Share News

మరో ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:55 AM

అమెరికాలో పుట్టిన పిల్లలందరూ అమెరికన్లే అంటూ సుప్రీంకోర్టు బల్లగుద్ది తీర్పుచెప్పడంతో ఆత్మరక్షణలో పడిన డోనాల్డ్‌ ట్రంప్‌ మరో ప్రతిపాదనతో సరికొత్త వివాదానికి సిద్ధపడుతున్నారు. గర్భవతులైన ఇతరదేశాల...

మరో ఎదురుదెబ్బ

అమెరికాలో పుట్టిన పిల్లలందరూ అమెరికన్లే అంటూ సుప్రీంకోర్టు బల్లగుద్ది తీర్పుచెప్పడంతో ఆత్మరక్షణలో పడిన డోనాల్డ్‌ ట్రంప్‌ మరో ప్రతిపాదనతో సరికొత్త వివాదానికి సిద్ధపడుతున్నారు. గర్భవతులైన ఇతరదేశాల మహిళలను అమెరికాలో కాలూనకుండా నిలువరించడం ద్వారా, జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేయాలన్న తన ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చునని ఆయన ఆలోచన. అమెరికాలో పుట్టే పిల్లల హక్కులకు సంబంధించిన వివాదం ఇకపైన గర్భధారణ, ప్రయాణాలు, పౌరసత్వం, ఆ దేశంలో పర్యటించే లేదా ప్రవేశించే హక్కు ఇత్యాది అనేక అంశాల చుట్టూ తిరగవచ్చు.

అత్యంత వివాదాస్పదమైన తన ఆదేశాలను కోర్టులు కొట్టివేస్తాయని ట్రంప్‌కు తెలియకపోదు. చట్టబద్ధంగా నడుచుకోవడం, న్యాయంగా వ్యవహరించడం ఆయనకు ముఖ్యం కాదు. తన రాజకీయప్రయోజనాల పరిరక్షణే ఆయనకు ప్రధానం. న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తింటున్నప్పుడల్లా ఆయన న్యాయమూర్తులను నిందిస్తూ, తాను అమెరికాను గ్రేట్‌ చేయబోతూంటే వీరంతా అడ్డుపడుతున్నట్టుగా వ్యాఖ్యానిస్తూంటారు. తాను అనుకున్నది సాధించడానికి మరిన్ని అడ్డదారులు వెతుకుతుంటారు. అమెరికా పౌరులకు జన్మతః దఖలుపడిన హక్కులను వేరేతోవలో ఎవరెవరో వచ్చి తన్నుకుపోతూంటే అధ్యక్షులవారు చూస్తూ ఊరుకోరు అని వైట్‌హౌస్‌ ప్రతినిధి నుంచి ట్రంప్‌ అనుచరగణం వరకూ అంతా చెబుతున్నారు. కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కడం కోసం అక్కడకు వెళ్ళి ప్రసవించే వారి విషయంలో ఏమిచేయాలో, కఠినంగా ఎలా వ్యవహరించాలో తేల్చేపని అయితే గట్టిగానే సాగుతోంది. అమెరికాలో ఏటా జరిగే ప్రసవాలతో పోల్చినప్పుడు ఈ ‘బర్త్‌టూరిజం’ బేబీలసంఖ్య అతిస్వల్పమే. అయినప్పటికీ అమెరికన్ల హక్కుల పరిరక్షణకోసం తాను ఎంతటి తీర్పునైనా వమ్ముచేస్తానని చెప్పుకోవడం కోసం ఆయన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూనే ఉంటారు.


దేశాధ్యక్షుడుగా రెండోసారి ప్రమాణం చేసిన మరుక్షణం ట్రంప్‌ జారీ చేసిన ఈ ఉత్తర్వులను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అమెరికా ఔన్నత్యం, రాజ్యాంగఆశయాలు, ఆదర్శాలను ఏకరువుపెట్టారు. అమెరికా పౌరసత్వం గొప్పదనం, ఆ గడ్డమీద పుట్టే ప్రతి ఒక్కరికీ సర్వహక్కులూ దక్కుతాయన్న రాజ్యాంగ రూపకర్తల హామీలు, ౧4వ రాజ్యాంగ సవరణను పరిరక్షించాల్సిన తమ కర్తవ్యం గురించి లోతుగా విశ్లేషించారు. అమెరికాలో పుట్టినందుకు సర్వహక్కులూ సిద్ధించడంతో పాటు, అక్కడి రాజకీయవ్యవస్థల్లో స్వేచ్ఛగా భాగస్వామ్యం పొందేందుకు ఈ సవరణ వీలుకల్పిస్తోందని కూడా కోర్టు గుర్తుచేసింది. కార్యనిర్వాహక ఆదేశాలతో రాజ్యాంగ మౌలికసూత్రాలను వమ్ముచేయడానికి ట్రంప్‌ చేసిన ప్రయత్నాన్ని అది అడ్డుకుంది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని ఎవరూ కాదనలేరని పద్నాల్గవ రాజ్యాంగ సవరణ ఆధారంగా నిగ్గుతేల్చి, తదనంతర దేశాధ్యక్షులు సైతం అటువంటి సాహసానికి పూనుకోకుండా నిరోధించింది. దానిని రద్దుచేసే ఏ ప్రయత్నానికైనా ఉభయసభల్లో మూడింట రెండువంతుల బలం కావాలి. రాష్ట్రాల ధ్రువీకరణకు సైతం హెచ్చు సంఖ్యాబలం అవసరం.

ఇమ్మిగ్రేషన్‌ నియమాల విషయంలో ఉన్న గందరగోళాన్నీ, చీటికీమాటికీ జరుగుతున్న మార్పులతో ఏర్పడిన మరింత అభద్రత గల వాతావరణాన్ని కోర్టు ఈ దెబ్బతో సరిచేసింది. ఈ తీర్పు అనేకదేశాలవారికి, ప్రధానంగా భారతీయులకు మేలు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న వలస సమూహాల్లో భారతీయ సంతతి జనాభా ఒకటి. హెచ్‌1బి, ఎల్‌1, ఎఫ్‌1 ఇత్యాది అనేక రకాల వీసాలతోనూ, అక్రమంగానూ ఆ దేశంలో నిత్యం బతుకుభయంతో ఉంటున్న లక్షలాదిమందికి ఈ తీర్పు మంచి ఊరట. జన్మతః పౌరసత్వ హక్కుకు స్వస్తిపలకాలని కృతనిశ్చయంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు వేరుమార్గాల్లో, మారురూపాల్లో తన పోరాటాన్ని ఎలాగూ కొనసాగిస్తూనే ఉంటారు. నవంబరులో ఉన్న మధ్యంతర ఎన్నికలు ఆయనకు ఎక్కడలేని శక్తినీ ఇస్తాయి. రెండుసార్లు అభిశంసనకు గురై, నలభై అపరాధాలు రుజువైన ట్రంప్‌కు అవమానం కొత్తేమీ కాదు. అమెరికాను ఉన్నతంగా నిలబెడతానంటూ దానికి ఉన్న ఆ కాస్త విలువలనూ ఒలిచిపారేసే పనిలో ఉన్నారాయన.

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 12:55 AM