Share News

చర్చలు.. షరతులు

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:04 AM

యుద్ధం ముగించే విషయంలో అద్భుత ప్రగతి కనిపిస్తోందన్న అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు ఎడాపెడా వ్యాఖ్యలు చేసేస్తున్నారు. హోర్ముజ్‌ జలసంధి విముక్తి విషయంలోనూ అడుగులు...

చర్చలు.. షరతులు

యుద్ధం ముగించే విషయంలో అద్భుత ప్రగతి కనిపిస్తోందన్న అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు ఎడాపెడా వ్యాఖ్యలు చేసేస్తున్నారు. హోర్ముజ్‌ జలసంధి విముక్తి విషయంలోనూ అడుగులు వేగంగా పడుతున్నట్టు సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ఇరాన్‌తో ఒప్పందానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు చెప్పడమే కాదు, ఆ దేశంలోని అతిముఖ్యమైనవారితోనే మాటలు సాగుతున్నాయని కూడా ప్రకటించారు. యుద్ధంలో గెలిచేశామన్న తరహాలో ఆయన మాట్లాడటం కొత్తేమీ కాదు కానీ, యుద్ధం త్వరగా ముగియడం తన రక్షణమంత్రిని నిరాశపరిచిందని కూడా ఆయన అన్నారు. నువ్వేగా యుద్ధం చేయమన్నది అంటూ అతడిని బలిపశువుచేయడానికి మొన్ననే ప్రయత్నించిన ట్రంప్‌, ఈ వ్యాఖ్యతో తన రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌ను ఓ యుద్ధోన్మాదిలాగా చిత్రీకరించి, మొత్తం పాపాన్ని అతనికే కట్టబెట్టేశారు. ఇరాన్‌తో చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగమంత్రి మార్కో రుబియో, ట్రంప్‌ అల్లుడు కుష్నర్‌, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌లు పాల్గొంటారన్న వార్తలు కూడా చర్చలకు ట్రంప్‌ అమిత ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపించడానికి ఉపకరిస్తుంది.

ట్రంప్‌ ఎన్ని చెబుతున్నా, ఇరాన్‌ మాత్రం తాను యుద్ధంలో తగ్గేది లేదనే అంటోంది. ట్రూత్‌సోషల్‌ వేదికగా ట్రంప్‌ చర్చల ప్రస్తావన తెచ్చింది మొదలు పరిణామాలు ఆసక్తిగా ఉన్నాయి. యుద్ధం ముగించి, చర్చలకు దిగుదామని అమెరికా తన మిత్రదేశాల ద్వారా ఏవో ప్రతిపాదనలు పంపిదని ఇరాన్‌ విదేశాంగశాఖ అన్నందుకు, అబ్బే, నేను కాదు, ఒప్పందం చేసుకుందామని ముందుగా అన్నది వాళ్ళే అని ట్రంప్‌ అన్నారు. యుద్ధం నువ్వానేనా అన్నరీతిలో సాగుతున్నప్పుడు, ఎవరు ముందు రాజీకి వచ్చారన్నది నిర్థారించడం కష్టం. అయితే, రంగంలోకి దిగిన మధ్యవర్తులను బట్టి, వారు ఎవరి మనోభిప్రాయాలకు అనుగుణంగా రంగంలోకి దిగివుంటారన్నది ఊహించవచ్చు. పాకిస్థాన్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ చేసిన ప్రతిపాదనను ట్రంప్‌ రీట్వీట్‌ చేసి వదిలేసినప్పటికీ విషయం అందరికీ అర్థమైంది. తుర్కియే, ఈజిప్ట్‌, ఓమన్‌ కూడా పాత్రధారులుగా ఉన్నప్పటికీ, యుద్ధంలో ఉన్న ఉభయపక్షాల మధ్య రాజీకుదర్చే బాధ్యత ప్రధానంగా పాకిస్థాన్‌ తీసుకోదల్చుకుంది.


పాకిస్థాన్‌ ప్రధానికంటే, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసీమ్‌ మునీర్‌ మీద అమెరికా అధ్యక్షుడికి వల్లమాలిన ప్రేమ, విపరీతమైన నమ్మకం. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం అతనిని వైట్‌హౌస్‌కు ఆహ్వానించి, సత్కరించి, భోజనం పెట్టి, వీరాధివీరుడంటూ పొగడ్తల్లో మరీ ముంచెత్తారు ట్రంప్‌. ఇరాన్‌తో రాబోయే యుద్ధానికి ఆసీమ్‌ను అప్పటినుంచే సన్నద్ధం చేశారు ట్రంప్‌. ఇప్పుడు కాలువెనక్కుతీసుకోవడానికి కూడా ట్రంప్‌కు అదే మునీర్‌ ఉపకరిస్తున్నారు. పాకిస్థాన్‌లో అత్యంత శక్తిమంతమైన ఈ సైనికాధికారి అటు ట్రంప్‌తోనూ, ఇటు ఇరాన్‌లోని ఐఆర్‌జీసీ అధినాయకత్వంతోనూ నేరుగా మాట్లాడగల సమర్థుడని అంటారు. ఒకపక్క పరస్పరదాడులు చేసుకుంటూనే, మెట్టుదిగింది తాము కాదని దబాయిస్తూనే, శత్రుపక్షాలూ రెండూ మాటలు కలిపాయన్నది స్పష్టం. ఇచ్చిపుచ్చుకుంటున్న జాబితాల్లోనూ, ప్రణాళికల్లోనూ ఎవరు ఎంతమేరకు దిగివస్తారో చూడాలి. ఇరాన్‌ పక్షాన అంతిమ నిర్ణయం తీసుకోగల స్థితిలో ఖమేనీ ఉన్నారా అన్న అనుమానాలను అటుంచితే, ట్రంప్‌ వ్యాఖ్యానించినట్టుగా ఇరాన్‌నుంచి కూడా మిగిలిన ఆ కొద్దిమంది ముఖ్యులే చర్చల్లో పాల్గొనాలి. మొత్తానికి, యుద్ధకాలమంతా ఉత్తి ఖండనమండనలు వినా, గట్టిగా నోరువిప్పని పాకిస్థాన్‌ రాజీకుదర్చే విషయంలో మాత్రం చురుకైన పాత్రకు సిద్ధపడుతోంది. అది అంతిమంగా యుద్ధాన్ని ఆపగలదా, ఒకవేళ ఒప్పందం అంటూ కుదిరితే రేపటిరోజుల్లో ఉల్లంఘనలను నిలువరించగలదా? ఖతార్‌, ఒమన్‌ల మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలను రెండుసార్లు దాడులతో భగ్నం చేసిన అమెరికా, నిజంగానే పాకిస్థాన్‌కు విలువనిస్తుందా? వంటి ప్రశ్నలు, అనుమానాలు అనేకం ఎలాగూ ఉంటాయి. కానీ, ఒక ఒప్పందం అంటూ కుదర్చి యుద్ధాన్ని ఆపగలిగితే పాకిస్థాన్‌కు అది మంచి దౌత్యవిజయం. అమెరికా, సౌదీ, ఇరాన్‌లతో ఉన్న సంబంధాలు మరింత బలపడి, ఆర్థికంగా పుంజుకోవడానికీ దానికి వీలు కలుగుతుంది.

ఇవి కూడా చదవండి..

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

Updated Date - Mar 26 , 2026 | 01:09 AM