Share News

తీరిన ముచ్చట!

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:34 AM

నా లక్ష్యం నెరవేరిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముచ్చటపడుతున్నారు. దానికంటే ముఖ్యంగా, తన బెదిరింపులకు జడిసి ప్రత్యర్థులు కాళ్ళబేరానికి వచ్చారని చూపుకోవడం ఆయనకు మరింత సరదా...

తీరిన ముచ్చట!

నా లక్ష్యం నెరవేరిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముచ్చటపడుతున్నారు. దానికంటే ముఖ్యంగా, తన బెదిరింపులకు జడిసి ప్రత్యర్థులు కాళ్ళబేరానికి వచ్చారని చూపుకోవడం ఆయనకు మరింత సరదా. మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, అమెరికా, డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ట్రంప్‌ ఆకాశానికి ఎత్తేశారు. ఈ త్రైపాక్షిక ఒప్పందంతో గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా మరో రెండు సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకొనేందుకు వీలుకలుగుతుందట. అమెరికా ఉనికిని పెంచడంతోపాటు, దాని ప్రత్యర్థులెవ్వరూ ఆ ద్వీపంలో కాలూనకుండా ఈ కొత్త ఒప్పందం నిరోధిస్తుందే తప్ప, అమలులో ఉన్న 1951నాటి ఒప్పందాన్ని వమ్ముచేసే అంశాలేవీ ఇందులో లేవని గ్రీన్‌లాండ్‌, డెన్మార్క్‌ చెబుతున్నాయి. తాను చేసిన ఈ సంతకంతో అమెరికాకు ఆర్కిటిక్‌ మీద శాశ్వత నియంత్రణ దఖలుపడినట్టుగా ట్రంప్‌ వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అదేపనిగా ట్రంప్‌ బెదిరిస్తూ వచ్చిన నేపథ్యంలో ఈ ఒప్పందం జరిగిందన్నది నిజం. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు అమ్మేయాలని, లేదంటే సైనికచర్యతోనైనా దానిని స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వేధించడం మొదలుపెట్టి, ఈ ఏడాది జనవరిలో ఆయన ఏకంగా కెనడా, వెనెజువెలా, గ్రీన్‌ల్యాండ్‌లను అమెరికా మ్యాప్‌లో కలిపేసి తన ట్రూత్‌సోషల్‌లో ఆ చిత్రాన్ని పోస్టుచేశారు కూడా. కృత్రిమమేధతో రూపొందిన ఆ రెండు చిత్రాల్లో ఒకదానిలో ఆయన గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా జెండా పాతుతున్నారు, మరోదానిలో ఈ సరికొత్త అమెరికా మ్యాప్‌ వెనుక ఉండగా, యూరోపియన్‌ కమిషన్‌, నాటో సెక్రటరీ జనరల్‌ సహా మిగతా దేశాధినేతలంతా ఆయన చెబుతున్నదానిని నోరుమూసుకొని వింటున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ విషయంలో తానేంచేసినా ఈయూ మారుమాట్లాడబోదని దాని అర్థం. అమెరికా అంత బలమైన దేశం ప్రపంచంలోనే లేదనీ, దాని రక్షణకు గ్రీన్‌ల్యాండ్‌ అత్యావశ్యకమని, అమెరికా రక్షకుడినైన తాను గనుక ఊరుకుంటే చైనా, రష్యాల చేతుల్లోకి గ్రీన్‌ల్యాండ్‌ పోతుందని బెదిరించేవారు ట్రంప్‌. అమ్ముడుపోతారా, ఆక్రమించుకోమంటారా అంటూ ఆయన అదేపనిగా హెచ్చరికలు చేస్తూండటంతో ఈ ఆర్కిటిక్‌ ద్వీపకల్పాన్ని పాక్షికంగా నియంత్రిస్తున్న డెన్మార్క్‌ అక్కడకు సైన్యాన్ని కూడా పంపి, తన ప్రతిఘటన తెలియచేసింది. ‘నోరాడ్‌’లో భాగంగా అమెరికన్‌ యుద్ధ విమానాలను గ్రీన్‌ల్యాండ్‌కు తరలించి ఉద్రిక్తతలను పెంచేశారు ట్రంప్‌. తాము డెన్మార్క్‌ యూనియన్‌లోనే ఉంటామని గ్రీన్‌ల్యాండర్స్‌ ముక్తకంఠంతో నినదించారు, రోడ్లమీదకు వచ్చారు. గ్రీన్‌ల్యాండ్‌ను కొందామా, కొట్టేద్దామా అన్నది ట్రంప్‌ త్వరలోనే నిర్ణయిస్తారంటూ ఆయన మంత్రులంతా అదేపనిగా చెబుతూండేవారు. అమెరికా పక్షాన నిలవకుండా డెన్మార్క్‌ను వెనకేసుకొస్తున్నందుకు ఐరోపా దేశాల మీద ట్రంప్‌ విరుచుకుపడేవారు.


ఏఐ మ్యాప్‌లో వెనెజువెలాను కలిపేసుకున్న ట్రంప్‌, అంతిమంగా దాని విలీనాన్ని ఎలా సాధించాడో తెలిసిందే. గ్రీన్‌ల్యాండ్‌ లక్ష్యాన్ని కూడా ఆయన వదిలిపెట్టడన్నది ఊహించిందే. భౌతికంగా దానిని దురాక్రమించకుండా ఈ ఒప్పందం ద్వారా తాను కోరిన దానిలో కొంత నెరవేర్చుకున్నాడాయన. గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటికే ఉన్న అమెరికా స్థావరాలను బలోపేతం చేయడం, విస్తరించడం, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఒప్పందం వీలుకల్పిస్తుంది. నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి దీనితో ముగిసిందనీ, తమ సార్వభౌమత్వానికీ, ప్రాదేశిక సమగ్రతకు, గ్రీన్‌ల్యాండ్‌ ప్రజల స్వీయ నిర్ణయాధికారానికీ ఈ ఒప్పందంతో ఏ లోటూ రాదని డెన్మార్క్‌ చెప్పుకుంటోంది. ఈ కీలక ప్రాంతంలో భద్రత, సహకారాలకు ఇక ఏ అడ్డంకులూ ఉండవని నాటో చప్పట్లు చరుస్తోంది. ఈ ఒప్పందంతో అమెరికాకు దక్కింది కానీ, డెన్మార్క్‌ కోల్పోయింది కానీ పెద్దగా లేదని, అయితే, ‘పర్మనెంట్‌ కంట్రోల్‌’ అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలో పరమార్థం భవిష్యత్తులో తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఉపరితలంలో కథ సుఖాంతమైనట్టు కనిపించినా, ట్రంప్‌ అనుచిత, అహంకార ధోరణిని డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ ఎన్నటికీ విస్మరించలేవు.

ఈ వార్తలనూ చదవండి:

రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు

హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్

Updated Date - Sep 24 , 2026 | 01:34 AM