Share News

ఇరకాటంలో ట్రంప్‌!

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:11 AM

ఇరాన్‌ను దుంపనాశనం చేశామని అప్పుడెప్పుడో ఢంకా బజాయించిన అమెరికా అధ్యక్షుడికి మిత్రదేశాల సాయం ఎందుకు? వేలాది క్షిపణులతో ఇరాన్‌ను నేలమట్టం చేశాననీ, యుద్ధభూమిలో...

ఇరకాటంలో ట్రంప్‌!

ఇరాన్‌ను దుంపనాశనం చేశామని అప్పుడెప్పుడో ఢంకా బజాయించిన అమెరికా అధ్యక్షుడికి మిత్రదేశాల సాయం ఎందుకు? వేలాది క్షిపణులతో ఇరాన్‌ను నేలమట్టం చేశాననీ, యుద్ధభూమిలో కాలూనగానే అపారవిజయాలు పోగేసుకున్నానని గర్జించిన ఈ మహాయోధుడికి ఇప్పుడు మిగతావారి చేతిసాయం ఎందుకు అవసరపడింది? యుద్ధం మొదలైన కొద్దిరోజుల్లోనే బ్రిటన్‌ ప్రధాని భయంతోనో, భక్తితోనే తానూ ఓ చేయి వేస్తానంటే, అవమానించి, చీదరించి, తనబోటి జగజ్జేతలకు ఎవరి సాయమూ అక్కరలేదు పొమ్మన్నాడు ట్రంప్‌. అలా చేయి విదిలించికొట్టిన ఈ పెద్దమనిషే ఆ తరువాత చేయిచాచి బ్రిటన్‌ను తోడురమ్మన్నాడు. ఆ దేశం సున్నితంగా తిరస్కరించినందుకు ఆగ్రహించాడు, అలకబూనాడు. మిగతా ప్రపంచాన్ని యుద్ధభయంలోకీ, ఇంధన సంక్షోభంలోకీ నెట్టేసిన అమెరికా అధ్యక్షుడు బ్రిటన్‌ వైఖరితో తాను హ్యాపీగా లేనన్నాడు. పిలవగానే ‘నాటో’ పరిగెత్తుకొచ్చి జలసంధినుంచి తనను బయటపడేస్తుందని ఈయన అనుకున్నాడు. ఇది మా యుద్ధం కాదు అని వాళ్ళంతా అనేసరికి, మీ బతుకు బండలవుతుంది, భవిష్యత్తు నాశనమైపోతుంది అంటూ శాపాలు పెడుతున్నాడు. ఏకపక్షంగా యుద్ధాన్ని ఆరంభించిన ట్రంప్‌కు రణభూమిలో ఊహించని చిక్కులు ఎదురవుతూ, దెబ్బలు తగులుతూండటంతో మిత్రులు అవసరపడ్డారు. కాలు వెనక్కుతీసుకోవడానికి కాస్తంత సాయం కావాల్సివచ్చింది.

ఇరాక్‌ యుద్ధంలో అమెరికా వినిపించిన కట్టుకథలన్నింటినీ తలూపి, అణ్వాయుధాలున్నాయన్న ఆరోపణ సహా అన్నింటినీ సమర్థించి కలసికట్టుగా రంగంలోకి దిగినట్టుగా, ఇప్పుడూ మిత్రదేశాలు తోడురావాలనుకున్నాడు అమెరికా అధ్యక్షుడు. కానీ, గత అమెరికా అధ్యక్షులెవరూ పెట్టనన్ని కష్టాలు, అవమానాలను ట్రంప్‌ నుంచి భరించిన పాశ్చాత్య మిత్రదేశాలు పిలవగానే సాయం చేయకుండా కాస్తంత కక్ష తీర్చుకుంటున్నాయి. ఇలా సాయం కోరితే, యుద్ధక్షేత్రంలో ఎక్కడ తనది పైచేయి కాలేదని మిగతా ప్రపంచం ఎక్కడ అనుకుంటుందోనని ట్రంప్‌కు భయం కలిగి, మిత్రదేశాలు ఎలా స్పందిస్తాయో జస్ట్‌ టెస్ట్‌ చేశానంటూ మళ్ళీ పాత గొప్పలు మొదలుపెట్టాడాయన. ఇరాన్‌ నాయకుల హత్యలను, దాడులను అత్యంత అవమానకరమైన, ఉన్మాదపూరితమైన భాషలో అభివర్ణించడంతో పాటు, ఖర్గ్‌పై సరదాకు మరిన్ని దాడులు చేస్తానంటున్నాడు.


