ఏడాది మార్చి తొలిరోజుల్లో విపరీతమైన వేడిమి కారణంగా పంజాబ్‌లో గోధుమ గింజలు రంగుమారితే, మార్చి 15న ఒక్కసారిగా నాలుగురెట్ల అధికవర్షంతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పంట నేలకరుచుకుంది.
దేశంలోని అత్యధిక ప్రాంతాలు అస్థిరమైన, అనూహ్యమైన వాతావరణ పరిస్థితులూ, పంటనష్టాలు చవిచూస్తూండగా, పసిఫిక్ మహాసముద్రంలో సూపర్ ఎల్‌నినో ఏర్పడవచ్చునన్న శాస్త్రవేత్తల హెచ్చరిక మరింత భయపెడుతోంది. సాదాసీదా ఎల్‌నినోలే మనిషిని నిలువునా మాడ్చేస్తే, ఈ సూపర్ ఎల్‌నినో సృష్టించబోయే విధ్వంసం ఊహకు అందనిది. ఇప్పటికే గురితప్పిన, గతిమారిన వాతావరణాన్ని ఇది మరింత నాశనం చేయవచ్చు. బలమైన వడగాలులు, కరువుతో అల్లాడిపోయే పాడుకాలానికి మనం సంసిద్ధం కావాల్సి ఉంది. విత్తునాటడం నుంచి, నీటిసదుపాయాలు, తెగుళ్ళనివారణ, ఎరువుల సరఫరాలు ఇత్యాది ప్రతీ దశలోనూ రైతుకు అండగా ఉండటం కోసం వ్యవస్థలను సంస్కరించాలి, సంసిద్ధం చేయాలి. ప్రధాన ఆహారపంటల సేకరణ, నిల్వల ప్రక్రియలు చురుకుగా సాగాలి.
ప్రతీ ఏటా మండే ఎండల గురించి భయపడుతున్నప్పటికీ, ఈ ఏడాది ఎదుర్కోవాల్సిన విపత్తు మరింత తీవ్రమైనది. ఇరాన్ యుద్ధం సృష్టించిన నష్టాలకు తోడుగా, అసాధారణ వేడిమి తెచ్చిపెడుతున్న కష్టాలతో పోరాడాల్సి ఉంది. ఉత్పాదకతలో లోటుకు తోడు, భయంకర ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాలి. ఎండకు తిరిగినవారు, తిరగనివారు కూడా బాధితులేనని, అధికవేడిమి కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చి, సాధారణపనులు, ఆటపాటలు తగ్గి, ఇళ్ళకే పరిమితం కావడం వల్ల ఒత్తిడి, ఆందోళన హెచ్చుతాయని, గుండెజబ్బులు, రక్తపోటు వంటివి అధికమవుతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. రోగుల, వృద్ధుల అకాలమరణాలు అదనంగా అనేకరెట్లు సంభవించవచ్చు. వాతావరణమార్పు గురించి మాట్లాడితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌కు నచ్చదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటిరోజునే ఆయన పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ శిలాజఇంధనాలను తవ్విపోసే పనిలో ఉన్నాడు కనుక, భూగోళం వేడెక్కడం వంటి హెచ్చరికలకు చెవొగ్గడు. కనీసం మిగతాదేశాలైనా మీథేన్ నియంత్రణ విషయంలో చెప్పుకున్న సంకల్పాన్ని గట్టిగా అమలుచేస్తే భూతాపాన్ని కొంతమేరకైనా నియంత్రించగలం, రాబోయే తరాల మనుగడకు హామీ ఇవ్వగలం.
ఇవి కూడా చదవండి..
5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్