లారిజానీ వంటివారిని ఎందరిని హతమార్చినా, ఇరాన్‌ తనకుతానుగా దిగిరాదు. రాజీకి వచ్చే, యుద్ధం నిలిపివేసే ఆలోచన లేదని ఇరాన్‌ స్పష్టంగా చెబుతోంది. ఖమేనీ మరణానంతరం ఇరానీయన్లు తమ పాలకులమీద తిరుగుబాటు చేస్తారన్న అంచనాలు కూడా తారుమారైనాయి. ఇంతకుమించిన తరుణం మీకు దొరకదని అమెరికా, ఇజ్రాయెల్‌ అదేపనిగా పోరుతున్నా జనం స్పందించడం లేదు. ఐక్యరాజ్యసమితి అనుమతిలేకుండా, కేవలం ఇజ్రాయెల్‌ కోసం ట్రంప్‌ చేస్తున్న ఈ యుద్ధంలో తాము కత్తిదూయడం అవసరమా అని మిత్రదేశాల సంశయం. తాను యుద్ధవ్యతిరేకినని, తనకు పూర్వం అధ్యక్షులుగా ఉన్నవారంతా అమెరికాను సుదీర్ఘకాలం యుద్ధాల్లో ముంచి అమెరికన్ల ధనాన్ని అపారంగా వృధాచేశారని ఎన్నికల ప్రచారాల్లో విమర్శించిన ట్రంప్‌, ఇప్పుడు అదేపనిగా యుద్ధాల్లో మునిగితేలడం అమెరికన్లకు కూడా నచ్చడం లేదని సర్వేలు చెబుతున్నాయి. నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌ అధిపతిగా ట్రంప్‌ నియమించిన జోసెఫ్‌ కెంట్‌ లేఖ 18 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో డొల్లతనానికి అద్దంపడుతుంది. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రతీ విషయంలోనూ ఇప్పటివరకూ ట్రంప్‌ను వెనకేసుకొచ్చిన జోసెఫ్‌ కెంట్‌, ఇకపై తాను ఆత్మసాక్షిని చంపుకొని ఈ పాపిష్టి యుద్ధాన్ని సమర్థించలేననీ, ఇరాన్‌తో అమెరికాకు ఏ ప్రమాదమూ లేదని స్పష్టంగా ప్రకటించి రాజీనామా చేయడం విశేషం. యుద్ధం జరుగుతున్న కీలకసమయంలో ఒక అత్యున్నతస్థాయి భద్రతాధికారి తిరుగుబాటుచేయడం ట్రంప్‌కు ఎదురుదెబ్బ. తొలిగంటలోనే యుద్ధం ముగిసిందని ఆదిలో గొప్పకు పోయిన ట్రంప్‌, ఇప్పుడు తాను తలుచుకున్నప్పుడే యుద్ధం ఆగుతుందని అంటున్నారు. బలమైన శత్రువుతో నేరుగా పోరాడలేని ఇరాన్‌, యుద్ధ ప్రభావాలను విస్తరింపచేసి మిగతా ప్రపంచాన్ని కష్టాల్లోకి నెడుతోంది. యుద్ధం కేవలం చమురు, గ్యాస్‌ సరఫరాలనే కాక, సమస్త రంగాలనూ, దైనందిన జీవితాలనూ ప్రభావితం చేస్తోంది. ఒక క్షిపణితో 170 మంది స్కూలు పిల్లలను చంపి ఎగిరిపడుతున్న ట్రంప్‌కు మిత్రదేశాలు ఆయుధసాయం కంటే, మాటసాయంతో యుద్ధం ముగించే మార్గాన్ని తెలియచెప్పడం మంచిది.

ఇవి కూడా చదవండి..

ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన

Updated Date - Mar 18 , 2026 | 01:11 AM